పీసీపల్లి, న్యూస్‌లైన్: వర్షాభావానికి తోడు విద్యుత్ కోతలతో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. తెగుళ్ల విజృంభణతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పీసీపల్లి మండలంలో 4 వేల హెక్టార్లకు పైగా బత్తాయి సాగు చేశారు. సీజన్‌లో పీసీపల్లి నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, చెన్నై తదితర ప్రాంతాలకు బత్తాయి ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం చెట్లను బతికించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. సాగునీరందక 1500 హెక్టార్లలో బత్తాయి తోటలు ఎండిపోయాయి. కరెంటు సమస్య ఎలా అధిగమించాలో..ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు విద్యుత్ సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు.
ఆదుకోని సబ్సిడీ పథకాలు: మండలంలోని 4 వేల హెక్టార్లలో బత్తాయి సాగు చేశారు. కానీ సాగు చేసిన సమయం నుంచి సబ్సిడీ పథకం కింద వచ్చే ఎరువులు కానీ, పరికరాలు కానీ రైతుల దరిచేరలేదు. చెట్లు పెరిగినప్పుడు కట్ చేసుకోవడానికి కూలి ఖర్చుల కోసం‘కొమ్మ కత్తెర పథకం’ కింద 50 శాతం రాయితీ ప్రభుత్వం అందించాల్సి ఉండగా మండలంలోని ఏ ఒక్కరూ ఈ పథకం కింద లబ్ధి పొందలేదు.
కనపడని ఉద్యానవన శాఖాధికారులు: వివిధ పథకాల కింద రైతులకు చేయూతనివ్వాల్సిన ఉద్యానవన శాఖాధికారులు మండలం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. రైతులు నానా అవస్థలు పడి కనిగిరి ఉద్యానవన శాఖ కార్యాలయానికి వస్తే అది ఎప్పుడూ మూసివేసి ఉంటుంది. ఒక వేళ తెరిచి ఉంటే సబ్సిడీలో ఎటువంటి ఎరువులు కానీ పరికరాలు కానీ లేవని రైతులకు చెప్తారు. దీంతో రైతులు వెనుతిరుగుతున్నారు.
తప్పని తెగుళ్ల బెడద
పండ్ల తోటలకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. ఏ తెగుళ్లకు ఏ మందు కొట్టాలో ఎవరిని అడగాలో రైతులకు తెలియని పరిస్థితి. ఇటీవల తెగుళ్లు సోకి ఎండిపోవడంతో ధర్మవరపు వెంకటేశ్వర్లు మూడెకరాలు బత్తాయి తోట కొట్టివేశారు. రైతులకు సమస్యలు, సలహాలు అందించేవారు లేకపోవడంతో పండ్ల తోటలు పెంచడం పెద్ద సవాలుగా మారింది.
బత్తాయి రైతుకు విద్యుత్ షాక్
Published Mon, Feb 17 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement