Subsidy scheme
-
గుడ్‌న్యూస్.. ఈవీ సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
ఎలక్ట్రిక్ వాహనాలపై అందించే అందించే సబ్సిడీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఫేమ్-2 పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇందు కోసం రూ. 778 కోట్లు అదనంగా కేటాయిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ పథకం కింద 5,00,080 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 60,709 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు మొత్తంగా 5,60,789 ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే అధునాతన బ్యాటరీలతో కూడిన ఈవీలకు మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. ప్రైవేట్ లేదా కార్పొరేట్ యాజమాన్యంలోని రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కూడా ఈ పథకం కింద అర్హత ఉంటుంది.ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) రెండవ దశ గడువు ముగియడానికి ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం ఈఎంపీఎస్ 2024ని ప్రకటించింది. రూ.500 వ్యయంతో నాలుగు నెలలపాటు జూలై 31 వరకు 3,33,387 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 13,590 ఎలక్ట్రిక్ త్రీవీలర్లకు మద్దతు ఇవ్వడానికి దీన్ని అమలు చేశారు. -
ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీ పథకం ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ సబ్సిడీ పథకం శనివారం నుంచి ప్రారంభమైంది. రాయితీ కావాలనుకునే వారు 7011311111 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజీ పంపొచ్చునంటూ గత నెలలో సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకు విద్యుత్ ఫీజు బకాయి లేని గృహ వినియోగదారులే రాయితీకి అర్హులు. అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా సబ్సిడీ వర్తిస్తుందని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచితంగా, 400 యూనిట్ల వరకు వినియోగించుకునే వారికి 50% సబ్సిడీతో ఢిల్లీ ప్రభుత్వం విద్యుత్ అందిస్తోంది. ఇందులో ఢిల్లీలోని మొత్తం 58 లక్షల గృహ విద్యుత్ వినియోగదారుల్లో 47 లక్షల మంది సబ్సిడీ పొందుతున్నారు. -
గేదెల సబ్సిడీ కొందరికే..
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రం (డెయిరీ)కి రోజూ పాలు సరఫరా చేస్తున్నప్పటికీ సబ్సిడీ గేదె పథకం జాబితాలో అర్హుల పేర్లు లేవు. పథకంలో వందలాది మందికి మొండి చెయ్యే ఎదురైంది. కేవలం 76 మంది పేర్లను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి డెయిరీకి వీళ్లే పాలు సరఫరా చేశారా అంటే అదీకాదు.. మిగితా వారు సరఫరా చేసినప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. అలా ఎందుకు జరిగిందంటే అధికారులు చెప్పే సమాధానం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది. ఎంపికలో గందరగోళం.. ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో డీఆర్డీఏ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ఈ పాలను పాల శీతలీకరణ కేంద్రం ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య అనుబంధ రంగ సంస్థ విజయ డెయిరీకి ఇక్కడి నుంచి పాలను పంపించడం జరుగుతుంది. కాగా పాడి రైతులకు సబ్సిడీ ద్వారా గేదెను అందజేసే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో లబ్ధిదారుల జాబితా ఎంపిక ప్రక్రియను విజయ డెయిరీకి అప్పగించడం జరిగింది. ఆన్లైన్ పద్ధతిన ఈ–ల్యాబ్‌లో అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలో డెయిరీకి పాలు సరఫరా చేస్తూ లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న వారి పేర్లను ఈ–ల్యాబ్‌లో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడే ఐకేపీ అధికారులు, విజయ డెయిరీ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. విజయ డెయిరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గడిచిన ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు పంపించామని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. వారు పంపిన పేర్లనే తామూ పరిగణనలోకి తీసుకున్నామని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరి నిర్వాకంతో అర్హులైన పలువురు పాడి రైతులకు మొదటి దశలోనే సబ్సిడీ గేదె అందకుండా పోతోంది. కేవలం బరంపూర్, రుయ్యాడి, ఆదిలాబాద్ గ్రామాలకు చెందిన కొంతమంది పాడి రైతులను ఎంపిక చేశారు. దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏళ్లుగా పాలు పోస్తున్నా మొండి చెయ్యే.. ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్‌తో పాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎన్నో ఏళ్లుగా పలువురు పాడి రైతులు పాలశీతలీకరణ కేంద్రంలో పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ గేదె విషయంలో మాత్రం వీరికి మొండిచెయ్యి ఎదురైంది. లీటర్ పాలకు రూ.4 ఇన్సెంటివ్ కూడా పొందినవారిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా ఏడాదిలో ఒక వేసవిలో మినహాయించి మిగితా కాలంలో పాలశీతలీకరణ కేంద్రానికి భారీగా పాల సరఫరా జరుగుతుంది. నెలకు 6 వేల లీటర్ల నుంచి 10 వేల లీటర్ల వరకు, కొన్నిసార్లు 12 వేల లీటర్ల వరకు కూడా పాల సేకరణ జరుగుతుంది. అయితే వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో పలువురు రైతులు పాలశీతలీకరణ కేంద్రానికి పాలు సరఫరా నిలిచిపోతుంది. అలాంటప్పుడు ఏప్రిల్, మే నెలల్లో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే పంపాలని విజయ డెయిరీ ప్రతినిధులు కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టని విషయం. ఒకవేళ విజయ డెయిరీ ప్రతినిధులు కేవలం రెండు నెలల వివరాలు మాత్రమే అడిగిన పక్షంలో మిగితా ఏడాదిలో పాలు సరఫరా చేసిన రైతుల పరిస్థితిపై తెలియజేయకపోవడంతో ఇటు ఐకేపీ సంఘాల ప్రతినిధులతో పాటు పశుసంవర్థక శాఖ అధికారుల వైఫ ల్యం కనిపిస్తోంది. విజయ డెయిరీ ఎంపిక చేసిన జాబితాను పశుసంవర్థక శాఖకు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్ అనుమతి పొంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ జరుగుతుంది. నిర్వహణలో లోపభూయిష్టం.. ఆదిలాబాద్‌లో పాలశీతలీకరణ కేంద్రం నిర్వహణ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా జిల్లాలో కేవలం వడ్డాడి, రుయ్యాడి, బరంపూర్‌లో మాత్రమే మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న పాడి రైతులు ఉత్పత్తి అయిన పాలను పెద్ద మొత్తంలో ఆయా కలెక్షన్ సెంటర్లో అందజేయడం జరుగుతుంది. అక్కడ పెయిడ్ సెక్రెటరీ వారి వివరాలను నమోదు చేసి ఆ పాలను పాల శీతలీకరణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడే లోపం ఎదురవుతుంది. ప్రధానంగా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అన్ని గ్రా మాల రైతులకు అనువుగా లేకపోవడంతో వారు నేరుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రానికి వెళ్లి విక్రయించడం జరుగుతోంది. నేరుగా వెళ్లే రైతులను వ్యక్తిగతంగా పాలు అమ్మే కోవలో పరిగణనలోకి తీసుకుని వారికి ప్రభుత్వం ద్వారా అందజేసే లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ అందకుండా పోతోంది. మిల్క్ కలెక్షన్ సెంటర్లో పా లు పోసిన రైతుల వివరాలు మాత్రమే విజయ డె యిరీకి పంపించినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. దీంతో కొంత మంది పాడి రైతులకే గేదె ప్రయోజనం దక్సాల్సి ఉండగా, మిగితా రైతుల కు మొండి చెయ్యి ఎదురవుతుంది. పాడి రైతుల ఆవేదన.. కేవలం 76 మంది రైతులను మాత్రమే సబ్సిడీ గేదెకు అర్హులుగా ఎంపిక చేయడంపై పలువురు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోజూ డెయిరీ కేంద్రానికి వస్తున్నారు. దీంతో తమ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న అధికారులు మరో 122 మంది రైతులను గుర్తించి రెండో విడత కింద వారికి సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక అనుమతితో వారికి సబ్సిడీ గేదెలను అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొం టున్నారు. మిగతా రైతులను సొసైటీల ద్వారా ఎంపిక చేసి వారికి న్యాయం చేస్తామని నమ్మబలుకుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సొసైటీలు లేకపోవడంతో ఇప్పట్లో పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ముందునుంచి సొసైటీల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఏప్రిల్, మే నెలలో సరఫరా చేసిన వారి పేర్లు అడిగారు పాల శీతలీకరణ కేంద్రానికి ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే అడిగారు. అందుకు తగినట్లు వారి వివరాలను పంపించాం. కొన్నేళ్లుగా సరఫరా చేసిన వారి పేర్లు అడిగి ఉంటే అలాగే పంపించేవాళ్లం. పలువురు పాడి రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, పాస్‌బుక్, పాస్ ఫొటోలు, ప్రొఫార్మాలు సేకరించి విజయ డె యిరీకి పంపించినప్పటికీ వారు తిరిగి ఈ–ల్యాబ్‌లో ఆదిలాబాద్‌లోనే నమోదు చే యాలని పంపించారు. పైనుంచి వ చ్చిన ఆదేశాలకనుగుణంగా నడుచుకున్నాం. – వసంత్, మేనేజర్, పాలశీతలీకరణ కేంద్రం మరో 122 మంది జాబితా.. మొదట ఎంపిక చేసిన 76 మంది లబ్ధిదారుల జాబితాతో పాటు మళ్లీ ప్రత్యేక అనుమతితో మరో 122 మంది పాడి రైతులను ఎంపిక చేశాం. మొదట 76 మంది రైతులకు సబ్సిడీ గేదెలను అందజేయనున్నాం. ఇప్పటికే సుమారు 40 మంది డీడీలు కట్టారు. వారికి ఈ మూడునాలుగు రోజుల్లో గేదెలను పంపిణీ చేస్తాం. ఆ తర్వాత ఈ 122 మందిని పరిగణనలోకి తీసుకుంటాం. సొసైటీల ఏర్పాటు జరుగుతుంది. వారికి కూడా గేదెలను అందజేసే అవకాశం ఉంది. ఐకేపీ నుంచి వచ్చిన జాబితాను అనుగుణంగానే లబ్ధిదారులను ఎంపిక చేశాం. లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్ పొందుతున్న రైతులను పరిగణనలోకి తీసుకున్నాం. – నాగేశ్వర్రావు, డీఎం, విజయ డెయిరీ -
వాణిజ్య పంటలకు ఒక్కసారే పెట్టుబడి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వేస్తే రబీలోనూ కొనసాగే వాణిజ్య పంటలకు ఒక సీజన్‌కు మాత్రమే పెట్టుబడి రాయితీ పథకం వర్తించనుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో వేసే పత్తి, మిర్చి, పసుపు రైతులకు ఒకసారే పెట్టుబడి కింద రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. అవి రబీలోనూ కొంతకాలం కొనసాగనున్నందున ఆ రైతులకు రెండో సీజన్ కింద పెట్టుబడి సొమ్ము చెల్లించే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ వర్గాలు తేల్చిచెప్పాయి. ఆ ప్రకారం పత్తి, మిర్చి, పసుపు సాగు చేసే రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.4 వేలు అందజేస్తారు. వాస్తవానికి సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు రైతులకు అందించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ రైతులు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ఏడాదిపాటు ఉండే చెరకు పంటకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు ఇస్తారు. అలాగే పండ్లు, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రెండు సీజన్ల డబ్బులు అందుతాయి. సగం వాటా ఆ పంటలదే రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, మిర్చి 1.70 లక్షల ఎకరాలు, పసుపు 1.17 లక్షల ఎకరాలు. ఈ మూడింటి సాధారణ సాగు విస్తీర్ణమే 44.77 లక్షల ఎకరాలు. 2017–18 ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 97.45 లక్షల ఎకరాల్లో సాగవ్వగా.. అందులో పత్తి 47.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి తీత మూడు సార్లు కొనసాగుతుంది. పరిస్థితి బాగుంటే నాలుగో సారి తీస్తారు. ఖరీఫ్‌లో వేసే ఈ పంట జనవరి, కొన్నిసార్లు ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. మిర్చిది కూడా అదే పరిస్థితి. ఇక పసుపు 8 నెలల వరకు కొనసాగే పంట. వీటి కోత అనంతరం రబీలో మరో పంట వేసే పరిస్థితి రైతుకు అంతగా ఉండదు. దీంతో ఆ రైతులంతా రెండో సీజన్‌కు పెట్టుబడి రాయితీని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ మూడు పంటలు సాగు చేసే దాదాపు 25 లక్షల మంది రైతులు రబీ కాలానికి పెట్టుబడి రాయితీని అందుకోలేరు. ఆ 3 పంటల విస్తీర్ణం తగ్గే అవకాశం రబీలో పెట్టుబడి రాయితీ వచ్చే అవకాశం లేకపోవడంతో.. పత్తి, మిర్చి, పసుపు పంటల సాగు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా రైతులకు పత్తి, మిర్చి పంటలతో చాలా సందర్భాల్లో నష్టమే వాటిల్లుతుంది. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో పత్తి పండిస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పంటలకు రెండో సీజన్‌కు డబ్బులు ఇవ్వకుంటే ఆ పంట లు సాగు చేసి ఏం ప్రయోజనం అనే భావన రైతులకు కలుగుతుంది. వారు ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కౌలు రైతులకు ‘పెట్టుబడి’ లేదు కౌలు చేసే రైతులెవరికీ పెట్టుబడి పథకం కింద నగదు అందే పరిస్థితి లేదు. భూ యజమానికే సొమ్ము ఇస్తారు. ఇలా చేయడం వల్ల కౌలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిపై ‘సాక్షి’తో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని, అలా చేస్తే భూ యజమానులు వ్యతిరేకిస్తారని తెలిపారు. కౌలుదారులు, భూ యజమానులకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పం దం లేనందున ఇది అసాధ్యమని చెప్పారు. -
స్పీడుగా సంస్కరణలు..
కోల్ ఇండియాలో 10% వాటాల విక్రయం ఐపీవోకి కొచ్చిన్ షిప్‌యార్డు ఎగుమతిదారులకు 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చకచకా సంస్కరణల జోరు పెంచుతోంది. ఇటీవలే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుకూలంగా పలు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం, కొచ్చిన్ షిప్‌యార్డు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, నానాటికీ తగ్గుతున్న ఎగుమతులకు ఊతమిచ్చే విధంగా ఎగుమతిదారులకు మూడు శాతం వడ్డీ సబ్సిడీ స్కీమును ప్రకటించింది. జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగం పుంజుకునేలా తగు నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత శాఖకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ (సీసీఈఏ) ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోల్ ఇండియా, కొచ్చిన్ షిప్‌యార్డ్ .. దాదాపు రూ. 69,500 కోట్ల బృహత్తర డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించే దిశగా కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయం ఉండనుంది. ప్రస్తుతం కోల్ ఇండియా మార్కెట్ విలువ ప్రకారం.. దీని ద్వారా ఖజానాకు కనీసం రూ. 21,138 కోట్లు సమకూరగలవని అంచనా వే స్తున్నట్లు కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖల మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. కంపెనీలో ప్రభుత్వానికి 79.65 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో వాటాల విక్రయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు, రూ. 10 ముఖవిలువ గల 3,39,84,000 ఈక్విటీ షేర్లతో కొచ్చిన్ షిప్‌యార్డు (సీఎస్ఎల్) ఐపీవో ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చేసింది. ఐపీవో కింద ప్రభుత్వం 1,13,28,000 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా 2,26,56,000 షేర్లను జారీ చేయనున్నారు. ముఖవిలువ ప్రకారం వీటి విలువ రూ. 33.98 కోట్లు కానుంది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్టు ప్రాంతంలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, భారీ డ్రై డాక్‌యార్డు నిర్మాణ పనులకు ఐపీవో నిధులు కొంత మేర ఉపయోగపడనున్నాయి. గ్యాస్ గరిష్ట మార్కెటింగ్ మార్జిన్ తగ్గింపు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర సంస్థలు.. ఎరువులు, ఎల్పీజీ ప్లాంట్లకు విక్రయించే గ్యాస్‌పై మార్కెటింగ్ మార్జిన్ కింద గరిష్టంగా రూ. 200 మాత్రమే వసూలు చేయొచ్చని క్యాబినెట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రతి వెయ్యి ఘనపు మీటర్ల గ్యాస్‌కు కంపెనీలు వసూలు చేస్తున్న రూ. 225తో పోలిస్తే ఇది 12.5 శాతం తక్కువ. కొన్ని సంస్థలు డాలర్ మారకంలోనూ చార్జీలు విధిస్తున్నాయి. ఇటీవల కరెన్సీ మారకం విలువలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఇకపై రూపాయి మారకంలోనే మార్కెటింగ్ మార్జిన్‌ను పేర్కొనాలని కేంద్రం తెలిపింది. ఇన్ఫ్రాకూ తోడ్పాటు.. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న కేంద్రం ఈ రంగానికి తోడ్పాటునిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. హైవే ప్రాజెక్టుల్లో జాప్యాలు జరిగితే డెవలపర్లకు పరిహారం ఇవ్వడం ఒకటి కాగా.. దాదాపు రూ. 1,000 కోట్ల దాకా సివిల్ నిర్మాణ వ్యయాలయ్యే ప్రాజెక్టులకు అనుమతులిచ్చేలా రహదారి రవాణా శాఖకు అధికారాలు ఇచ్చింది. దీంతో సుమారు 34 కీలకమైన హైవే ప్రాజెక్టులకు ప్రయోజనం చేకూరనుంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. డెవలపర్ పరిధిలో లేని అంశాల కారణంగా ప్రాజెక్టు జాప్యం జరిగిన పక్షంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీవోటీ) తరహా ప్రాజెక్టయితే ఆయా సందర్భాన్ని బట్టి రహదారి శాఖ టోల్ వ్యవధిని పెంచవచ్చు. అలాగే యాన్యుటీ విధానంలోనైతే ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. జాప్యం జరిగిన కాలానికి కూడా నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) యాన్యుటీ పరిహారం ఇస్తుంది. చెల్లించాల్సిన యాన్యుటీల సంఖ్య, పరిహారంపై గరిష్ట పరిమితులు ఉంటాయి. -
ఎగుమతుల వృద్ధికి చర్యలు
కేంద్రం హామీ ఎగుమతి సంఘాల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా నిరాశ కలిగిస్తున్న ఎగుమతుల రంగానికి ఊపునివ్వడానికి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. వడ్డీ సబ్సిడీ స్కీమ్ పొడిగింపు కూడా ప్రోత్సాహకాల్లో ఒకటిగా సూచనప్రాయంగా తెలి పింది. ఎగుమతుల వృద్ధి కోసం వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ఇక్కడ ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా తియోటియా ఈ సమావేశంలో మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎగుమతుల ప్రోత్సాహక పథకాలకు కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.18,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఎగుమతుల విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. ప్రత్యేక ఆర్థిక జోన్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపు, రుణ సమీకరణ అలాగే లావాదేవీల భారం అధికంగా ఉండడం వంటి అంశాలను ఈ సందర్భంగా పలు ఎగుమతి మండళ్ల ప్రతినిధులు ప్రస్తావించారు. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న అంశాల్లో ఇవి కూడా ఉన్నాయని తెలిపారు. ఆయా అంశాలను ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే... గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 310.5 బిలియన్ డాలర్లను సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేరుకోవడం కష్టమని కూడా అభిప్రాయపడ్డారు. ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఈ రంగం ప్రతినిధులు ఏమన్నారో చూస్తే... -
విత్తన రాయితీలో మెలిక
సాక్షి, కడప/అగ్రికల్చర్ : విత్తన రాయితీ పథకం అమలుపై కేంద్రం నీళ్లు చల్లుతోంది. నిబంధనల పేరుతో కోత పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త వంగడాలను కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే రాయితీ అందుతుందని స్పష్టం చేసింది. విత్తన రాయితీకి సంబంధించి 90 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం గమనార్హం. దీని ప్రభావం జిల్లాలోని ఖరీఫ్ రైతులపై పడనుంది. ముఖ్యంగా వేరుశనగ, వరి పంటలను సాగు చేసే రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాయితీ పథకం దాదాపు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. పదేళ్లకు పైబడి సాగు చేస్తున్న ఏ విత్తనాలకు కూడా ఈ ఖరీఫ్ నుంచి రాయితీ వచ్చే అవకాశాలు మృగ్యమయ్యాయి. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో వేరుశనగ సాగు విస్తీర్ణం దాదాపు రెండు లక్షల ఎకరాలు కాగా, వరి 95 వేల ఎకరాలలో సాగు కానుంది. అలాగే ఇతర పంటలు 75 వేల ఎకరాలకు పైగా సాగు కానున్నట్లు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం జిల్లాకు కేటాయింపులు ఇవే! వేరుశనగ విత్తనాలకు సంబంధించి కే-6 రకం ఐదు వేల క్వింటాళ్లు, ధరణి, నారాయణి రకాలు పది వేల క్వింటాళ్లు, కే-9 రకం 27 వేల క్వింటాళ్లు, కందులు వెయ్యి క్వింటాళ్లు, మినుములు వంద క్వింటాళ్లు, పెసలు 400 క్వింటాళ్లు, ఆముదాలు 50 క్వింటాళ్లు, జీలుగలు 600 క్వింటాళ్లు, పిల్లిపెసర 1000 క్వింటాళ్లు, జనుములు 1000 క్వింటాళ్లు జిల్లాకు మంజూరయ్యాయి. అయితే వీటిపై రైతులకు ఇచ్చే సబ్సిడీ ఎంత? అసలు ధర ఎంత? అనేది ఇంకా నిర్ణయం కాలేదు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా విత్తన ప్రాసెసింగ్ ఇంతవరకు చేపట్టలేదు. గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై పట్టించుకోకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మొత్తం మీద నూతన ప్రభుత్వమే విత్తన రాయితీ భరించాల్సి ఉంది. ఎంతమేరకు ప్రభుత్వం రాయితీని సడలిస్తుందోనని రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ఈ వంగడాలకు రాయితీ లేనట్లే! కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పదేళ్లుగా విత్తన రాయితీ పథకం కింద సరఫరా చేసే విత్తనాలకు రాయితీ లేకుండా పోతోంది. జిల్లాలో వేరుశనగ, వరిలో కొన్ని రకాల వంగడాలను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వాటిపై ప్రభుత్వం రాయితీ ఎత్తి వేస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొత్త వంగడాలను సాగు చేస్తే పంట దిగుబడి వస్తుందో, రాదోననే అనుమానం అన్నదాతల్లో కొట్టుమిట్టాడుతోంది. వరిలో బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం, వేరుశనగలో జేఎల్-24 రకం, టీఎంవీ-2రకం విత్తనాలను రైతులు సాగు చేసేవారు. పంట దిగుబడులు బాగా వచ్చేవి. ఇకనుంచి ఈ రకాలతో పాటు మరికొన్ని రకాల విత్తనాలకు విత్తన రాయితీ అందని పరిస్థితి వచ్చింది. దీంతో జిల్లాలో ఖరీఫ్, వరి, వేరుశనగ పంటలను సాగు చేసే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. -
బత్తాయి రైతుకు విద్యుత్ షాక్
పీసీపల్లి, న్యూస్‌లైన్: వర్షాభావానికి తోడు విద్యుత్ కోతలతో బత్తాయి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. రోజుకు కనీసం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. తెగుళ్ల విజృంభణతో బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పీసీపల్లి మండలంలో 4 వేల హెక్టార్లకు పైగా బత్తాయి సాగు చేశారు. సీజన్లో పీసీపల్లి నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, చెన్నై తదితర ప్రాంతాలకు బత్తాయి ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం చెట్లను బతికించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. సాగునీరందక 1500 హెక్టార్లలో బత్తాయి తోటలు ఎండిపోయాయి. కరెంటు సమస్య ఎలా అధిగమించాలో..ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. ఆదుకోని సబ్సిడీ పథకాలు: మండలంలోని 4 వేల హెక్టార్లలో బత్తాయి సాగు చేశారు. కానీ సాగు చేసిన సమయం నుంచి సబ్సిడీ పథకం కింద వచ్చే ఎరువులు కానీ, పరికరాలు కానీ రైతుల దరిచేరలేదు. చెట్లు పెరిగినప్పుడు కట్ చేసుకోవడానికి కూలి ఖర్చుల కోసం‘కొమ్మ కత్తెర పథకం’ కింద 50 శాతం రాయితీ ప్రభుత్వం అందించాల్సి ఉండగా మండలంలోని ఏ ఒక్కరూ ఈ పథకం కింద లబ్ధి పొందలేదు. కనపడని ఉద్యానవన శాఖాధికారులు: వివిధ పథకాల కింద రైతులకు చేయూతనివ్వాల్సిన ఉద్యానవన శాఖాధికారులు మండలం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. రైతులు నానా అవస్థలు పడి కనిగిరి ఉద్యానవన శాఖ కార్యాలయానికి వస్తే అది ఎప్పుడూ మూసివేసి ఉంటుంది. ఒక వేళ తెరిచి ఉంటే సబ్సిడీలో ఎటువంటి ఎరువులు కానీ పరికరాలు కానీ లేవని రైతులకు చెప్తారు. దీంతో రైతులు వెనుతిరుగుతున్నారు. తప్పని తెగుళ్ల బెడద పండ్ల తోటలకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. ఏ తెగుళ్లకు ఏ మందు కొట్టాలో ఎవరిని అడగాలో రైతులకు తెలియని పరిస్థితి. ఇటీవల తెగుళ్లు సోకి ఎండిపోవడంతో ధర్మవరపు వెంకటేశ్వర్లు మూడెకరాలు బత్తాయి తోట కొట్టివేశారు. రైతులకు సమస్యలు, సలహాలు అందించేవారు లేకపోవడంతో పండ్ల తోటలు పెంచడం పెద్ద సవాలుగా మారింది.