గేదెల సబ్సిడీ కొందరికే.. | Telangana Buffalo Distribution Scheme List Adilabad | Sakshi
Sakshi News home page

గేదెల సబ్సిడీ కొందరికే..

Published Mon, Aug 6 2018 12:43 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

Telangana Buffalo Distribution Scheme List Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రం (డెయిరీ)కి రోజూ పాలు సరఫరా చేస్తున్నప్పటికీ సబ్సిడీ గేదె పథకం జాబితాలో అర్హుల పేర్లు లేవు. పథకంలో వందలాది మందికి మొండి చెయ్యే ఎదురైంది. కేవలం 76 మంది పేర్లను ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి డెయిరీకి వీళ్లే పాలు సరఫరా చేశారా అంటే అదీకాదు.. మిగితా వారు సరఫరా చేసినప్పటికీ వారిని పరిగణనలోకి తీసుకోలేదు. అలా ఎందుకు జరిగిందంటే అధికారులు చెప్పే సమాధానం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంది.

ఎంపికలో గందరగోళం..
ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రంలో డీఆర్డీఏ ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి పాలు సేకరిస్తున్నారు. ఈ పాలను పాల శీతలీకరణ కేంద్రం ద్వారా నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. అదే విధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య అనుబంధ రంగ సంస్థ విజయ డెయిరీకి ఇక్కడి  నుంచి పాలను  పంపించడం జరుగుతుంది. కాగా పాడి రైతులకు సబ్సిడీ ద్వారా గేదెను అందజేసే పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికింద డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో లబ్ధిదారుల జాబితా ఎంపిక ప్రక్రియను విజయ డెయిరీకి అప్పగించడం జరిగింది. ఆన్‌లైన్‌ పద్ధతిన ఈ–ల్యాబ్‌లో అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలో డెయిరీకి పాలు సరఫరా చేస్తూ లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్‌ పొందుతున్న వారి పేర్లను ఈ–ల్యాబ్‌లో నమోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు.

ఇక్కడే ఐకేపీ అధికారులు, విజయ డెయిరీ అధికారులు చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. విజయ డెయిరీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గడిచిన ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు పంపించామని ఐకేపీ అధికారులు చెబుతున్నారు. వారు పంపిన పేర్లనే తామూ పరిగణనలోకి తీసుకున్నామని విజయ డెయిరీ అధికారులు చెబుతున్నారు. ఈ ఇద్దరి నిర్వాకంతో అర్హులైన పలువురు పాడి రైతులకు మొదటి దశలోనే సబ్సిడీ గేదె అందకుండా పోతోంది. కేవలం బరంపూర్, రుయ్యాడి, ఆదిలాబాద్‌ గ్రామాలకు చెందిన కొంతమంది పాడి రైతులను ఎంపిక చేశారు. దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు లేకపోలేదు.

ఏళ్లుగా పాలు పోస్తున్నా మొండి చెయ్యే..
ఆదిలాబాద్‌ చుట్టుపక్కల గ్రామాల్లోని తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్‌తో పాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి ఎన్నో ఏళ్లుగా పలువురు పాడి రైతులు పాలశీతలీకరణ కేంద్రంలో పాలు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు సబ్సిడీ గేదె విషయంలో మాత్రం వీరికి మొండిచెయ్యి ఎదురైంది. లీటర్‌ పాలకు రూ.4 ఇన్సెంటివ్‌ కూడా పొందినవారిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా ఏడాదిలో ఒక వేసవిలో మినహాయించి మిగితా కాలంలో పాలశీతలీకరణ కేంద్రానికి భారీగా పాల సరఫరా జరుగుతుంది. నెలకు 6 వేల లీటర్ల నుంచి 10 వేల లీటర్ల వరకు, కొన్నిసార్లు 12 వేల లీటర్ల వరకు కూడా పాల సేకరణ జరుగుతుంది. అయితే వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో పలువురు రైతులు పాలశీతలీకరణ కేంద్రానికి పాలు సరఫరా నిలిచిపోతుంది.

అలాంటప్పుడు ఏప్రిల్, మే నెలల్లో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే పంపాలని విజయ డెయిరీ ప్రతినిధులు కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టని విషయం. ఒకవేళ విజయ డెయిరీ ప్రతినిధులు కేవలం రెండు నెలల వివరాలు మాత్రమే అడిగిన పక్షంలో మిగితా ఏడాదిలో పాలు సరఫరా చేసిన రైతుల పరిస్థితిపై తెలియజేయకపోవడంతో ఇటు ఐకేపీ సంఘాల ప్రతినిధులతో పాటు పశుసంవర్థక శాఖ అధికారుల వైఫ ల్యం కనిపిస్తోంది. విజయ డెయిరీ ఎంపిక చేసిన జాబితాను పశుసంవర్థక శాఖకు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టర్‌ అనుమతి పొంది లబ్ధిదారులకు గేదెల పంపిణీ జరుగుతుంది.
 
నిర్వహణలో లోపభూయిష్టం..
ఆదిలాబాద్‌లో పాలశీతలీకరణ కేంద్రం నిర్వహణ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. ప్రధానంగా జిల్లాలో కేవలం వడ్డాడి, రుయ్యాడి, బరంపూర్‌లో మాత్రమే మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న పాడి రైతులు ఉత్పత్తి అయిన పాలను పెద్ద మొత్తంలో ఆయా కలెక్షన్‌ సెంటర్‌లో అందజేయడం జరుగుతుంది. అక్కడ పెయిడ్‌ సెక్రెటరీ వారి వివరాలను నమోదు చేసి ఆ పాలను పాల శీతలీకరణ కేంద్రానికి పంపిస్తారు. ఇక్కడే లోపం ఎదురవుతుంది. ప్రధానంగా మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్స్‌ అన్ని గ్రా మాల రైతులకు అనువుగా లేకపోవడంతో వారు నేరుగా ఆదిలాబాద్‌లోని పాలశీతలీకరణ కేంద్రానికి వెళ్లి విక్రయించడం జరుగుతోంది. నేరుగా వెళ్లే రైతులను వ్యక్తిగతంగా పాలు అమ్మే కోవలో పరిగణనలోకి తీసుకుని వారికి ప్రభుత్వం ద్వారా అందజేసే లీటరుకు రూ.4 ఇన్సెంటివ్‌ అందకుండా పోతోంది. మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్‌లో పా లు పోసిన రైతుల వివరాలు మాత్రమే విజయ డె యిరీకి పంపించినట్లు ఐకేపీ అధికారులు చెబుతున్నారు. దీంతో కొంత మంది పాడి రైతులకే గేదె ప్రయోజనం దక్సాల్సి ఉండగా, మిగితా రైతుల కు మొండి చెయ్యి ఎదురవుతుంది.


పాడి రైతుల ఆవేదన..
కేవలం 76 మంది రైతులను మాత్రమే సబ్సిడీ గేదెకు అర్హులుగా ఎంపిక చేయడంపై పలువురు పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోజూ డెయిరీ కేంద్రానికి వస్తున్నారు. దీంతో తమ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న అధికారులు మరో 122 మంది రైతులను గుర్తించి రెండో విడత కింద వారికి సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రత్యేక అనుమతితో వారికి సబ్సిడీ గేదెలను అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొం టున్నారు. మిగతా రైతులను సొసైటీల ద్వారా ఎంపిక చేసి వారికి న్యాయం చేస్తామని నమ్మబలుకుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సొసైటీలు లేకపోవడంతో ఇప్పట్లో పాడి రైతులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ముందునుంచి సొసైటీల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

ఏప్రిల్, మే నెలలో సరఫరా చేసిన వారి పేర్లు అడిగారు
పాల శీతలీకరణ కేంద్రానికి ఏప్రిల్, మే నెలలో పాలు సరఫరా చేసిన వారి పేర్లు మాత్రమే అడిగారు. అందుకు తగినట్లు వారి వివరాలను పంపించాం. కొన్నేళ్లుగా సరఫరా చేసిన వారి పేర్లు అడిగి ఉంటే అలాగే పంపించేవాళ్లం. పలువురు పాడి రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, పాస్‌బుక్, పాస్‌ ఫొటోలు, ప్రొఫార్మాలు సేకరించి విజయ డె యిరీకి పంపించినప్పటికీ వారు తిరిగి ఈ–ల్యాబ్‌లో ఆదిలాబాద్‌లోనే నమోదు చే యాలని పంపించారు. పైనుంచి వ చ్చిన ఆదేశాలకనుగుణంగా నడుచుకున్నాం.      
   – వసంత్, మేనేజర్, పాలశీతలీకరణ కేంద్రం

మరో 122 మంది జాబితా..
మొదట ఎంపిక చేసిన 76 మంది లబ్ధిదారుల జాబితాతో పాటు మళ్లీ ప్రత్యేక అనుమతితో మరో 122 మంది పాడి రైతులను ఎంపిక చేశాం. మొదట 76 మంది రైతులకు సబ్సిడీ గేదెలను అందజేయనున్నాం. ఇప్పటికే సుమారు 40 మంది డీడీలు కట్టారు. వారికి ఈ మూడునాలుగు రోజుల్లో గేదెలను పంపిణీ చేస్తాం. ఆ తర్వాత ఈ 122 మందిని పరిగణనలోకి తీసుకుంటాం. సొసైటీల ఏర్పాటు జరుగుతుంది. వారికి కూడా గేదెలను అందజేసే అవకాశం ఉంది. ఐకేపీ నుంచి వచ్చిన జాబితాను అనుగుణంగానే లబ్ధిదారులను ఎంపిక చేశాం. లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్‌ పొందుతున్న రైతులను పరిగణనలోకి తీసుకున్నాం.
– నాగేశ్వర్‌రావు, డీఎం, విజయ డెయిరీ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

పాలను డబ్బాలో నింపుతున్న పాడి రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement