సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వేస్తే రబీలోనూ కొనసాగే వాణిజ్య పంటలకు ఒక సీజన్‌కు మాత్రమే పెట్టుబడి రాయితీ పథకం వర్తించనుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో వేసే పత్తి, మిర్చి, పసుపు రైతులకు ఒకసారే పెట్టుబడి కింద రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. అవి రబీలోనూ కొంతకాలం కొనసాగనున్నందున ఆ రైతులకు రెండో సీజన్ కింద పెట్టుబడి సొమ్ము చెల్లించే అవకాశాలు లేవని వ్యవసాయ శాఖ వర్గాలు తేల్చిచెప్పాయి.
ఆ ప్రకారం పత్తి, మిర్చి, పసుపు సాగు చేసే రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.4 వేలు అందజేస్తారు. వాస్తవానికి సీజన్‌కు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖరీఫ్, రబీలకు కలిపి రూ.8 వేలు రైతులకు అందించాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ రైతులు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు ఏడాదిపాటు ఉండే చెరకు పంటకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేలు ఇస్తారు. అలాగే పండ్లు, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రెండు సీజన్ల డబ్బులు అందుతాయి.
సగం వాటా ఆ పంటలదే
రాష్ట్రంలో ఖరీఫ్‌లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. అందులో అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, మిర్చి 1.70 లక్షల ఎకరాలు, పసుపు 1.17 లక్షల ఎకరాలు. ఈ మూడింటి సాధారణ సాగు విస్తీర్ణమే 44.77 లక్షల ఎకరాలు. 2017–18 ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 97.45 లక్షల ఎకరాల్లో సాగవ్వగా.. అందులో పత్తి 47.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి తీత మూడు సార్లు కొనసాగుతుంది.
పరిస్థితి బాగుంటే నాలుగో సారి తీస్తారు. ఖరీఫ్‌లో వేసే ఈ పంట జనవరి, కొన్నిసార్లు ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. మిర్చిది కూడా అదే పరిస్థితి. ఇక పసుపు 8 నెలల వరకు కొనసాగే పంట. వీటి కోత అనంతరం రబీలో మరో పంట వేసే పరిస్థితి రైతుకు అంతగా ఉండదు. దీంతో ఆ రైతులంతా రెండో సీజన్‌కు పెట్టుబడి రాయితీని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ మూడు పంటలు సాగు చేసే దాదాపు 25 లక్షల మంది రైతులు రబీ కాలానికి పెట్టుబడి రాయితీని అందుకోలేరు.
ఆ 3 పంటల విస్తీర్ణం తగ్గే అవకాశం
రబీలో పెట్టుబడి రాయితీ వచ్చే అవకాశం లేకపోవడంతో.. పత్తి, మిర్చి, పసుపు పంటల సాగు గణనీయంగా తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా రైతులకు పత్తి, మిర్చి పంటలతో చాలా సందర్భాల్లో నష్టమే వాటిల్లుతుంది. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో పత్తి పండిస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పంటలకు రెండో సీజన్‌కు డబ్బులు ఇవ్వకుంటే ఆ పంట లు సాగు చేసి ఏం ప్రయోజనం అనే భావన రైతులకు కలుగుతుంది. వారు ఇతర పంటల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
కౌలు రైతులకు ‘పెట్టుబడి’ లేదు
కౌలు చేసే రైతులెవరికీ పెట్టుబడి పథకం కింద నగదు అందే పరిస్థితి లేదు. భూ యజమానికే సొమ్ము ఇస్తారు. ఇలా చేయడం వల్ల కౌలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిపై ‘సాక్షి’తో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని, అలా చేస్తే భూ యజమానులు వ్యతిరేకిస్తారని తెలిపారు. కౌలుదారులు, భూ యజమానులకు మధ్య ఎలాంటి అధికారిక ఒప్పం దం లేనందున ఇది అసాధ్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment