సాక్షి, కడప/అగ్రికల్చర్ : విత్తన రాయితీ పథకం అమలుపై కేంద్రం నీళ్లు చల్లుతోంది. నిబంధనల పేరుతో కోత పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త వంగడాలను కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే రాయితీ అందుతుందని స్పష్టం చేసింది.
విత్తన రాయితీకి సంబంధించి 90 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం గమనార్హం. దీని ప్రభావం జిల్లాలోని ఖరీఫ్ రైతులపై పడనుంది. ముఖ్యంగా వేరుశనగ, వరి పంటలను సాగు చేసే రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాయితీ పథకం దాదాపు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. పదేళ్లకు పైబడి సాగు చేస్తున్న ఏ విత్తనాలకు కూడా ఈ ఖరీఫ్ నుంచి రాయితీ వచ్చే అవకాశాలు మృగ్యమయ్యాయి.
జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం
ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో వేరుశనగ సాగు విస్తీర్ణం దాదాపు రెండు లక్షల ఎకరాలు కాగా, వరి 95 వేల ఎకరాలలో సాగు కానుంది. అలాగే ఇతర పంటలు 75 వేల ఎకరాలకు పైగా సాగు కానున్నట్లు అంచనాలు రూపొందించారు.
ప్రస్తుతం జిల్లాకు కేటాయింపులు ఇవే!
వేరుశనగ విత్తనాలకు సంబంధించి కే-6 రకం ఐదు వేల క్వింటాళ్లు, ధరణి, నారాయణి రకాలు పది వేల క్వింటాళ్లు, కే-9 రకం 27 వేల క్వింటాళ్లు, కందులు వెయ్యి క్వింటాళ్లు, మినుములు వంద క్వింటాళ్లు, పెసలు 400 క్వింటాళ్లు, ఆముదాలు 50 క్వింటాళ్లు, జీలుగలు 600 క్వింటాళ్లు, పిల్లిపెసర 1000 క్వింటాళ్లు, జనుములు 1000 క్వింటాళ్లు జిల్లాకు మంజూరయ్యాయి. అయితే వీటిపై రైతులకు ఇచ్చే సబ్సిడీ ఎంత? అసలు ధర ఎంత? అనేది ఇంకా నిర్ణయం కాలేదు.
కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సీజన్ ముంచుకొస్తున్నా విత్తన ప్రాసెసింగ్ ఇంతవరకు చేపట్టలేదు. గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై పట్టించుకోకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. మొత్తం మీద నూతన ప్రభుత్వమే విత్తన రాయితీ భరించాల్సి ఉంది. ఎంతమేరకు ప్రభుత్వం రాయితీని సడలిస్తుందోనని రైతన్నలు ఎదురు చూస్తున్నారు.
ఈ వంగడాలకు రాయితీ లేనట్లే!
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పదేళ్లుగా విత్తన రాయితీ పథకం కింద సరఫరా చేసే విత్తనాలకు రాయితీ లేకుండా పోతోంది. జిల్లాలో వేరుశనగ, వరిలో కొన్ని రకాల వంగడాలను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వాటిపై ప్రభుత్వం రాయితీ ఎత్తి వేస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొత్త వంగడాలను సాగు చేస్తే పంట దిగుబడి వస్తుందో, రాదోననే అనుమానం అన్నదాతల్లో కొట్టుమిట్టాడుతోంది.
వరిలో బీపీటీ 5204, ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకం, వేరుశనగలో జేఎల్-24 రకం, టీఎంవీ-2రకం విత్తనాలను రైతులు సాగు చేసేవారు. పంట దిగుబడులు బాగా వచ్చేవి. ఇకనుంచి ఈ రకాలతో పాటు మరికొన్ని రకాల విత్తనాలకు విత్తన రాయితీ అందని పరిస్థితి వచ్చింది. దీంతో జిల్లాలో ఖరీఫ్, వరి, వేరుశనగ పంటలను సాగు చేసే రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
విత్తన రాయితీలో మెలిక
Published Mon, May 19 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement