బంక తెగులు
ఈ తెగులు వల్ల మొక్క పూర్తిగా ఎండిపోతుంది. తెగులు ఉధృతి పెరిగితే చెట్టు వేర్లు బలహీన పడతాయి. కాండం పైన, మొదలు వద్ద పుట్ట గొడుగుల లాంటి చారలు ఏర్పడతాయి. కాండం పగిలి దాని నుంచి బంక కారుతుంది. చివరకు చెట్టు చనిపోతుంది. మురుగు నీరు బయటకు వెళ్లే వసతి గల నేలల్లో నిమ్మ సాగు చేయాలి. సాగు నీరు చెట్టు మొదలుకు తగలకుండా తల్లి పాదు, పిల్ల పాదు ఏర్పాటు చేయాలి. ఏడాదికి ఒకసారి చెట్టు మొదలు నుంచి 65 సెం.మీ ఎత్తు వరకు బోర్డ్ పేస్ట్ రాయాలి. చాకుతో తెగులు భాగాన్ని తీసేసి మెర్క్యురిక్ క్లోరైడ్‌తో శుభ్రపరిచి బోర్డ్ పేస్ట్ పూయాలి.
వేరుకుళ్లు తెగులు
ఈ తెగులు సోకి తే పూత, పిందె విపరీతంగా వచ్చి క్రమేణా ఆకులు రాలిపోతాయి. చెట్టుపై కాయలు మాత్రమే మిగులుతాయి. చెట్టు ఎండు ముఖం పట్టి చనిపోతుంది. వేర్లపై ఉండే బెరడు తేలికగా ఊడి వస్తూ వేర్ల నుంచి దుర్వాసన వ స్తుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే 100 లీటర్ల నీటికి కిలో మైలుతుత్తం(కాపర్ ఆక్సీ క్లోరైడ్), కిలో సున్నం కలిపి ఆ మిశ్రమాన్ని వ్యాధి సోకిన మొక్కకు, దాని చుట్టు పక్కల నాలుగు మొక్కల పాదుల్లో వేర్లు పూర్తిగా తడిచే లా 20-25 లీటర్లు పోయాలి.
100 కేజీల పశువుల ఎరువును కేజీ ట్రైకోడెర్మావిరిడీతో కలిపి గొనె సంచులను కప్పి ఉదయం సాయంత్రం నీళ్లు చల్లితే 15-20 రోజుల్లో ట్రైకోడెర్మావిరిడీ కల్చర్ తయారవుతుంది. దీనిని 10 నుంచి 15 కేజీల చొప్పున వ్యాధి సోకిన చెట్టు పాదుల్లో వేసి పాదంతా కలియబెట్టాలి.