ఖమ్మం వ్యవసాయం: ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం.వెంకట్రాములు, డాక్టర్ ఆర్. శ్రీనివాస్‌లు ఇటీవల చింతకాని మండలం పాతర్లపాడు, కోమట్లగూడెం గ్రామాల్లోని పత్తి చేలను పరిశీలించారు. వారికి కాండం మచ్చ తెగులు సోకిన పైర్లు కనిపించాయి. రెండేళ్లుగా ఈ తెగులు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా కనిపించిందని, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనూ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రైతులు ఈ తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ తెగులు ప్రభావం ఉందని వారు చెబుతున్నారు. ఈ తెగులుపై వరంగల్, గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్లే ఇది వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. ఈ తెగులుతో పాటు ఆకుమచ్చ, పిండినల్లి, తామరపురుగుల ఉధృతి కూడా ఉందని అన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.
కాండం మచ్చ తెగులు: ఈ తెగులు ఆశించినప్పుడు ప్రధాన కాండం చివర లేత చిగురు ఎండిపోయి విరిగి పోతుంది. తరువాత ముదురు కొమ్మలు, బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి. కొమ్మలు, కాండం పైనుంచి కిందకు ఎండుతాయి. ఈ తెగులు తెరపలు తెరపలుగా మొక్కల మీద ఆశించటం వలన అవి ఎండిపోతాయి. ఈ తె గులు ఆశించిన మొక్కల నుంచి పక్క మొక్కలకు వలయాకారంలో వ్యాప్తి చెందుతుంది. రైతులు ఈ లక్షణాలను గమనించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. లీటర్ నీటిలో ప్రొపికొనజోల్ 1 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు
వాతావరణం మబ్బులుపట్టి, ముసురు వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు, ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పిండినల్లి
పిండిపురుగు పిల్ల, తల్లి పురుగులు కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంది. ఈ పిండినల్లి కలుపు మొక్కలు అయిన వయ్యారిబామ (పార్థీనియం), తుత్తురబెండ వంటి వాటి మీద ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలను తీసివేసి నాశనం చేయాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫేన్‌ఫాస్ లేదా మిథైల్ పెరాథియాన్ 3 మి.లీ లేదా ఎసిఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులతో పాటు ట్యాంక్‌కు 10 గ్రాములు డిటర్జెంట్ సర్ఫ్‌ను కలిపి వాడాలి.
తామరపురుగులు
ఈ పురుగులు ఆకుల అడగు భాగాన చేరి రసం పీల్చటం వలన ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. దీని నివారణకు పిప్రోనిల్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిసేటట్లు పిచికారీ చేయాలి.
పత్తి రైతులూ జాగ్రత్త
Published Tue, Sep 30 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement