మరో ప్రయత్నం | farmers suffering with double cost | Sakshi
Sakshi News home page

మరో ప్రయత్నం

Published Wed, Jul 16 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

farmers  suffering  with double  cost

ఖమ్మం వ్యవసాయం:  పత్తి రైతులు మరోసారి జీవన పోరాటానికి సిద్ధమవుతున్నారు. గత మే నెలలో అకాల వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలు వేశారు. అయితే అప్పటినుంచి వరుణుడు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలను బతికించుకోవడానికి నానా కష్టాలు పడ్డారు. కొందరు ట్యాంకర్లతో నీరు తెచ్చి పత్తి మొక్కలకు పోశారు.

వీటిలో నల్లరేగడి నేలలో వేసినవిత్తనాలు కొంతమేర మొలకెత్తినా.. ఎర్ర, దుబ్బ నేలల్లో వేసిన విత్తనాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కా గా, ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో వేసిన భూములను మళ్లీ దున్ని, కొత్త విత్తనాలు వేస్తున్నారు. రెండుసార్లు విత్తనాలు వేయాల్సి రావడంతో ఖర్చు రెట్టింపయినా వారు వెనుకాడడం లేదు.

  జిల్లాలో ప్రతి ఏడాది 1.52 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తుంటారు. కాగా ఈ ఏడాది వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం 1.90 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసే అవకాశం ఉందని గుర్తించారు. అయితే జూన్‌లో దాదాపు లక్ష హెక్టార్లలో పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు కురవక విత్తనాలు మొలకెత్తకపోవడంతో ప్రస్తుతం 70 వేల హెక్టార్లలో మరోసారి విత్తనాలు వేసి తమ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు.

 తడిసి మోపెడవుతున్న ఖర్చులు...
 మొదటిసారి వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఇప్పుడు రైతులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒక్కో హెక్టారుకు దుక్కి దున్నడానికి రూ.4 వేలు, అచ్చు తోలడానికి రూ.500, విత్తనాలకు రూ.2 వేలు, అవి వేసే కూలీలకు రూ.7వేల వరకు ఖర్చు చేశారు. ఆ విత్తనాలు మొలకెత్తకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతుండటంతో మళ్లీ అంత ఖర్చు చేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పుడైనా వర్షాలు కురుస్తాయా.. లేక మళ్లీ నష్టం చవిచూడాల్సి వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.

  దిగుబడి తగ్గే ప్రమాదం...
 పత్తి సాగు ఆలస్యం కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం  ఉందని వ్యవసాయ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమయానికి పత్తి ఏపుగా పెరిగి పిందె స్థాయికి  వచ్చేదని, ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఇంకా విత్తనాలు వేసే దశలోనే ఉండడంతో ఆ ప్రభావం దిగుబడిపై ఉంటుందని చెపుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement