కాయలను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన మామిడి రైతులకు మంచి రోజులొచ్చాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ పెరిగి రెట్టింపు ధర పలుకుతోంది. ఈ సారి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, కడప: మామిడి పంటకు మంచికాలం కనిపిస్తోంది. కళ్లెదుటే డిమాండుతోపాటు ధరలూ బాగుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర మరింత పెరుగుతూ జూన్ వరకు కొనసాగితే మామిడి రైతును రాజుగా అభివర్ణించవచ్చు. గత ఏడాది చివరిలో వర్షాలు విపరీతంగా పడడంతో ఎక్కడికక్కడ మామిడి పొలాలన్నీ నీటితో తడిసిపోయాయి.
పొలంలో తేమశాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా చిగుర్లు రావడం..పూత తగ్గడంతో అనుకున్న మేర కాపు రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాయలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి మామిడి కాయలు వస్తున్నాయి. ఈనెల 10 నుంచి కాయలు బయటి మార్కెట్‌లోకి వస్తుండగా.. జూన్ చివరి నాటి వరకు మామిడి కాయలు కనిపించనున్నాయి. అన్నమయ్య జిల్లాలో మామిడి పంటను పెద్ద ఎత్తున సాగు చేయడంతోపాటు అనేక రకాల మామిడి కాయలను దిగుబడి తీస్తున్నారు.
అన్నమయ్య జిల్లాలో అనేక రకాలు
జిల్లాలో అనేక రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రధానంగా వీరబల్లి బేనీషా, తోతాపురి, అంటుమామిడి, నీలం, మల్లిక, అల్ఫన్స్, బంగినపల్లి, హిమామ్‌పసంద్ లాంటి రకాలను పండిస్తున్నారు. పంటలు పండించే రైతులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ధరలు పలికే మామిడి వైపు మొగ్గు చూపుతున్నారు.
జిల్లాలో ప్రధానంగా వీరబల్లి బేనీషాకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ప్రతి సీజన్‌లోనూ ఇక్కడి సరుకును వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌కు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులు గ్రూపులుగా ఏర్పడి కొనుగోలు కేంద్రం ఒకచోట ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం తోడ్పాటు
అందిస్తోంది.
ఆశాజనకంగా మామిడి ధరలు
అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లె తదితర ప్రాంతాలతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ మామిడి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి సంబంధించి టన్ను «ధర రూ. 90 వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. గతేడాది కూడా రూ. 75 వేల పైచిలుకు ధర కనిపించింది. అయితే ప్రస్తుతం ప్రారంభంలోనే టన్ను రూ. లక్ష వరకు ఉండడంతో రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంటు మామిడి, తోతాపురికి సంబంధించి టన్ను రూ. 30–35 వేల మధ్య పలుకుతోంది.
ఇతర రాష్ట్రాలకు అన్నమయ్య మామిడి
అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన అంటు మామిడి కాయలను చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీతోపాటు బెంగళూరుకు కూడా తరలిస్తున్నారు. అంతేకాకుండా బంగినపల్లి మామిడి గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే సాధారణంగా హెక్టారు మామిడి తోటకు సంబంధించి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి కేవలం టన్ను నుంచి 1.5 టన్ను మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో డిమాండు కూడా ఎక్కువగా ఉంది.
నా
పేరు అయూబ్‌ఖాన్. మాది మండల కేంద్రమైన చిన్నమండెం. మాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో ప్రస్తుతం దిగుబడి రావడంతో మార్కెట్‌కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం టన్ను ధర బాగానే పలుకుతోంది.
రైతులకు ఉద్యానశాఖ తోడ్పాటు
జిల్లాలో మామిడి పంట అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ధర కూడా బాగానే ఉంది. రైతులు గ్రూపుగా ఉండి అమ్ముకునేందుకు ఒకచోట ఏర్పాటు చేసుకునే షెల్టర్‌కు కూడా ఉద్యానశాఖ తోడ్పాటు అందిస్తోంది.
– మూలి రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, రాయచోటి
Comments
Please login to add a commentAdd a comment