సమ్మర్‌ సీజన్‌: ఫలరాజు భలే క్రేజు | Summer Season: Kadapa Mangoes Goes Heavy Demand In Market | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ సీజన్‌: ఫలరాజు భలే క్రేజు

Jun 12 2022 1:32 PM | Updated on Jun 12 2022 2:39 PM

Summer Season: Kadapa Mangoes Goes Heavy Demand In Market - Sakshi

సాక్షి రాయచోటి(కడప): మామిడి పండ్లలో గుర్తింపు పొందిన అనేక రకాల మామిడి కాయలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జిల్లాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుతున్నాయి. కచ్చితంగా రెండు నెలలపాటు సీజన్‌లో కాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ సారి ఆశించిన మేర దిగుబడి లేకపోగా.. ధర మొదట్లో పెద్దగా లేకపోయినా ప్రస్తుతం బాగానే ఉండటంతో దిగుబడి ఉన్న మేరకు కాయలను విక్రయిస్తున్నారు.ఇక్కడి పండ్లు తియ్యగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కాయలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రతిరోజు లారీల్లో సరుకు రవాణా అవుతోంది. బెనీషా, నీలం, తోతాపురి, ఇమామ్‌ పసందు, మలిగుబ్బ లాంటి రకాల మామిడి కాయలకు సంబంధించి పల్ప్‌ ఫ్యాక్టరీలతోపాటు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు కాయలు రవాణా అవుతున్నాయి. మామిడికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోని అనేక మండలాల్లో విస్తారంగా మామిడి పండిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాల షేట్లు(వ్యాపారులు) సైతం ఇక్కడే మకాం వేసి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా పంపిస్తున్నారు. 

జిల్లాలో సరాసరి 90 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. దిగుబడి ఈసారి ఎకరాకు ఒక టన్ను చొప్పున కంటే లేకపోవడంతో సరాసరిన 90–100 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు, నవంబర్‌ నెలల్లో విరివిగా వర్షాలు కురవడం.. పూతకు అవకాశం లేకపోవడంతో దిగుబడి తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న దిగుబడికి సంబంధించి లోకల్‌ మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కడికక్కడ సరుకు రవాణా అవుతోంది. రాయచోటి, రైల్వేకోడూరు, సుండుపల్లె, వీరబల్లె, కె.వి.పల్లె, చిన్నమండెం, సంబేపల్లె, పీలేరులతోపాటు లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట తదితర మండలాల్లో మామిడి విస్తారంగా పండిస్తారు. రైల్వేకోడూరు, వీరబల్లె, కె.వి.పల్లె, సుండుపల్లె, చిన్నమండెం తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజు 40 నుంచి 50లారీలలో సరుకు రవాణా జరుగుతోంది. 

జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూరు, తోతపూరి, బేనీషా, నీలం, ఇమామ్‌ పసంద్, రుమాని, పులిహార, ఖాదర్, లాల్‌ బహర్‌ రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం బేనీషా టన్ను రూ.35వేల నుంచి రూ.45వేల వరకు ఉండగా.. ఇమామ్‌ పసంద్‌ టన్ను లక్ష రూపాయలకుపైన, తోతపూరి రూ.16–20 వేలు, నీలం రూ. 30వేల నుంచి రూ. 40వేల వరకు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడి కాయలను ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది.

అన్నమయ్య జిల్లాలో మామిడి పంట సీజన్‌లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు (షేట్లు) జిల్లాలో మకాం వేస్తారు. కొన్నేళ్లుగా సీజన్‌లో రావడం, కొనుగోళ్లు చేసి ఆయా రాష్ట్రాలకు లారీల ద్వారా పంపుతుంటారు. రైల్వేకోడూరుతోపాటు రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో70నుంచి 80మంది దాకా షేట్లు ఇక్కడే ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. లారీలు కూడా దాదాపు 100నుంచి 150 వరకు ప్రతినిత్యం సమీప ప్రాంతాల్లోనే సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో సరుకు పంపిస్తుంటారు.  

ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుంటాం 
అన్నమయ్య జిల్లాలో ప్రతి ఏడాది వేసవి సీజన్‌ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మామిడి కాయల వ్యాపారం నిర్వహిస్తుంటాం. నాతోపాటు చాలామంది వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి మార్కెట్ల నుంచి మహారాష్ట్రకు పంపుతుంటాం. కాయల కొనుగోలుకు లారీలు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వస్తాయి. మామిడి కాయలు రుచిగా, నాణ్యతగా ఉండటంతో వీటికి మంచి గిరాకీ ఉంటోంది.  
– జావేద్, మామిడికాయల వ్యాపారి, మహారాష్ట్ర  

మామిడి పండ్లకు డిమాండ్‌  
జిల్లాలోని మామిడిపండ్లకు డిమాండ్‌ ఉంటోంది. ఇక్కడి మామిడి పండు రుచికరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి ఏడాది సరుకు ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు వెళుతోంది. అనేక రకాల మామిడి పండ్లు పండిస్తారు. కాకపోతే ఈ ఏడాది చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. అయినప్పటికీ ఇక్కడి నుంచి డిమాండ్‌కు అనుగుణంగా జ్యూస్, మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు మామిడి కాయలు వెళుతున్నాయి.      
– రవీంద్రనాథరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement