నర్సరీల్లో పెంచుతున్న మామిడి మొక్కలు
చిక్కబళ్లాపురం(బెంగళూరు): పండ్లలో రారాజైన మామిడిలో మల్లిక రకం మామిడికి మార్కెట్‌లో యమక్రేజ్ ఏర్పడింది. రుచిలో, దిగుబడిలో మేటి అయిన మల్లిక మామిడిని సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆ రకం మామిడికి నర్సరీల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు మామిడి తోటల సాగుపై దృష్టి పెడుతున్నారు. నర్సరీల్లో ఇప్పటికే 20వేలకు పైగా మొక్కలు విక్రయం జరిగినట్లు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు.
సొప్పళ్లి, శిడ్లఘట్ట తాలూకా చిక్కదాసరహళ్లి, చింతామణి తాలూకా మాడికెరె, గుడిబండ తాలూకా పసుపులోడులో హైబ్రిడ్ మల్లిక మామిడి నారు పెంచుతున్నారు. కాగా మల్లిక రకం మామిడి ఈ ఏడాది మంచి ధర పలికింది. టన్ను మామిడి రూ.60వేలకు విక్రయించారు. మూడేళ్లలో పంట చేతికి వస్తుందని, ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో మామిడి చెట్ల పెంపకానికి మంచి వాతావరణం అని చెబుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల నగరాల నుంచి పల్లెబాట పట్టిన యువకులు పండ్లతోటల సాగుపై దృష్టి పెడుతున్నారని, మామిడి, పనస, దానిమ్మ, డ్రాగన్ తదితర పంటలను పెట్టారని, మరో రెండు సంవత్సరాల్లో ఆ పంటలు చేతికందుతాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment