దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్‌ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు.
రాహుల్ దేశ్‌ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్‌ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు.
రాహుల్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్‌కు కూడా పంపే యోచనలో ఉన్నాడు.
వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్‌లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment