Earned money
-
పూల సాగుతో నాలుగు నెలల్లో రూ. 8 లక్షలు!
ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్ ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్ కుమార్ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు. సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్ తెలిపాడు. తాను ప్రస్తుతం డీ ఫార్మా చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు. -
కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్‌ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. రాహుల్ దేశ్‌ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్‌ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. రాహుల్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్‌కు కూడా పంపే యోచనలో ఉన్నాడు. వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు. -
ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..
ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) వెల్లడించింది. ట్రైన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది. అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే? 2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్డ్ సీటు లేదా కోచ్ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు. -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దాదాపు ఏడేళ్ల తర్వాత నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. ఢిల్లీలోని తీహార్ జైల్లో శుక్రవారం ఉదయం 05:30 గంటలకు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను ఉరితీశారు. తరువాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్‌దయాల్ ఆస్పత్రికి తరలించారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే పోలీసులే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వీరిని ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే ముందు నలుగురు దోషులు కంటతడి పెట్టినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఈ నలుగురు కూడా శిక్ష అనుభవిస్తున్న కాలంలో జైళ్లో పనిచేసి మొత్తం రూ.1,37,000 సంపాదించారు. వాటిలో అక్షయ్ రూ. 69 వేలు సంపాదించగా, పవన్ రూ. 29 వేలు, వినయ్ రూ. 39 వేలు సంపాదించారు. చదవండి: అర్ధరాత్రి ఎక్కడుందో తెలుసా: దోషుల లాయర్ ఇక ముఖేష్ సింగ్ ఎలాంటి పని చేయలేదు. కేసు కొనసాగిన ఏడేళ్ల కాలంలో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారని సమాచారం. జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్ శర్మ 11 సార్లు, అక్షయ్ సింగ్ ఒకసారి శిక్షను అనుభవించారు. ఇక ముఖేష్ మూడు సార్లు, పవన్ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. వీరి చదువుల విషయానికి వస్తే 2016లో ముఖేష్, పవన్, అక్షయ్.. పదో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నప్పటికీ వారు పాస్ కాలేదు. 2015లో వినయ్ బ్యాచిలర్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ, అతను ఆ డిగ్రీని పూర్తి చేయలేదు. కాగా.. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. అతడిపై నిఘా కొనసాగుతుంది. చదవండి: నిర్భయ కేసు: ఆ మైనర్ ఇప్పుడెక్కడా?! -
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్‌లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది. -
ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యుడు సంపాదన
-
ఏసీబీ వలలో అవినీతి చేప
- చనిపోయిన రిటైర్డ్ వాచ్మెన్ సొమ్ము ఇచ్చేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసిన ఖజానా శాఖ ఉద్యోగి - రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ చీరాల: వసతిగృహ వాచ్‌మెన్‌గా పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన ఉద్యోగికి రావాల్సిన సొమ్ము ఇచ్చేందుకు రెండేళ్లు తిప్పించుకుని చివరకు రూ.15 వేలు ఇస్తేనే బిల్ పాస్ చేస్తానని డిమాండ్ చేసిన చీరాల ఉప ఖజానా కార్యాలయంలోని ఓ అవినీతి చేపను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లే..చీరాలకు చెందిన గరిక శంకరరావు ఇంకొల్లు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో వాచ్‌మన్‌గా పనిచేశాడు. 2013లో ఉద్యోగ విరమణ చేసిన శంకరరావు 2014లో అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన 24 ఏళ్ల సర్వీసులో రావాల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర సొమ్ము రూ.1.20 లక్షల కోసం భార్య సామ్రాజ్యం, కుమారుడు వినోద్‌కుమార్‌లు రెండేళ్లుగా చీరాల ఉప ఖజానా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న బండి అక్కేశ్వరరావు రకరకాల సాకులు చెప్పి సొమ్ము చెల్లింపులకు కావాల్సిన బిల్లులు పాస్ కానివ్వకుండా బాధించాడు. చివరకు బిల్లు పాస్ కావాలంటే రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే బాధితులు అప్పటికే పలుమార్లు లంచాలు ఇచ్చి విసిగి వేసారారు. చేసేదేమీలేక ఈనెల 4న ఒంగోలు డీఎస్పీ మూర్తికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం వేధిస్తున్న ఉద్యోగి అక్కేశ్వరరావును పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిరోజూ అక్కేశ్వరరావు ఒంగోలు నుంచి చీరాలకు రైల్లో వచ్చి నిధులు నిర్వహిస్తుండేవాడు. సోమవారం విధులు ముగించుకుని ఒంగోలు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. శంకరరావు కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారుల సూచనలతో మొదటి విడత రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అక్కేశ్వరరావు రూ.5 వేలు డబ్బులు ఇచ్చి మరో రూ.5 వేలకు ఒక వస్తువు కొనివ్వాలని సూచించాడు. దీంతో సోమవారం సాయంత్రం అక్కేశ్వరరావుకు రూ.5 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్కేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ మూర్తి తెలిపారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ పీవీవీ ప్రతాప్‌కుమార్, ఏఎస్సై కరీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు. రెండేళ్లుగా వేధించారు నా భర్త 24 ఏళ్లపాటు వాచ్‌మెన్‌గా సర్వీస్ చేసి తీవ్ర అనారోగ్యంతో 2014లో మరణించాడు. ఆయనకు రావాల్సిన పింఛను, ఇతర బెనిఫిట్లకు సంబంధించి ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ అక్కేశ్వరరావు బిల్లులు కాకుండా వేధించి నరకయాతనలకు గురిచేశాడు. చివరకు రూ.15 వేలు లంచం ఇస్తేనే బిల్లు పాస్ చేస్తానని డిమాండ్ చేయడంతో సహనం నశించి ఏసీబీ అధికారులను ఆశ్రయించాం. లంచగొండి అధికారులను ఖఠినంగా శిక్షించాలి. - గరిక సామ్రాజ్యం, వినోద్‌కుమార్, బాధితులు