షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్‌లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్.
నానమ్మ కథ
షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది.
కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను.
నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్‌లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి.
మెదడు చురుకుదనం వేళ్లలో
ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్‌లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు.
చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం?
Comments
Please login to add a commentAdd a comment