ఇటీవలి కాలంలో యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్టార్టప్‌లతో పాటు వ్యవసాయరంగంలోనూ కాలుమోపి, విజయాలు సాధిస్తున్నారు. యూపీలోని లక్నోలో గల మలిహాబాద్ పరిధిలోని ధాక్వా గ్రామానికి చెందిన గౌరవ్ కుమార్ ఇలాంటి విజయాన్నే అందుకున్నాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసు కలిగిన గౌరవ్ కుమార్ గ్లాడియోలస్ పూలు సాగు చేస్తున్నాడు. నాలుగు నెలల్లో రూ. ఎనిమిది లక్షలు సంపాదించి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు.
గౌరవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి శివకుమార్ వరి, గోధుమలు పండించి చాలాసార్లు నష్టపోయాడని, ప్రతికూల వాతావరణం కారణంగా పంట పాడైపోయేదని తెలిపాడు. అటువంటి పరిస్థితిలో తాను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్‌లో చేరానన్నాడు. అక్కడ పూల పెంపకం గురించి తెలుసుకుని, పూల సాగుకు తండ్రిని ఒప్పించానని తెలిపాడు.
సెప్టెంబరు నుంచి గ్లాడియోలస్ పూల సాగు ప్రారంభమవుతుందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు ఈ పూలు విరివిగా లభిస్తాయని తెలిపాడు. కేవలం నాలుగు నెలల్లోనే ఈ పూల విక్రయం ద్వారా నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని గౌరవ్ తెలిపాడు. తాను ప్రస్తుతం డీ ఫార్మా చదువుతున్నానని, వైద్య విద్యతో పాటు వ్యవసాయంపై దృష్టి సారిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment