అప్రోచ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో అంట్లు కట్టి మొక్కల విక్రయం
పాణ్యం రైతుల స్పెషాలిటీ ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి
పాణ్యం: మామిడి సాగు చేయాలకునే రైతులకు టక్కున గుర్తొచ్చేది నంద్యాల జిల్లా పాణ్యంలో లభించే అంటు మొక్కలే. ఇక్కడ అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) పద్ధతిలో అంట్లు కట్టడం ఇక్కడి రైతులు స్పెషాలిటీ. ఈ ప్రాంతంలో 1885లో మామిడి సాగు ప్రారంభమైంది. అప్పటినుంచీ ఇప్పటివరకు ఆరోగ్యకరమైన, మంచి రుచికరమైన ఫలాలను అందించే మొక్కలను ఇక్కడ రూపొందిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మొక్కలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ పాణ్యంలో మాత్రం తల్లి చెట్ల నుంచే అంటుకట్టి పిల్ల మొక్కలను ఉత్పత్తి చేయడం నేటికీ కొనసాగుతోంది.
అప్రోచ్ గ్రాఫ్టింగ్‌తో ఆరోగ్యం
పాణ్యంలో దాదాపుగా 70 ఎకరాల్లో మామిడి అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. 30 సెంట్లు మొదలుకుని ఎకరా వరకు చిన్న, సన్నకారు రైతులు మామిడి మొక్కలను పెంచుతున్నారు. వాటిలో 6 ్ఠ6 వెడల్పుతో తల్లి మొక్కలను నాటి.. ఇతర ప్రాంతాలను నుంచి మొలకను తెచ్చి వాటిని ఈ తల్లిమొక్కలకు అంటుకడతారు. ఇలా 90–100 రోజుల వరకు అంటును అలాగే ఉంచుతారు. దీంతో ఆ మొలక 4–5అడుగుల వరకు ఎత్తు పెరిగి.. ఆరోగ్యంగా, ఎలాంటి తెగుళ్లనైనా తట్టుకునేలా పెరుగుతుంది. మొక్కలు కావాలకునే రైతులు మే, జూన్ నెలల్లోనే ఆర్డర్లు ఇస్తారు. పది రోజుల్లో మొక్కలను తీసుకెళ్లాలని చెప్పగానే మామిడి రైతులు తల్లి అంటు నుంచి మొలకల్ని వేరుచేసి తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 రోజుల పాటు డిపోలో ఉంచుతారు. ఆ తరువాత మొక్క ఆరోగ్యంగా ఉంటేనే రైతుకు విక్రయిస్తారు. లేకపోతే పక్కనపెడతారు. మొక్కను నాటుకున్న రైతులు మూడో ఏడాది నుంచే కాపు తీసుకోవచ్చు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
పాణ్యం నుంచి ఏపీలోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు మామిడి మొక్కలను ఎగుమతి చేస్తుంటారు. ఏటా కనీసం లక్ష మొక్కల వరకు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. సీజన్ ప్రారంభమైదంటే నర్సరీల్లో కూలీలకు, మినీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది.
నమ్మకంతో తీసుకెళ్తారు
30 ఏళ్లు నర్సరీని నడుపుతున్నాను. మామిడిలో అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి. సీజన్‌లో ఇతర ప్రాంతాల నుంచి చాలామంది రైతులు వచ్చి మొక్కల కోసం ఆర్డర్ ఇస్తారు. ఎప్పుడైనా మొక్కకు డ్యామేజీ జరిగితే తిరిగి ఇస్తాం. ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మొక్కలు కొంటారు. – జంపాల నడిపెన్న,
శ్రీనివాస నర్సరీ యజమాని మొక్కలు చాలా బాగా పెరిగాయి
నేను మూడేళ్ల క్రితం రెండెకరాల్లో మామిడి మొక్కలను సాగు చేశాను. పాణ్యం నుంచే 120 మొక్కలు తెచ్చుకున్నాను. ఇప్పటివరకు మొక్క ఎదుగుదల విషయంలో ఎలాంటి సమస్య రాలేదు. మొక్కలు తెచ్చుకునే సమయంలో నేను చాలాసార్లు నర్సరీకి వెళ్లి చూశాను. – మహరాజ్, రైతు రామవరం, అవుకు మండలం
నర్సరీ రైతులకు లైసెన్స్‌లు
పాణ్యంలోని నర్సరీలకు లైసెన్స్‌లు ఇచ్చాం. రైతులు ఎలాంటి మొక్కలు విక్రయించినా కొన్నవారు బిల్లులు తీసుకోవాలి. అంతేకాక పాణ్యంలో అప్రోచ్ గ్రాఫ్టింగ్ (తల్లి అంటు మొక్కలు) అధికంగా సాగు చేస్తుంటారు. మామిడి సాగు చేయాలనుకునే రైతులు అప్రోచ్ గ్రాఫ్టింగ్ మొక్కలనే ఇష్టపడతారు. – నాగరాజు, జిల్లా ఉద్యాన అధికారి
Comments
Please login to add a commentAdd a comment