ప్రకృతి సేద్యం ద్వారా గ్రామస్వరాజ్యం
► ప్రకృతి వ్యవసాయోద్యమ నేత పాలేకర్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆహార సార్వభౌమత్వంతో కూడిన గ్రామస్వరాజ్య స్థాపన సాధ్యపడుతుందని, ప్రభుత్వం నుంచి నిధులు అడగకుండానే ఈ కలను సాకారం చేయవచ్చునని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయదారుల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు.
మహారాష్ట్రలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చిస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చెప్పడం సమంజసం కాదని, దాని పక్క గ్రామాలను పట్టించుకున్న వారు లేరని అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన రైతులు తమ ఉత్పత్తులను దోపిడీమయమైన మార్కెట్ వ్యవస్థ ద్వారా కాకుండా, నేరుగా వినియోగదారులకు విక్రయించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పాలేకర్ తెలిపారు.
24 నుంచి కాకినాడలో శిక్షణా శిబిరం: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన నాలుగు సూత్రాలను కచ్చితంగా అమలు చేసిన రైతులకు పూర్తి సత్ఫలితాలు వస్తున్నాయని, అరకొరగా అమలు చేసిన రైతులకు మాత్రం ఫలితాలు రావడం లేదని తన పరిశీలనలో తేలిందని పాలేకర్ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. 3- 4 రోజుల శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న రైతుల్లో 20 శాతం మంది ప్రకృతి వ్యవసాయంలో నిలదొక్కుకోగలుతున్నారని, అలాగే 8 రోజుల పాటు శిక్షణ పొందిన వారిలో 80 శాతం మంది ప్రకృతి సేద్యానికి మళ్లుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడలో ఈ నెల 24 నుంచి 31 వరకు 8 రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోందని, దీనిలో సుమారు 6 వేల మంది రైతులు పాల్గొనే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 8 రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, గ్రామభారతి తెలంగాణ రాష్ట్ర నేతలు స్తంభాద్రిరెడ్డి, మోహనయ్య, కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.