సాక్షి ప్రతినిధి, నెల్లూరు
ప్రకృతి సేద్య నిపుణుడు సుభాష్ పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వరాదని రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్ర వేత్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తిరుపతిలో జరిగిన సదస్సులో పాలేకర్ ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై, వ్యవసాయ శాస్త్ర వేత్తల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన శాస్త్రవేత్తలు సదస్సును బహిష్కరించారు. విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్ వీసీ విజయకుమార్ శాస్త్రవేత్తలకు పాలేకర్ తరఫున క్షమాపణ చెప్పినా వారు శాంతించలేదు. ఈ నెల 21వ తేదీ బాపట్లలో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని తిరుపతి, అనంతపురం, బాపట్ల, మార్టేరుతో పాటు రాష్ట్రంలోని మిగిలిన వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు గురువారం సమావేశ మయ్యారు. యూనివర్సిటీని, అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అవమానించిన వ్యక్తికి డాక్టరేట్ ఇస్తే అంగీకరించేది లేదని వారంతా తీర్మానం చేశారు. తీర్మానం కాపీలను రాష్ట్ర సంఘానికి పంపారు. సంఘం రాష్ట్ర నాయకత్వం ఈ విషయం గురించి శుక్రవారం యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ, పాలక మండలి దష్టికి తీసుకెళ్లి తమ నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరిగిన గొడవ, శాస్త్రవేత్తల నిరసన నేపథ్యంలో యూనివర్సిటీ పాలక మండలి పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చే విషయంపై తర్జన, భర్జన పడుతున్న నేపథ్యంలో శాస్త్ర వేత్తలందరూ డాక్టరేట్ ఇవ్వరాదని ఏకగ్రీవ తీర్మానం చేయడం మరింత వివాదంగా మారింది. తమ అభిప్రాయాలను కాదని పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తే ఆందోళనకు దిగాల్సి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారని సమాచారం.
నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు..
సాక్షి ప్రతినిధి, తిరుపతి:
మరో వైపు శాస్త్ర వేత్తలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సుభాష్ పాలేకర్ అన్నారు.‘‘విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న విషయాన్నే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. పైన ఎగిరే పక్షి శాస్త్ర పరిజ్ఞానమైతే, ఆకాశంలో ఎగిరే విమానం సాంకేతిక పరిజ్ఞానం. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అయితే అది సుస్థిరమైనదై ఉండాలి. హరిత విప్లవం గురించి మాట్లాడినపుడు శాస్త్రవేత్తలు బాధపడి ఉంటారు. నేను చెప్పింది వేరు.. వారు అర్థం చేసుకుంది వేరు’’ అని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన మాటలకు మనస్థాపానికి గురైన శాస్త్రవేత్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని సూచన చేశారు.