honorary doctorate
-
వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే విలువలు కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణతో ప్రపంచ సంస్కృతి వైపు మనం వెళుతున్నామని, ప్రపంచ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని చుట్టుముడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే మన విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ తమిళిసై సౌందర రాజన్.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. నేటి యువత అనేక సవాళ్లను ఎదర్కొంటోందని, మన జీవన విధానం భారీ పరివర్తనకు గురయ్యిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. మన తిండి, భాష, బట్టలు, ఆటలు, పండుగలు వగైరాలు మన గతంతో పెనవేసుకుపోయాయన్నారు. సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం యునెస్కో 2021 నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోమాట్లాడే 7 వేల భాషల్లో సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతో పాటు, జానపద కథలు, తరాల వారసత్వంగా లభించిన విజ్ఞానాన్ని కోల్పోతామని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం క్రమంగా మారుతోందని, కొత్త వంగడాల రాకతో అనేక మార్పులొచ్చాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మార్పులకు లోనవడంతో పంటలు మార్పులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం, పరిపాలనపై సబ్జెక్టులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సీజేఐ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని ఆయన సూచించారు. పీవీ, కేసీఆర్ ఓయూ ప్రొడక్ట్లే.. ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్ వలస పాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారత్‌గా అవతరించే వరకు వెలుగురేఖలు పంచిందన్నారు. ఎంతో మంది దార్శనికులను తయారు చేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకత అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ఓయూ ప్రొడక్ట్లేనని గుర్తు చేశారు. ఓయూలో చేరాలనుకున్నా.. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, అంబేడ్కర్ వంటి 42 మంది మహనీయులు ఓయూ నుంచి గౌరవ డాక్టర్‌ను స్వీకరించారని చెప్పారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా తనకా అవకాశం దక్కలేదని, కోరిక నెరవేరలేదని గత స్మృతులను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివి జస్టిస్ రమణ మాతృ భాషపై గల మమకారాన్ని చాటుకున్నారు.. హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్‌మెడల్స్, 211 పీహెచ్డీ అవార్డులను విద్యార్థులకు ప్రదానం చేశారు. లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలి విజయానికి సత్వర మార్గాలు ఉండవని, లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎదురుకోవాల్సిందేన్నారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సాధారణంగానే ఉండాలని, అసాధారణ పనులు చేయాలన్నారు. ప్రస్తుతం ఐదు నిమిషాలు కూడా మొబైల్‌ని పక్కకు పెట్టే పరిస్థితి లేదని, ఫోన్లను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. -
గౌరవ డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం లో నిర్వహించిన 55వ స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్ ఎ.దామోదరం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి రావాల్సిన వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ నరసింహన్ హాజరుకా లేదు. 1,128 మందికి వివిధ రకాల డిగ్రీలను, 65 మంది బంగారు పతకాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన శివన్ స్నాతకోపన్యాసం చేస్తూ మానవాళి ప్రయోజనాల కోసం ఇస్రో అనేక ప్రయోగాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపటానికి లాంచ్ వెహికల్స్‌ను విజయవంతంగా ప్రయోగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ బరువైన లాంచ్ వెహికల్స్‌ను అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధం చేస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్ల వల్ల టెలికమ్యూనికేషన్, టెలి ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల నిర్వహణతో పాటు ప్రకృతి విపత్తులను గుర్తించే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘గగన్’ను దేశంలోని 50 ఎయిర్‌పోర్ట్‌లలోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివల్ల విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చన్నారు. దీన్ని రైల్వేలోకి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీంతో మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. -
ఇకపై డాక్టర్ యువరాజ్ సింగ్!
భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మైదానం బయట అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గ్వాలియర్‌కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. భారత క్రికెటర్‌గా అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగం కావడంతో పాటు క్యాన్సర్‌తో పోరాడి అనేక మందికి స్ఫూర్తిగా నిలవడం వల్లే యువీకి ఈ పట్టా ఇస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. తనకు లభించిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేసిన యువీ...భవిష్యత్తులోనూ తన సేవాకార్యక్రమాలు కొనసాగుతాయన్నాడు. -
డాక్టర్ తమన్నా
తమన్నా డాక్టర్ అయ్యారు. అంటే.. యాక్టర్‌గా రిటైర్ అయ్యారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. తమన్నా రియల్ డాక్టర్ కాదు. సినిమా రంగంలో కష్టపడి పైకి రావడం, మంచి పేరు తెచ్చుకోవడాన్ని అభినందిస్తూ, గుజరాత్‌కు చెందిన ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ కమిషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మిల్కీ బ్యూటీ తమన్నా డాక్టరేట్ అందుకున్నారు. ‘శ్రీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నాకు ‘హ్యాపీడేస్’తో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్నారు. దాదాపు పదేళ్ల కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. దక్షిణాది సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్కిగాను గౌరవ డాక్టరేట్ దక్కిందామెకు. ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందనీ, తన బాధ్యతను మరింత పెంచిందని, ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని ‘డాక్టర్ తమన్నా’ అన్నారు. -
ఇక నుంచి డాక్టర్ తమన్నా...
చెన్నై: సినిమా నటులను కదిలిస్తే ఎక్కువ మంది డాక్టర్ కాబోయి యాక్టర్‌ను అయ్యానంటూ చెప్తారు. ఇందులో ఆశ్చర్యమేముంది..? నటన రంగంలో ఉంటూనే కొందరు ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవుతున్నారు. మరికొందరు తమ వృత్తిలో సాధించి గౌరవ డాక్టరేట్లు అందుకుంటున్నారు. ఇక హీరోయిన్ తమన్నా విషయానికొస్తే పైన చెప్పిన వాటిలో రెండో కోవకు వస్తారు. ఈ బ్యూటీ 2006లో కేడీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం నిరాశపరచినా, బాలాజీశక్తివేల్ దర్శకత్వం వహించిన కల్లూరి చిత్రం తమన్నకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత తమిళం, తెలుగు అంటూ కేరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం తమన్నాకు లేకపోయింది. తెలుగు, తమిళంలోని స్టార్ హీరోలందరితోనూ జత కట్టారు. ఇక బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌కు జంటగా స్కెచ్ సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా గౌతంమీనన్ నిర్మాతగా తెరకెక్కనున్న తెలుగు చిత్రం పెళ్లిచూపులు రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్‌లోనూ తమన్నా హీరోయిన్గా మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇలా పలు భాషా చిత్రాలతో నటిగా పుష్కర కాలంలోకి అడుగు పెట్టిన తమన్న కళాసేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ కమిషన్ అనే గుజరాత్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని నటి తమన్న తన ట్విట్టర్లో పేర్కొంటూ ఈ గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచినట్లు భావిస్తున్నాననీ, ఆ గౌరవాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
నేడు షారుఖ్ ఖాన్‌కు మనూ గౌరవ డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. సోమవారం మనూ ఆరో స్నాతకోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా షారుఖ్ ఖాన్ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. షారుఖ్ ఖాన్‌తో పాటు రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్‌కు కూడా గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఉర్దూ భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకుగాను ఇద్దరికీ గౌరవ డాక్టరేట్లను మనూ అందజేస్తోంది. -
‘ఆయనకు డాక్టరేట్ ఇస్తే ఊరుకునేది లేదు’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు ప్రకృతి సేద్య నిపుణుడు సుభాష్ పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వరాదని రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్ర వేత్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తిరుపతిలో జరిగిన సదస్సులో పాలేకర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై, వ్యవసాయ శాస్త్ర వేత్తల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన శాస్త్రవేత్తలు సదస్సును బహిష్కరించారు. విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ విజయకుమార్ శాస్త్రవేత్తలకు పాలేకర్ తరఫున క్షమాపణ చెప్పినా వారు శాంతించలేదు. ఈ నెల 21వ తేదీ బాపట్లలో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని తిరుపతి, అనంతపురం, బాపట్ల, మార్టేరుతో పాటు రాష్ట్రంలోని మిగిలిన వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు గురువారం సమావేశ మయ్యారు. యూనివర్సిటీని, అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అవమానించిన వ్యక్తికి డాక్టరేట్ ఇస్తే అంగీకరించేది లేదని వారంతా తీర్మానం చేశారు. తీర్మానం కాపీలను రాష్ట్ర సంఘానికి పంపారు. సంఘం రాష్ట్ర నాయకత్వం ఈ విషయం గురించి శుక్రవారం యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ, పాలక మండలి దష్టికి తీసుకెళ్లి తమ నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరిగిన గొడవ, శాస్త్రవేత్తల నిరసన నేపథ్యంలో యూనివర్సిటీ పాలక మండలి పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చే విషయంపై తర్జన, భర్జన పడుతున్న నేపథ్యంలో శాస్త్ర వేత్తలందరూ డాక్టరేట్ ఇవ్వరాదని ఏకగ్రీవ తీర్మానం చేయడం మరింత వివాదంగా మారింది. తమ అభిప్రాయాలను కాదని పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తే ఆందోళనకు దిగాల్సి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారని సమాచారం. నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మరో వైపు శాస్త్ర వేత్తలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సుభాష్ పాలేకర్ అన్నారు.‘‘విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న విషయాన్నే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. పైన ఎగిరే పక్షి శాస్త్ర పరిజ్ఞానమైతే, ఆకాశంలో ఎగిరే విమానం సాంకేతిక పరిజ్ఞానం. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అయితే అది సుస్థిరమైనదై ఉండాలి. హరిత విప్లవం గురించి మాట్లాడినపుడు శాస్త్రవేత్తలు బాధపడి ఉంటారు. నేను చెప్పింది వేరు.. వారు అర్థం చేసుకుంది వేరు’’ అని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన మాటలకు మనస్థాపానికి గురైన శాస్త్రవేత్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని సూచన చేశారు. -
బాబు బడాయి డాక్టరేట్‌కు తిప్పలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలోని ఒక యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందుకుంటారా? డౌటే... ఎందుకంటే ఆ యూనివర్సిటీకి అంత సీన్ లేదని తేలిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. లాబీయింగ్ చేసి నిధుల కోసం డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. అనేక ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు, నిధుల సమస్య కారణంగా ఆ యూనివర్సిటీ ఇప్పుడు మూసివేత దిశగా పయనిస్తోంది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తేమిటని తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. విషయమేంటంటే... అమెరికా ఇల్లినాయిస్లోని చికాగో స్టేట్ యూనివర్సిటీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గత డిసెంబర్లో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు స్వయంగా విజయవాడకు వచ్చి ఆ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబును కలిసి తామిచ్చే డాక్టరేట్ స్వీకరించాలని కోరారు. ఇదంతా డిసెంబర్ మూడోవారంలో జరిగింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అనగానే టీడీపీ నేతలు ఆర్భాటం చేశారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం అంటూ తెగ ప్రచారం చేశారు. దానిపై అప్పట్లో చంద్రబాబు స్పందిస్తూ, అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్లు ఇస్తామన్నా... కాదన్నానని, ఎంతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ కావడం వల్లే చికాగో యూనివర్సిటీ కి ఉన్న చరిత్రను చూసి ఆ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను స్వీకరించాలని నిర్ణయించానని చెప్పుకొచ్చారు. ఆ యూనివర్సిటీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి స్వయంగా చంద్రబాబును కలిసిన సందర్భంగా... మీకు వీలైనప్పుడు వచ్చి గౌరవ పురస్కారాన్ని స్వీకరించాలని కోరారు. అందుకు అంగీకరించిన చంద్రబాబు ఆ విషయంపై అప్పట్లో హర్షం వ్యక్తంచేశారు. తనకు చికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కానీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కాదని, అది చికాగో స్టేట్ యూనివర్సిటీ అని ఆ తర్వాత బయటపడటంతో నవ్వులపాలు కావలసివచ్చింది. (చంద్రబాబు తన ట్విట్టర్లో మాత్రం చికాగో యూనివర్సిటీగానే చెప్పుకొన్నారు). ప్రమాణాల విషయంలో ఆ రెండు వర్సిటీల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు వెల్లడైంది. పైపెచ్చు ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఒకరు స్థానిక టీడీపీ నేత ఒకరికి సన్నిహితుడు కావడం వల్లే డాక్టరేట్ ప్రకటన వెలువడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఇంత చేసి ఏదో ఒక యూనివర్సిటీ... ఏదో ఒక డాక్టరేట్ అనుకుందామా.. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోందని చంద్రబాబు సన్నిహితులు తెగ బాధపడిపోతున్నారట. యూనివర్సిటీ తన గుర్తింపు కోసం ప్రతి ఏటా తంటాలు పడుతోందని అప్పట్లోనే వార్తలు వెలువడగా, ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతోంది. ప్రతి ఏటా 30 శాతం స్టేట్ ఫండింగ్పై ఆధారపడి నడుస్తున్న ఆ యూనివర్సిటీ ఇప్పుడు నిధులు లేక నడిపించే పరిస్థితి కూడా లేదు. అరకొర నిధులతో 2016 మార్చి నాటికి ఏదో రకంగా స్ర్పింగ్ సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ ప్రకటించింది. నిధుల కోసం లామేకర్స్ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు యూనివర్సిటీ ప్రెసిడెంట్ థామస్ జె. కల్హాన్ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కష్టకాలం నుంచి బయటపడతామని ప్రకటించారు. అసలా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వగలదా? ఇంతటి దయనీయ పరిస్థితులు యూనివర్సిటీలో ఉన్నప్పుడు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితి ఉండదని టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు చెబుతున్నారు. మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సమయాన్ని బట్టి డాక్టరేట్ అందుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారని, కానీ అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత ఆలోచించాలని టీడీపీ నేత ఒకరు చెప్పారు. రేపటి రోజున యూనివర్సిటీ పరిస్థితులు బాగుపడినా డాక్టరేట్ తీసుకోవడం వల్ల తాము ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా విమర్శల పాలవుతామన్న అనుమానాలను ఆ నేత వ్యక్తం చేశారు. -
లుంగీ డ్యాన్స్‌తో థ్రిల్ చేశాడు!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఎడిన్బర్గ్ ఘనంగా సత్కరించింది. ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ జీవితపాఠాలను ఉద్వేగభరితంగా వివరించారు. అనంతరం వేదికపై తన పాపులర్ లుంగీ డ్యాన్స్‌తో విద్యార్థులను అలరించాడు. ఆ తర్వాత 'నేను మళ్లీ డాకర్ట్ అయ్యానోచ్' అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. షారుఖ్ ప్రసంగంలోని కొన్నిముఖ్యమైన అంశాలు జీవితంలో 'సాధారణం' అంటూ ఏదీ లేదు. అదొక జీవం లేని పదం మాత్రమే. సంతోషకరమై, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొంత పిచ్చితనం (రొమాంటిక్ తరహాలో) కూడా అవసరమే. మీ వెర్రితనాన్ని ఎప్పుడు చంచలత్వంగా భావించకండి. బయటి ప్రపంచం నుంచి దాచిపెట్టకండి. ప్రపంచంలోని అందమైన వ్యక్తులు, సృజనకారులు, విప్లవాలు తీసుకొచ్చినవాళ్లు, ఆవిష్కరణలు చేసినవాళ్లు.. తమ నైజాన్ని, ప్రవృత్తిని స్వీకరించడం వల్లే వాటిని సాధించారు గడబిడ కావడంలో తప్పేమీ లేదు. ప్రపంచం గురించిన స్పష్టత కావాలంటే గడబిడ పడటం కూడా ఒక మార్గమే. కళాకారుడి కన్నా కళే ముఖ్యం. మీదైన కళతో మీకు అనుబంధం లేకపోవడమే వెనుకబాటు. ముందుకుసాగండి. మీరు సంపన్నులు కాకముందే తత్వవేత్తలు అవొద్దు. మీరు చేస్తున్న పని మీలో 'జోష్'ను (ఉత్సాహాన్ని) నింపకపోతే దానిని మానేయండి -
జంధ్యాలకు గౌరవ డాక్టరేట్!
రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగి, సకుటుంబ వినోద చిత్రాలతో ఒక దశాబ్దిన్నర కాలం పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘన సినీ చరిత్ర - జంధ్యాలది. రచన, దర్శకత్వాల ద్వారా కొన్ని తరాలు చెప్పుకొనే కామెడీతో వెండితెరను వెలిగించిన ఆయనకు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. మరణించిన 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆయనకు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాకు చెందిన అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, యునెటైడ్ నేషన్ ఆర్గనైజేషన్‌కు అనుబంధమైన స్వస్త ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లు ఈ నవంబర్ 1న బెంగళూరులో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. స్వర్గీయ జంధ్యాల తరఫున ఆయన సతీమణి అన్నపూర్ణ ఈ పత్రాన్ని స్వీకరించారు. మనిషి ఉండగానే అవసరం లేకపోతే మర్చిపోయే సినీ (మాయా) ప్రపంచంలో ఒక వ్యక్తి భౌతికంగా కనుమరుగైన ఇన్నేళ్ళకు ఇలాంటి గౌరవం దక్కడం నిజంగా విశేషమే! -
రతన్ టాటాకు కెనడా వర్సిటీ గౌరవ డాక్టరేట్!
టొరొంటో: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం దక్కింది. రతన్ టాటాకు కెనడాలోని ప్రఖ్యాత యార్క్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. సామాజిక బాధ్యతగా కార్పోరేట్ వ్యాపారాన్ని ప్రమోట్ చేసినందుకుగాను గౌరవ డాక్టరేట్ ను యార్క్ వర్సిటీ అందించ్చింది. గౌరవ డాక్టరేట్ ను అందుకునేందుకు రతన్ టాటా టొరొంటోకు వెళ్లారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో రతన్ ఈ అవార్డును అందుకున్నారు. పోటీ ప్రపంచంలోకి మీరు వెళ్లగలిగితే.. వ్యాపార రంగం కాని.. ప్రపంచంలోని ఇతర రంగాల్లో లీడర్లుగా ఎదుగుతారు. లక్షలాది మందికి మీకంటే తక్కువ అవకాశాలున్నాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు సాధించే విజయాలు.. మీ జీవితంలో చాలా మార్పులు తెస్తాయి అని రతన్ టాటా తన ప్రసంగంలో పేర్కొన్నారు.