ఇక నుంచి డాక్టర్ తమన్నా...
చెన్నై: సినిమా నటులను కదిలిస్తే ఎక్కువ మంది డాక్టర్ కాబోయి యాక్టర్‌ను అయ్యానంటూ చెప్తారు. ఇందులో ఆశ్చర్యమేముంది..? నటన రంగంలో ఉంటూనే కొందరు ఎంబీబీఎస్ చదివి డాక్టర్లు అవుతున్నారు. మరికొందరు తమ వృత్తిలో సాధించి గౌరవ డాక్టరేట్‌లు అందుకుంటున్నారు. ఇక హీరోయిన్ తమన్నా విషయానికొస్తే పైన చెప్పిన వాటిలో రెండో కోవకు వస్తారు. ఈ బ్యూటీ 2006లో కేడీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం నిరాశపరచినా, బాలాజీశక్తివేల్ దర్శకత్వం వహించిన కల్లూరి చిత్రం తమన్నకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తరువాత తమిళం, తెలుగు అంటూ కేరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం తమన్నాకు లేకపోయింది.
తెలుగు, తమిళంలోని స్టార్ హీరోలందరితోనూ జత కట్టారు. ఇక బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌కు జంటగా స్కెచ్ సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా గౌతంమీనన్ నిర్మాతగా తెరకెక్కనున్న తెలుగు చిత్రం పెళ్లిచూపులు రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్‌లోనూ తమన్నా హీరోయిన్‌గా మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇలా పలు భాషా చిత్రాలతో నటిగా పుష్కర కాలంలోకి అడుగు పెట్టిన తమన్న కళాసేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ కమిషన్ అనే గుజరాత్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని నటి తమన్న తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఈ గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంచినట్లు భావిస్తున్నాననీ, ఆ గౌరవాన్ని నిలుపుకోవడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.