
‘‘ఓ పల్లెటూరి కథని ఎగ్జయిటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ ‘ఓదెల 2’ని ఓ రేంజ్‌లో తీశారు. నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు కొత్త అనుభూతి దక్కాలని కోరుకుంటాను. అలాంటి సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని తమన్నా తెలిపారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది.
అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా ఇతర పాత్రల్లో నటించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ చూసినప్పుడే పార్ట్ 2 ఉండాలని భావించాను. సంపత్ నందిగారు పార్ట్–2 ఐడియా చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను.
నా కెరీర్‌లో అత్యధిక ఐ షాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ‘ఓదెల 2’’ అన్నారు. ఈ మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘నేను ఓదెల అనే ఊర్లో పుట్టి, పెరిగాను. చాలా గౌరవంగా, ప్రేమతో ఈ కథ రాశాను. ఓదెలకు ఒక కష్టం వస్తే... ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనేది ఈ చిత్రకథ. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది’’ అని చెప్పారు. ‘‘కథని నమ్ముకుని తీసిన ‘ఓదెల 2’ని ప్రేక్షకులు థియేటర్స్‌లో చూసి, ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డి. మధు. ‘‘ఆకలిగా ఉందని అన్నం కోసం సంపత్ నందిగారి దగ్గరికి వెళ్లాను... ‘ఓదెల 2’ రూపంలో ఆయన బిర్యానీ తినిపించారు’’ అని అశోక్ తేజ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment