బాబు బడాయి డాక్టరేట్‌కు తిప్పలు | chandra babu may not receive doctorate, university on the verge of closure | Sakshi
Sakshi News home page

బాబు బడాయి డాక్టరేట్‌కు తిప్పలు

Published Fri, Jan 29 2016 6:29 PM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

chandra babu may not receive doctorate, university on the verge of closure

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలోని ఒక యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ అందుకుంటారా? డౌటే... ఎందుకంటే ఆ యూనివర్సిటీకి అంత సీన్ లేదని తేలిపోయింది కాబట్టి. ఇప్పుడు ఆ యూనివర్సిటీ బండారం బట్టబయలైంది. లాబీయింగ్ చేసి నిధుల కోసం డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ యూనివర్సిటీ లేదు. అనేక ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలు, నిధుల సమస్య కారణంగా ఆ యూనివర్సిటీ ఇప్పుడు మూసివేత దిశగా పయనిస్తోంది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తేమిటని తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.

విషయమేంటంటే... అమెరికా ఇల్లినాయిస్‌లోని చికాగో స్టేట్ యూనివర్సిటీ.. ఏపీ సీఎం చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. గత డిసెంబర్‌లో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు స్వయంగా విజయవాడకు వచ్చి ఆ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబును కలిసి తామిచ్చే డాక్టరేట్ స్వీకరించాలని కోరారు. ఇదంతా డిసెంబర్ మూడోవారంలో జరిగింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అనగానే టీడీపీ నేతలు ఆర్భాటం చేశారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం అంటూ తెగ ప్రచారం చేశారు. దానిపై అప్పట్లో చంద్రబాబు స్పందిస్తూ, అమెరికాలోని ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్లు ఇస్తామన్నా... కాదన్నానని, ఎంతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ కావడం వల్లే చికాగో యూనివర్సిటీ కి ఉన్న చరిత్రను చూసి ఆ యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్ ను స్వీకరించాలని నిర్ణయించానని చెప్పుకొచ్చారు.

ఆ యూనివర్సిటీ ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి స్వయంగా చంద్రబాబును కలిసిన సందర్భంగా... మీకు వీలైనప్పుడు వచ్చి గౌరవ పురస్కారాన్ని స్వీకరించాలని కోరారు. అందుకు అంగీకరించిన చంద్రబాబు ఆ విషయంపై అప్పట్లో హర్షం వ్యక్తంచేశారు. తనకు చికాగో యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా  ప్రకటించారు. కానీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ చికాగో యూనివర్సిటీ కాదని, అది చికాగో స్టేట్ యూనివర్సిటీ అని ఆ తర్వాత బయటపడటంతో నవ్వులపాలు కావలసివచ్చింది. (చంద్రబాబు తన ట్విట్టర్‌లో మాత్రం చికాగో యూనివర్సిటీగానే చెప్పుకొన్నారు). ప్రమాణాల విషయంలో ఆ రెండు వర్సిటీల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నట్టు వెల్లడైంది. పైపెచ్చు ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ ఒకరు స్థానిక టీడీపీ నేత ఒకరికి సన్నిహితుడు కావడం వల్లే డాక్టరేట్ ప్రకటన వెలువడిందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

ఇంత చేసి ఏదో ఒక యూనివర్సిటీ... ఏదో ఒక డాక్టరేట్ అనుకుందామా.. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోందని చంద్రబాబు సన్నిహితులు తెగ బాధపడిపోతున్నారట. యూనివర్సిటీ తన గుర్తింపు కోసం ప్రతి ఏటా తంటాలు పడుతోందని అప్పట్లోనే వార్తలు వెలువడగా, ఇప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో యూనివర్సిటీ కొట్టుమిట్టాడుతోంది. ప్రతి ఏటా 30 శాతం స్టేట్ ఫండింగ్‌పై ఆధారపడి నడుస్తున్న ఆ యూనివర్సిటీ ఇప్పుడు నిధులు లేక నడిపించే పరిస్థితి కూడా లేదు. అరకొర నిధులతో 2016 మార్చి నాటికి ఏదో రకంగా స్ర్పింగ్ సెమిస్టర్ పూర్తి చేస్తామని వర్సిటీ ప్రకటించింది. నిధుల కోసం లామేకర్స్ ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు యూనివర్సిటీ ప్రెసిడెంట్ థామస్ జె. కల్హాన్ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కష్టకాలం నుంచి బయటపడతామని ప్రకటించారు.

అసలా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వగలదా?
ఇంతటి దయనీయ పరిస్థితులు యూనివర్సిటీలో ఉన్నప్పుడు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసే పరిస్థితి ఉండదని టీడీపీకి చెందిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు చెబుతున్నారు. మార్చిలో జరిగే  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత సమయాన్ని బట్టి డాక్టరేట్ అందుకోవడానికి చంద్రబాబు అమెరికా వెళ్లాలనుకున్నారని, కానీ అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత ఆలోచించాలని టీడీపీ నేత ఒకరు చెప్పారు. రేపటి రోజున యూనివర్సిటీ పరిస్థితులు బాగుపడినా డాక్టరేట్ తీసుకోవడం వల్ల తాము ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా విమర్శల పాలవుతామన్న అనుమానాలను ఆ నేత వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement