
‘కర్షక జ్యోతి’ ఈ బాల రైతు!
నేడు మన పల్లె రైతుల నోట అనునిత్యం తారాడే మాట ‘వ్యవసాయం ఏళ్లనాటి శని’. అందుకే పచ్చదనాల పల్లె బీడు పడిపోతోంది. పుట్టెడు మట్టిలోంచి అన్నం తీసే రైతు బతుకు మట్టి కొట్టుకుపోతున్నది. ఈ తీరు చూస్తే ఏడేడు జన్మల వరకు వ్యవసాయం వైపు చూడకూడదనుకునే పరిస్థితి. తమ బిడ్డలు ఇంజనీరో, డాక్టరో కావాలని డాలర్లు, యూరోలు మూటగట్టుకోవాలని కోరుకునే తల్లిదండ్రుల కాలం. చదువులు ముగియక ముందే పరాయి దేశాల్లో శాశ్వత పౌరుడి హోదా దక్కించుకోవాలనే వెంపర్లాటలో యువతరం. ఈ ఇదీ నేటి సామాజిక చిత్రపటం.
ఇలా ఊరంతా నడుస్తున్న దారికి ఎదురు నడిచాడో 17 ఏళ్ల కుర్రాడు. పాలు గారే మోమే.. కానీ కళ్లలో ఆత్మవిశ్వాసపు వెలుగుంది. అందుకే అతను పిన్న వయస్సులోనే పంటలు పండించడమే కాకుండా.. కేరళ ప్రభుత్వం నుంచి ఇటీవల ‘కర్షక జ్యోతి’ అవార్డును కూడా అందుకున్నాడు. భావి భారత వ్యవసాయానికి వెలుగుబాట చూపే వారిలో తానొకడినని చాటాడు. కేరళ రాష్ట్రం వెనాడు జిల్లా మాతమంగళం గ్రామానికి చెందిన సూరజ్ అంబలావాయల్ వృత్తి విద్యా పాఠశాలలో 12వ తరగతి విద్యార్థి. రెండేళ్ల కిందట సుల్తాన్ బతేరీలో ప్రకృతి వ్యవసాయ విధానంపై ప్రకృతి వ్యవసాయ మార్గదర్శి సుభాష్ పాలేకర్ నిర్వహించిన సదస్సుకు హాజరయ్యాడు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన సూరజ్‌కు అనునిత్యం రైతు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియనివి కాదు. ఈ సదస్సుకు హాజరైన తరువాత వ్యవసాయ సమస్యల చిక్కుముడి వీడినట్లు అనిపించింది. వెంటనే తమ పొలంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాడు. అతని పొలం ప్రకృతి వ్యవసాయ ప్రయోగశాలగా మారింది. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండానే అన్ని రకాల కూరగాయలు, కంద, అరటితో పాటు మరో 50 రకాల పండ్లు, మరో 60 రకాల ఔషధ మొక్కలను సాగు చేస్తున్నాడు సూరజ్! గత సంవత్సరం క్యాబేజీ, కందలో రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘కర్షక జ్యోతి’ అవార్డును అందుకున్నాడు. పుట్టిన మట్టితో అనుబంధాన్ని తెంపుకొని సముద్రాలను దాటి వెళ్లి డాలర్ల పంటను కలగంటున్న వారికి తన కృషితో కనువిప్పు కలిగించాడు. పుట్టిన మట్టి కష్టాలు తీర్చాలనే కాంక్ష ఉంటే చాలు అనుకున్నది సాధించే దీక్షాదక్షతలను అందిపుచ్చుకోవచ్చని నిరూపించాడు. ప్రకృతి వ్యవసాయంతో సాధించిన విజయం ద్వారా భవిష్యత్ కర్షక లోకానికి భరోసాగా నిలిచాడు!