‘వ్యవసాయ’ ఉద్గారాలు  31% కాదు.. 60%! | What Causes Emissions In Agriculture? | Sakshi
Sakshi News home page

‘వ్యవసాయ’ ఉద్గారాలు  31% కాదు.. 60%!

Published Tue, Dec 19 2023 9:53 AM | Last Updated on Tue, Dec 19 2023 1:56 PM

What Causes Emissions In Agriculture? - Sakshi

'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్‌ పాలేకర్‌ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్‌ పాలేకర్‌ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన.

భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి  క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్‌ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్‌–మేనేజ్‌)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్‌తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..'

• పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
డా. పాలేకర్‌:  శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్‌ పాలేకర్‌ కృషి పద్ధతిని సోషల్‌ మీడియా (వెబ్‌సైట్, యూట్యూబ్, వాట్సప్‌) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్‌ తోపాటు హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్‌ మైక్రోబియల్‌ కల్చర్‌ను వినియోగిస్తే చాలు.

• దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు?
డా. పాలేకర్‌:  సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్‌ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్‌ నా టెక్నాలజీతో కన్విన్స్‌ అయ్యింది. హైదరాబాద్‌లోని ‘మేనేజ్‌’ సంస్థ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్‌ పాలేకర్‌ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్‌ జిల్లాలో విజయరామ్‌ సాగు చేస్తున్న ఫైవ్‌ లేయర్‌ మోడల్‌ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్‌ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను.

• పర్యావరణ సంక్షోభంపై దుబాయ్‌లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్‌28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..!
డా. పాలేకర్‌:  అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. 

• మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..!
డా. పాలేకర్‌: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్‌ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి.

సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్‌లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి.

మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర  పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్‌.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.

• రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా?
డా. పాలేకర్‌:
ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబ‌డుతుంది.

అందులో నుంచి కర్బనం విడుదలై  ఆక్సీకరణం చెంది కార్బన్‌ డయాక్సయిడ్, నైట్రస్‌ ఆక్సైడ్, మీథేన్‌ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్‌ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా.

• మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..?
డా. పాలేకర్‌: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్‌ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్‌ పాలేకర్‌ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు.  నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్‌ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు.

• పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్‌ పాలేకర్‌ కృషి’ అని అంటున్నారెందుకని?
డా. పాలేకర్‌: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్‌ పాలేకర్‌ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్‌ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. 

• పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం?
డా. పాలేకర్‌:  ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన  పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్‌ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి.

• రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా?
డా. పాలేకర్‌: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్‌ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్‌లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్‌ పాలేకర్‌: వాట్సప్‌– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in)

- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement