ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం) : దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 2050 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. సోమవారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) స్నాతకోత్సవ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని, వీరికి 50 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు అవసరమవుతాయని ప్రణాళికా సంఘం సూచించినట్టుగా తెలిపారు.
అభివృద్ధి పేరుతో వ్యవసాయయోగ్యమైన భూమి క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూములను పరిశ్రమల్లో సృష్ట్టించలేమనే విషయాన్ని గుర్తించాలన్నారు. దేశం ఆహార నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడం సరికాదన్నారు. చిరు, పప్పు ధాన్యాలు, నూనెలు, పండ్లు వివిధ దేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని ప్రశ్నించారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ.. నేడు ప్రతీ ఆహార పదార్థం రసాయన పూరితంగా కనిపిస్తోందని, సహజ వ్యవసాయం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఏ.ఎస్ శర్మ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలేకర్‌ను రైతులు గజమాలతో సత్కరించారు.
2050 నాటికి ఉత్పాదకత రెట్టింపు కావాలి : పాలేకర్
Published Mon, May 4 2015 6:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement