సేంద్రియం కంటే ప్రకృతి సాగే మేలు | Nature is better than organic | Sakshi
Sakshi News home page

సేంద్రియం కంటే ప్రకృతి సాగే మేలు

Published Sat, Feb 3 2018 2:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Nature is better than organic - Sakshi

శుక్రవారం నగరంలో జరిగిన విత్తనోత్సవ సభలో మాట్లాడుతున్న ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌ పాలేకర్‌. చిత్రంలో కె.జానారెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ఆదాయం పెరగాలన్నా.. వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా.. రూపాయి పెట్టుబడి అవసరం లేని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే చాలని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌ పాలేకర్‌ సూచించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని, దీని వల్ల ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనేది అపోహ మాత్రమేనని అన్నారు. శుక్రవారం రామకృష్ణమఠంలో ప్రారంభమైన మూడు రోజుల విత్తనోత్సవానికి పాలేకర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విత్తనోత్సవం ప్రారంభ వేడుకల్లో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్, సినీనటుడు తనికెళ్ల భరణి, మాతా నిర్మలానంద, మాతా విజయేశ్వరీదేవి, సేవ్‌ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. 
కేంద్ర బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావడం అసాధ్యమని పాలేకర్‌ అన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల్లాగే వర్మికంపోస్టు వంటి రకరకాల సేంద్రియ ఎరువులపైనా రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, పైగా దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాదని చెప్పారు. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగు ద్వారా అద్భుతమైన దిగుబడి సాధించవచ్చని, ఒక్క ఆవు ద్వారా ప్రకృతి సాగుతో 30 ఎకరాల భూమిలో పంట పండించవచ్చని పాలేకర్‌ పేర్కొన్నారు. దేశీ విత్తనం, దేశీ ఆవు, మన మాతృభాష, మన ఆధ్యాత్మికతను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. జన్యుపరివర్తన విత్తనాలు, సంకర విత్తనాలు రసాయనాలు, పురుగుమందులు వినియోగించినప్పుడే దిగుబడిని ఇస్తాయని, దాంతో నేల పూర్తిగా పాడవుతుందని, ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. 

రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం.. 
ఎరువులు, పురుగుమందుల కోసం భారీగా ఖర్చు చేసి, సరైన దిగుబడి రాక, అప్పులపాలై లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాతా విజయేశ్వరీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేని ప్రకృతిసాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగును తమ జీవితంలో భాగం చేసుకోవాలని తనికెళ్ల భరణి కోరారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మందికిపైగా రైతులు, సహజ సాగు పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు, సేవ్‌ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న విత్తన ప్రదర్శన.. 
ఆదివారం వరకు కొనసాగనున్న విత్తనోత్సవంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు ప్రదర్శించిన వివిధ రకాల వరి విత్తనాలు ఆకట్టుకున్నాయి. సహజ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ప్రదర్శించారు. విత్తనోత్సవానికి వచ్చిన రైతులకు అర కిలో చొప్పున రెండు రకాల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు.

కొన్ని రకాల వరి విత్తనాల ప్రత్యేకతలు ఇవీ.. 
- తమిళనాడుకు చెందిన ‘మా పిళ్లై సాంబ’ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వరి. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కొత్త అల్లుడికి ఈ బియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తారు. 180 రోజుల్లో ఇది చేతికొస్తుంది. 
- తమిళనాడు, కర్ణాటకలో విరివిగా పండించే ‘కులాకార్‌’రకం బియ్యం గర్భిణులకు వరప్రదాయిని. ఈ అన్నం తిన్న గర్భిణిలకు సాధారణ కాన్పు అవుతుందని, పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ప్రజల నమ్మకం. 130 నుంచి 140 రోజుల్లో ఇది పండుతుంది. 
- కేన్సర్‌ నివారణకు దివ్యౌషధంగా పనిచేసే ‘కర్పుకౌని’(నల్ల బియ్యం) వరిని తమిళనాడులోనే పండిస్తున్నారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. 
- అధిక దిగుబడినిచ్చే మరో రకం వరి ‘బహురూపి’. ప్రకృతి సాగు భూమిలో 3 ఏళ్ల తర్వాత ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి సాధించవచ్చు. పంట కాలం 140 రోజులు. పశ్చిమ బెంగాల్‌లో వీటిని పండిస్తున్నారు. 
- మధుమేహాన్ని అదుపులో ఉంచే ‘నవ్వారా’రకం కేరళ, తమిళనాడులో పండిస్తున్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే ఈ రకంలో 17.5 రెట్లు పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పంటకాలం 120 రోజులు. 
- ప్రపంచంలోనే అతి చిన్న వడ్లగింజగా పేరొందిన ‘తులసీబాసో’బియ్యం సుగంధ భరితంగా ఉంటాయి. పోషకాలు ఎక్కువ. 130–140 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒడిశాలో వీటిని పండిస్తున్నారు. 
- పశ్చిబెంగాల్‌లో ‘నారాయణ కామిని’వరి విత్తనాలను పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండే అన్నం రుచిగా ఉంటుంది. పంటకాలం 140 రోజులు.

చిరుధాన్యాలకు డిమాండ్‌ 
ఈ ప్రదర్శనకు చిరుధాన్యాలు తెచ్చా ను. చాలామంది కొనుగోలు చేశారు. ప్రజ ల్లో ఆరోగ్యం పట్ల, సహజ పంటల పట్ల అవగాహన పెరగడం చాలా సంతోషం. 
 – మహేష్, అరకు కూరగాయలు,ఆకుకూరలు పండిస్తున్నాం 
సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. ఆ విత్తనాలను ప్రదర్శనలో పెట్టాం. క్షణాల్లో అమ్ముడయ్యాయి. 
– మనూ, సహజ స్వీట్స్, బెంగళూరు 

ప్రదర్శన చాలా బాగుంది 
ఇలాంటి ప్రదర్శనకు రావడం ఇదే తొలిసారి. చాలా వెరైటీలు ఉన్నాయి. పూల మొక్కలు, కూరగాయల విత్తనాల కోసం వచ్చాను. 
– తులసి, హైదరాబాద్‌ 

రూఫ్‌ గార్డెనింగ్‌పై ఆసక్తి 
దేశీ కూరగాయల విత్తనాలు లభిం చాయి. మార్కెట్‌లో దొరికేవన్నీ హైబ్రీడ్‌. ఇలా లభించడం అరుదు. మా ఇంటిపై పండించాలనుకుంటున్నాం. 
– మౌనిక, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement