'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'.
పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు.
ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..!
మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం.
మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్‌చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం.
వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది.
– ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
80 సెంట్లలో బహుళ పంటల సాగు..
ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు.
సలాడ్‌లలో వినియోగించే అరుదైన బాక్‌చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్‌రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు.
ఆకర్షితులవుతున్న ప్రజలు..
పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్‌లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
కమ్యూనిటీ ఫార్మింగ్..
ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్‌నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు.
వలంటీర్లకు అవకాశం..
అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్‌లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్‌ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం
తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా..
తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు.
9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050.
7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు..
ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే.
Comments
Please login to add a commentAdd a comment