ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్‌గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్‌లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
∙∙
1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్‌లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్‌లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్‌ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు.
∙∙
పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి.
పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్‌లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా!
(చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment