(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది.
భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు.
కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు
నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం.
సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది.
ఏడాదికి నాలుగైదు పంటలు
ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం.
స్వర్ణ, సాంబ మసూరి సహా..
వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు.
స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్‌ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్
ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు..
’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు.
– డాక్టర్ వికాస్‌కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment