నూతన పద్ధతిలో శునకాల జన్మ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (కృత్రిమ ఫలదీకరణ) ద్వారా ప్రపంచంలోనే తొలిసారి కుక్కపిల్లలను సృష్టించారు అమెరికా శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి ద్వారా పుట్టిన 7 పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మొత్తం 19 అండాలను ఆడ కుక్కలోకి ప్రవేశపెట్టగా అది జూలై నెల్లో పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు పురోగతి చెందితే... మనుషులు, జంతువుల్లో వ్యాధినిరోధక లక్షణాలపై మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
1970ల నుంచే కుక్కలపై ఐవీఎఫ్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అవి సఫలం కాలేదని కార్నెల్ కాలేజ్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్ ప్రొఫెసర్ అలెక్స్ ట్రావిస్ తెలిపారు. కుక్కల అండవాహికలో అండాలను ఒక రోజు అదనంగా ఉంచితే అవి ఫలదీకరణ చెందేందుకు మంచి అవకాశాలు ఉంటాయని కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మెగ్నీషియంకు సెల్ కల్చర్‌ను జోడించడంతో ఇతర జంతువుల్లా కాకుండా ఆడ శునకాల్లో పునరుత్పత్తి వ్యవస్థపై పనిచేసి పిండంగా మారేందుకు సహాయపడుతుందని వారు చెప్తున్నారు.
తాము చేసిన రెండు కొత్త మార్పులు ఇప్పుడు 80 - 90 శాతం విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయని ట్రావిస్ చెప్పారు. కుక్కల పునరుత్పత్తి చక్రంలో సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు ఇంప్లాంట్ చేసే అవకాశం ఉందని.. ఫలదీకరణ చెందిన అండాలను ప్రవేశపెట్టడం కూడా పెద్ద సవాలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించుకునేందుకు ఐవీఎఫ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.