bio
-
అమెరికా చట్టంతో భారత్‌కు లాభం..!
దేశీయ ఫార్మా కాంట్రాక్ట్ తయారీ వ్యాపార విభాగం త్వరలోనే రెట్టింపు అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు చైనా ఫార్మా కంపెనీల కొనుగోళ్లు జరపకుండా అమెరికా బయోసెక్యూర్ చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. చైనా నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా భారత్‌కు మళ్లుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్ తయారీ సెగ్మెంట్ వచ్చే మూడేళ్లలో రెండింతలు కాగలదని, అలాగే కాంట్రాక్ట్ రీసెర్చ్ సెగ్మెంట్ మూడు రెట్లు వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మోర్డోర్ ఇంటెలిజెన్స్ నివేదిక విడుదల చేసింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో అంతర్జాతీయంగా కాంట్రాక్ట్ అభివృద్ధి, తయారీ సెగ్మెంట్ (సీడీఎంవో) 22.51 బిలియన్ డాలర్లు(రూ.1.8 లక్షల కోట్లు)గా ఉంది. ఇది ఏటా 14.67 శాతం వృద్ధితో 2029 నాటికి 44.63 బిలియన్ డాలర్ల(రూ.3.7 లక్షల కోట్లు)కు చేరనుంది. ఫార్మా విభాగం గణాంకాల ప్రకారం దేశీయంగా కాంట్రాక్ట్ రీసెర్చ్ (సీఆర్వో) సెగ్మెంట్ వార్షికంగా 10.75 శాతం వృద్ధితో 2030 నాటికి 2.5 బిలియన్ డాలర్ల(రూ.20 వేలకోట్లు)కు చేరనుంది. భారతీయ సీడీఎంఏ సెగ్మెంట్ ఇప్పటికే అభివృద్ధి చెందినా, బయోసెక్యూర్ చట్టం అమల చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది.ప్రస్తుతం చైనా సీడీఎంవో పరిశ్రమకు అంతర్జాతీయంగా 8 శాతం మార్కెట్ వాటా ఉండగా, భారత్‌కు 2.7 శాతం వాటా ఉంది. చైనా వాటాను కొల్లగొట్టడానికి ఈ చట్టం భారత్‌కు బాగా ఉపకరించగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు అమెరికన్ సంస్థలు ఉత్పత్తి కొనుగోళ్ల కోసం పలు భారతీయ కంపెనీలను సంప్రదిస్తున్నట్లు వివరించాయి. సుమారు 60 శాతం భారతీయ ఫార్మా కంపెనీలు కొత్త వ్యాపార అవకాశాలు వస్తున్నట్లు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీపోటీ కూడా ఉంది..బయోసెక్యూర్ చట్టంతో ఉపయోగాలు ఉన్నప్పటికీ మన ఫార్మా కంపెనీలకు వెంటనే ప్రయోజనాలు లభించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఐర్లాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి మన కంపెనీలకు గట్టి పోటీ ఉండొచ్చని వివరించాయి. అమెరికాలో ప్రస్తుతం 120 ఔషధ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా తోడ్పాటు ఉన్న ఈ ప్రాజెక్టులు మన వైపు మళ్లేందుకు సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుత ఒప్పందాలను మరికొంత కాలం కొనసాగించుకునేందుకు వీలు కల్పించే నిబంధనల వల్ల తక్షణం ఆర్థిక లబ్ధి చేకూరకపోవచ్చని వివరించాయి. అయితే, భారతీయ కంపెనీలకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సిప్లా, సింజీన్ వంటి సీడీఎంవోలు తక్కువ వ్యయాలతో ఔషధాలు తయారు చేయగలవు. అలాగే వాటికి సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు కూడా అందిస్తోంది. మొత్తం మీద బయోసెక్యూర్ చట్టమనేది భారతీయ సీడీఎంవో విభాగానికి గేమ్ చేంజర్‌గా ఉండగలదని విశ్లేషకులు తెలిపారు. -
61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
మనుషులు ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా వయసును దాచడం సాద్యం కాదు. వయసు రీత్యా వచ్చే మార్పులను కూడా ఆపలేం. కానీ ఇక్కడొక వ్యక్తి తాతా వయసులో ముప్పై ఏళ్ల కుర్రాడిలా అదిరిపోయే ఫిట్నెస్తో కనిపిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతడి ఆరోగ్య రహస్యం వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో ఇలా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారా..? అనుకుంటారు. వివరాల్లోకివెళ్తే..యూఎస్‌లోని మిచిగాన్కు చెందిన 61 ఏళ్ల డేవ్ పాస్కో 38 ఏళ్ల కుర్రాడి మాదిరిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరోగ్య, దీర్ఘాయువు కోసం కఠిన జీవన శైలిని అనుసరించేవాడు దేవ్ . తనని తాను బయోహ్యాకర్గా అభివర్ణించుకుంటాడు. ఆహారం, వ్యాయామం పట్ల కనబర్చిన శ్రద్దే జీవసంబందమైన వయస్సును 38 ఏళ్లకు మార్చిందని దేవ్ చెబుతున్నారు. అంతేగాదు తన రోజువారి దినచర్య గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను సూర్యోదయానికి ముందే లేచి ఆరుబయట గడపటం, వ్యాయమాలు చేయడం వంటివి చేస్తానని తెలిపారు. అలాగే నిర్థిష్ట ఆహార నియమాలను పాటిస్తానని, ప్రతిరోజూ దాదాపు 158 సప్లిమెంట్లను తీసుకుంటానని అన్నారు. తన లక్ష్యం కేవలం తన వయసు తక్కువగా చూపించేలా ఉండటం, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటమేనని తెలిపారు. అంతేగాదు తనకు 90 లేదా 110 ఏళ్లు వచ్చినా.. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా జీవించాలన్నదే తన లక్ష్యం అని చెబుతున్నారు దేవ్. ఎన్నీ అర్జెంట్ పనులు, అవాంతరాలు వచ్చినా.. తన రోజువారి దినచర్య పూర్తి అయ్యిన తర్వాతే ఏదైనా చేస్తానని తేల్చి చెప్పారు. తన విలువై సమయాన్ని ఇతరులతో గడిపేందుకు ఇవ్వనని, ఒంటిరిగానే ఉంటానని అంటున్నారు. అయితే ఇలా ఒంటరిగా ఉన్నప్పుడూ తనతో తాను కనెక్ట్ అయ్యేలా చేసుకుంటాడట దేవ్. మిగతా సమయం అంతా వ్యాయామాలు, ఆవిరి సెషన్లతో గడిచిపోతుందట. అలాగే అతడు చాలా అరుదుగా భోజనం చేస్తాడట. అంతేగాదు సేంద్రియ గడ్డి తినే గొడ్డు మాంసం, ఫ్రీ రేంజ్ చికెన్ లేదా చేపలు డిన్నర్లో తీసుకుంటాడట. ముఖ్యంగా ఎక్కువ కూరగాయలు, వెల్లుల్లి, తప్పకుండా ఉండేలా చూసుకుంటాడట. అయితే ఇక్కడ దేవ్ బరువు పెరగకపోవడానికి కారణం.. కార్బోహైడ్రేట్లను పరిమితం చేయడమేనని చెబుతున్నాడు. ఇక్కడ దేవ్ బయోహ్యాకింగ్ పద్ధతుల్లో సక్రమైన జీవనశైలితో వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసి కుర్రాడిలా ఫిట్నెస్గా మారాడు. ఇటీవలకాలంలో ఈ బయోహ్యాకింగ్ ఉద్యమం ఒక ట్రెండ్‌గా మారింది. అంటే ఆరోగ్యంగా ఉండేలా వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వివిద పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తున్నారు. నిపుణులు మాత్రం దీనికి శాస్త్రీయ ధృవీకరణ లేదని, పైగా ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని హెచ్చరిస్తున్నారు. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
Interim Budget 2024: బయో–ఫౌండ్రీకి స్కీము
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా త్వరలో బయో–తయారీ, బయో–ఫౌండ్రీ కోసం కొత్తగా స్కీమును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బయో–ఫార్మా, బయో–ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మొదలైన వాటికి ఇది ఊతమివ్వనుంది. ప్రపంచ ఎకానమీని మార్చేయగలిగే సత్తా ఈ స్కీముకు ఉంటుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ బయో ఆర్థిక వ్యవస్థ గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 140 బిలియన్ డాలర్లకు చేరిందని సింగ్ చెప్పారు. -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్లోనే తిందాం!
బుద్ధి గడ్డి తినడం కాదిది. బుద్ధిగా గడ్డి ప్లేట్లో తినడం. పర్యావరణ పరిరక్షణ పట్ల బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని. దీనికి పెట్టిన అందమైన పేరే బయో డిగ్రేడబుల్ టేబుల్ వేర్. కేరళకు చెందిన రిషభ్, రోషన్ సోదరుల ప్రయోగం ఇది. సముద్రాన్ని కూడా వదలని కాలుష్యం నుంచి తీసుకున్న నిర్ణయం. వీళ్లు ప్లేట్ల తయారీకి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఇప్పుడు ఉపయోస్తున్న ఫైబర్, పాలిథిన్ పొర ఉన్న పేపర్ ప్లేట్లలో భోజనం చేసి బయట పారేసినప్పుడు చెత్త కుండీల దగ్గర చేరిన కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు ప్లేట్లను కూడా నమిలి మింగేస్తుంటాయి. దాంతో అవి అనారోగ్యాల బారిన పడుతుంటాయి. ఫైబర్ బదులు బయో డీగ్రేడబుల్ ప్లేట్ వాడినట్లయితే... మూగజీవులు మనం పారేసిన మిగులు ఆహారంతోపాటు ప్లేట్‌ని తిన్నప్పటికీ వాటి ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు. ఈ ప్లేట్లను నానబెట్టి ఎరువుగా మార్చుకుని పంటకు వాడుకోవచ్చు. ఏమీ చేయకుండా వదిలేసినా కూడా ఈ మెటీరియల్ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి జవజీవాలను పెంచుతుంది. గడ్డి కంచం ఇలా పుట్టింది! అసలీ గడ్డి ప్లేట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... రిషభ్‌కి సర్ఫింగ్ ఇష్టం. కేరళ, కోవళమ్, అరేబియా సముద్రంలో సర్ఫింగ్ చేసేవాడు. సముద్రపు అలలను తప్పించుకుంటూ బోర్డు మీద పెడలింగ్ చేయడం అత్యంత సాహసంతో కూడిన ఆట. ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రిషభ్ తలకు, దేహానికి పాలిథిన్ పేపర్, ప్లాస్టిక్ వస్తువులు తగులుతుండేవి. ఒక్కోసారి పాలిథిన్ షీట్ వచ్చి కాళ్లకు చుట్టుకునేది. ఇలాంటిదే మరో సంఘటన ఈ సోదరులిద్దరికీ ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఎదురైంది. అక్కడి పర్వత శిఖరాల మీదకు ట్రెకింగ్ చేస్తున్నప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ కాలుష్యమే. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే పాలిథిన్ వ్యర్థాలను తప్పించుకుంటూ అడుగులు వేయడంతోనే ట్రెకింగ్ పూర్తయింది. ఈ సమస్య ఒక్క కేరళనే కాదు, ప్రపంచం అంతటినీ వేధిస్తోందనిపింంది. పర్యావరణం ఎదురుగా భూతంలా నిలిన ఈ సవాల్‌కు జవాబు వెతికే ప్రయత్నంలో వీరికి వచి్చన ఆలోచన ఈ బయో డీగ్రేడబుల్ టేబుల్‌వేర్. క్వాడ్రాట్ పేరుతో మొదలు పెట్టిన ఈ ప్రయోగంలో ప్లేట్ తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇరవై నెలల నిరంతర పరశోధన, ప్రయోగాలతో ఒక రపం వచ్చింది. వేడుకల్లో ఉపయోగించే పేపర్ ప్లేట్, అల్యమినియం ఫాయిల్ అద్దుకున్న ప్లేట్, ఫైబర్ ప్లేట్ల స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనే పరీక్షలన్నింటినీ ఈ బయోడీగ్రేడబుల్ ప్లేట్ పాసయింది. ఇలా చేస్తున్నారు! పంట పొలాల నుంచి గడ్డిని, రైస్ మిల్లుల నుంచి తవుడు, పొట్టు సేకరించి శుభ్రం చేసిన తర్వాత హీటర్‌లో వేడి చేసి, మెత్తగా పొడి చేసి ప్లేట్, కప్పు, స్పన్ ఆకారంలో ఉన్న మౌల్డ్ ఆధారంగా రపం తెస్తారు. ఈ ప్లేట్లు భోజనం చేసే లోపు నానిపోతాయేమో అనే సందేహం కలుగుతుంది. పులుపు, రసం, మజ్జిగతో హాయిగా భోజనం చేయవచ్చని, నీటిలో నానబెట్టిన తర్వాత అరగంట సేపటి వరకు వాటి షేప్ మారదని చెప్పారు. అలాగే కప్పులు మరింత దృఢంగా 70 నిమిషాల సేపు ద్రవాలను నిలిపి ఉంచుతాయి. ఒకసారి తయారైన ఈ టేబుల్ వేర్ని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. బయో డీగ్రేడబుల్ ప్లేట్లో ఆహారపదార్థాలు విదేశాలకెళ్తున్నాయి! ఢిల్లీ, ముంబయి, బెంగళరు నగరాలతోపాటు అండవన్ నికోబార్ దీవులు, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు ఈ ప్రత్యామ్నాయాన్ని ఆదరిస్తున్నాయి. అంతేకాదు, యూఎస్, యూకే, కెనడా, మెక్సికోలు కూడా ఈ బయోడీ గ్రేడబుల్ టేబుల్ వేర్‌కు స్వాగతం పలికాయి. నెలకు ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, స్పన్లు అన్నీ కలిపి పాతిక వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు రిషభ్, రోహన్‌లు. పొట్ట ఉబ్బిపోతుంది! జంతువులు మనం తినే ఆహారం వైపు చూస్తున్నాయంటే వాటికి వాటి ఆహారం దొరకడం లేదని అర్థం. వీధికుక్కలతోపాటు ఆవులు మరికొన్ని జంతువులు ఓ దశాబ్దకాలంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో మరణిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలే. ప్లాస్టిక్ వ్యర్థాలను వరుసగా నెలరోజుల పాటు తిన్నాయంటే వాటి పెద్దపొట్టలో పదహారు నుంచి పద్దెనిమిది కిలోల ప్లాస్టిక్ పేరుకుంటుంది. ఐదారు కిలోలు చేరినప్పటి నుంచి వాటికి ఇబ్బందులు మొదలవుతాయి. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోతుంది. అక్యూట్ బ్లోటింగ్‌తో కొద్ది రోజుల్లోనే మరణిస్తాయి. ఎవరి పెంపకంలో లేని జంతువులకు ఈ ప్రమాదం ఎక్కువ. పరిస్థితి ఎంత దయనీయమంటే... ఆవులు నెమరు వేసుకునే ప్రక్రియలో ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకున్నప్పుడు ఫైబర్, ప్లాస్టిక్ వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా బయటపడుతుంటాయి. బయటపడడం కొంతలో కొంత నయం. పాలిథిన్ కవర్లు లోపల చుట్టచుట్టుకుని పోతే వాటంతట అవి బయటకు రాలేవు. ఆపరేషన్ చేయడమే మార్గం. ఈ జంతువులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలన్నా కూడా ప్లాస్టిక్ పెద్ద పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అవి విసర్జక వ్యవస్థలోకి వెళ్లాయంటే ఇక ఏమీ చేయలేం. మరణాన్ని ఆపలేం. – డాక్టర్ మల్లేశ్ పాటిల్, అసిస్టెంట్ డైరెక్టర్, యానిమల్ హజ్బెండరీ, ఆంధ్రప్రదేశ్ (చదవండి: ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!) -
'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు. ఇదీ చదవండి: ‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్ -
80 బిలియన్ డాలర్లకు ‘బయో–ఎకానమీ’
న్యూఢిల్లీ: దేశాన్ని వృద్ధి బాటలో నడిపే క్రమంలో ప్రతీ రంగానికి తోడ్పాటు అందించాలని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యం లభించేదని, తమ ప్రభుత్వ హయాంలో అన్ని పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే గత ఎనిమిదేళ్లలో భారత ’బయో–ఎకానమీ’ ఎనిమిది రెట్లు పెరిగిందని, 10 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరిందని ప్రధాని పేర్కొన్నారు. బయోటెక్ వ్యవస్థలో టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచే రోజు ఎంతో దూరం లేదన్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పోను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశీయంగా అంకుర సంస్థల సంఖ్య వందల స్థాయి నుంచి 60 పైగా పరిశ్రమల్లో 70,000 పైచిలుకు చేరిందని మోదీ చెప్పారు. కొన్ని రంగాల ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని పేర్కొన్నారు. ’బయోటెక్ స్టార్టప్స్ ఆవిష్కరణలు: స్వావలంబన భారత్ సాధన దిశగా’ అంశంపై ఈ ఎక్స్పో సదస్సు రెండు రోజుల పాటు (జూన్ 9, 10) జరుగుతుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు, పరిశ్రమ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, తయారీదారులు మొదలైన వారం తా కలిసేందుకు ఇది వేదికగా నిలవగలదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
ప్లాస్టిక్ కాలుష్యానికి బయో ప్లాస్టిక్ సమాధానమా ?
ప్రస్తుతం రోజువారి జీవితంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు చర్చనీయాంశమయ్యాయి. వివిధ రూపాల్లో ప్లాస్టిక్ సంచుల ఉపయోగాన్ని తిరస్కరించాలనే పాత డిమాండ్ ఓ వైపు కొనసాగుతున్న కేవలం ఓ సారి వినియోగానికే ఉద్ధేశించిన ప్లాస్టిక్ నియంత్రణకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. బయో డీగ్రేడబుల్ లేదా బయో ప్లాస్టిక్స్ వినియోగానికి మధ్యతరగతి మొగ్గుచూపుతోంది. వీటిని మొక్కలు, తదితర పదార్థాలు ఉపయోగించి తయారు చేయడం వల్ల శుద్ధి చేసేందుకు లేదా తిరిగి ఉపయోగించేందుకు ఇవి కలిసొస్తాయి. అంతేకాకుండా తక్కువ కాలుష్యానికి కూడా ఇవి కారణమవుతాయి. భారత్‌లో వీటి వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. కొన్ని సింగిల్ యూస్’ (ఒకేసారి వినియోగం) ప్లాస్టిక్స్‌కు కూడా ప్రత్యామ్నాయాలున్నాయి. తినుబంఢారాలు లేదా పానీయాల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ సాఛెట్లకు బదులు సీసంతో కూడిన వస్తువులు ఉపయోగించవచ్చు . స్టయిరోఫోమ్ ప్లేట్లకు బదులు ఆకులు, బయోమాస్‌తో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. చెత్తబుట్టల్లో వ్యర్థాలు వేసేందుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్ బిన్ లైనర్లు’ బయో ప్లాస్టిక్స్‌లో అత్యధిక ఆదరణ పొందిన రకాలుగా నిలిచాయి. వీటి కోసం డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. బయోప్లాస్టిక్స్ ఎన్ని రకాలు... వివిధ రూపాల్లో నశించేందుకు (డీగ్రేడ్) వీలుగా బయోప్లాస్టిక్స్ రూపొందినట్టు చెబుతుంటారు. అయితే వాటిలో ఎరువుగా (కంపోస్ట్) మారేవిగా మార్కెట్ చేస్తున్నవీ ఉన్నాయి. ఫోటో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది మరో బయోప్లాస్టిక్గా గుర్తింపు పొందింది. సూర్యక్రాంతి తగిలితే క్రమంగా క్రమంగా క్షీణించే విధంగా వీటిని తయారుచేశారు. నీరు తగిలితే అతి చిన్న చిన్న ముక్కలుగా (2 మిల్లీమీటర్ల కంటే చిన్నగా) విడిపోయేలా బయోడీగ్రేడబుల్‌గా రూపొందించినవి ఉన్నాయి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలు చూడడం కంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా అనుసరిస్తున్న విధానాలు, కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశలో చర్యలు తీసుకుంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే బయో ప్లాస్టిక్స్‌లో కొంతలో కొంతైన పరిస్థితిలో మార్పు వస్తుందని సూచిస్తున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రత్నగిరిపై బయో గ్యాస్‌ప్లాంట్
35.49 లక్షలతో ఏర్పాటుకు చర్యలు కొండదిగువన గోశాలలో రెండు షెడ్ల నిర్మాణం దేవస్థానం కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ పాలకమండలి సమావేశంలో తీర్మానాలు అన్నవరం (ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలోని నిత్యాన్న దాన పథకంలోని ఆహార వ్యర్థాలు, వ్రతాల విభాగంలో వచ్చే వ్యర్థాలను వినియోగిస్తూ రత్నగిరి కొండమీద బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దేవస్థానం పాలకమండలి నిర్ణయించింది. పాలక మండలి సమావేశం ఆదివారం దేవస్థానంలోని ప్రకాష్‌సదన్‌లో గల సమావేశ మందిరంలో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగింది. సమావేశపు అజెండాలో పొందుపరచిన 41 అంశాలపై సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో సభ్యులు చిర్ల శేషుకుమారి, కొత్త వేంకటేశ్వరరావు, సత్తి వీరదానరెడ్డి, రొబ్బి విజయశేఖర్, మారెడ్డి శింగారెడ్డి, రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, యడ్ల భేతాళుడు, అవసరాల వీర్రాజు, కందుల విశ్వేశ్వరరావు, నున్న రామచంద్రరావు, మట్టే సత్యప్రసాద్, సింగిలిదేవి సత్తిరాజు, పర్వత రాజబాబు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, ఇన్చార్జి ఈఓ ఈరంకి జగన్నాధరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను అధికారులు తెలియజేశారు. ముఖ్యమైన తీర్మానాలు దేవస్థానంలోని శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ ఆలయాలు, తొలిపాంచా, ప్రసాదం కౌంటర్ కు రంగులు వేయడానికి తీర్మానించారు. దేవస్థానంలో గత నెలలో ఈ–ప్రోక్యూర్మెంట్ కం బహిరంగవేలం ద్వారా 14 టీ, కాఫీ మిషన్ల నిర్వహణకు గాను హెచ్చు పాటను ఖరారు చేశారు. కొండదిగువన గోశాలలో రూ.19.95 లక్షలతో ఏసీ షీటుతో రెండు షెడ్లు నిర్మించేందుకు తీర్మానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెందుర్తిలో నిర్మించిన గోశాలలో గోవుల పరరక్షణ, మేత, దాణా సరఫరా అన్నవరంలోని గోశాల ద్వారా చేసేందుకు పాలకమండలి తీర్మానించింది. రూ.30 లక్షలతో దేవస్థానంలోని ప్రకాష్ సదన్ సత్రం వెనుక గల పవర్ హౌస్‌లో, కొండదిగువన గల పంపా తీరంలో గల పవర్‌హౌస్‌లో అధునాతన పేనల్ బోర్డులు ఏర్పాటు చేయడానికి తీర్మానించారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం శివారు బలిఘట్టంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దత్తత తీసుకోవడానికి కమిషనర్ అనుమతి కోసం రాయాలని తీర్మానించారు. సత్యదేవుని ఆలయం వద్ద గల శయన మందిరం వద్ద రూ.2.75 లక్షలతో వ్యయంతో జియో షీట్‌తో షెడ్డు నిర్మాణం ప్రతిపాదనకు అంగీకరిస్తూ తీర్మానించారు. ప్రకాష్‌సదన్ వద్ద రూ.7.75 లక్షలతో టాయ్‌లెట్స్ మరమ్మతులకు తీర్మానించారు. శ్రీసత్యదేవ జూనియర్ కళాశాల మైదానంలో ఉపాధి హామీ నిధులతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానించారు. -
ఆర్పీ బయోలో కేళీలు వాస్తవమే
తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాలో ఆర్పీ బయో 226 వరి రకం సాగుచేసిన పొలాల్లో కేళీలు వచ్చిన మాట వాస్తవమేనని మార్టేరు వ్యవసాయ పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ద్వారా జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ విత్తనాలు పంపిణీ చేశారు. అయితే వీటిలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు రావడంతో మార్టేరు పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు, ఏరువాక శాస్త్రవేత్తలు, ఏపీ సీడ్స్ బృందం బుధవారం తొర్రేడులోని వరి పొలాలను పరిశీలించారు. పరిశోధనాకేంద్రం అసోసియేట్ డీన్ సత్యనారాయణ మాట్లాడుతూ బీపీటీ 5204కు ప్రత్యామ్నాయంగా ఆర్పీబయో రకం సరఫరా చేశారన్నారు. కేళీలు రావడం వల్ల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఏరువాక శాస్త్రవేత్తలు ప్రవీణ, నందకిషోర్, మార్టేరు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మల్లికార్జునరావు, చాముండేశ్వరి, కృష్ణంరాజు, రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకుడు (ఎఫ్ఏసీ) కె.సూర్యరమేష్, వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బయో డీజిల్ సరఫరా ప్రారంభం
హెచ్‌పీసీఎల్ టెర్మినల్ వద్ద ప్రారంభించిన సబ్ కలెక్టర్ గోకవరం : గోకవరంలోని హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో బయో డీజిల్ సప్లయి స్టేషన్ ప్రారంభమైంది. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ లాంఛనంగాప్రారంభించారు. తొలుత ప్లాంట్ సీనియర్ మేనేజర్ దామోదరన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్లాంట్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్, డ్రైవర్, వర్కర్, సెక్యూరిటీ తదితర విభాగాల వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మరణించిన హెల్పర్ వీరబాబు కుటుంబానికి ఉద్యోగుల తరఫున రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా బయో డీజిల్ సప్లయి స్టేషన్‌ను హెచ్పీసీఎల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం రాజమహేంద్రవరం, కాకినాడలోని సుమారు 12 బంకులకు బయో డీజిల్ సరఫరా చేస్తారని తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించారు. బయోడీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం ఉండదన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
'ఆత్మ' తక్కువ కథ ఎక్కువ!
దేశంలో ఆత్మకథల పరంపర కొనసాగుతోంది. నట్వర్ సింగ్ వివాదం ఇంకా చల్లారకముందే తెర మీదకు మరో ఆత్మ కథ వచ్చింది. ఇప్పటికే తమ ఆత్మకథలతో సంజయ్‌బారు, పీసీ పరేఖ్, నట్వర్ సింగ్ తదితరులు సంచలనం సృష్టించగా.... తాజాగా మార్గరెట్ అల్వా ఈ జాబితాలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా కూడా త్వరలో తన ఆత్మకథ రాయబోతున్నారు. రాజస్థాన్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన ఆమె త్వరలో పెన్ను పట్టుకోనున్నారు. సాధారణ కుటుంబం నుంచి రాజ్ భవన్ వరకూ సాగిన తన పయనం గురించి ఆమె ఈ పుస్తకంలో వివరించనున్నట్లు సమాచారం. అయితే వివాదాలు సృష్టించేందుకు ఈ పుస్తకం రాయటం లేదని మార్గరెట్ స్పష్టం చేయటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్' అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన విషయం తెలిసిందే. మహా భారతంలో భీష్ముడితో మన్మోహన్‌ను పోల్చిన సంజయ్ బారు, సోనియా ఎలా చెబితే అలా మన్మోహన్ నడుచుకున్నారని ఆ పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరుకే మన్మోహన్ ప్రధాని అని, సోనియా కనుసన్నల్లోనే ఆయన పాలన సాగించారంటూ విమర్శలు గుప్పించారు. ఇక సంజయ్ బారును స్పూర్తిగా తీసుకున్నారో ఏమో....కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శిగా పని చేసిన పీసీ పరేఖ్ కూడా 'క్రూసేడర్ అండ్ కాన్స్పిరేటర్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం ద్వారా తీవ్ర సంచలనం సంచలనం సృష్టించింది. తన పుస్తకంలో బొగ్గు మసి మొత్తం బయటపెట్టిన ఆయన కోల్గేట్ వ్యవహారంలో ప్రధాని పాత్రపై నిగ్గుతేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్' పేరుతో ఆత్మకథను రాశారు. రాజకీయాల్లో ఉక్కుమనిషిగా తన ఇమేజ్ను పెంచుకునే విధంగా ఈ పుస్తక రచన సాగిందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు, అధికారం ఉన్నవారి వద్ద పని చేసినప్పుడు.... వారి మధ్య ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే అవి మిగతావారికి ఆసక్తిని రేకెత్తించటంలో సందేహం లేదు. అయితే అధికారం చేతులు మారాక... ప్రయివేట్ సంభాషణలను ఆత్మకథల పేరుతో బయట పెట్టడం ఎంత వరకూ సమంజసం. సంచలనాల కన్నా మీడియా మాత్రం మాస్ మసాలా దొరికినట్లే. గతంలో మన్మోహన్పై సంజయ్ బారు, తాజాగా సోనియాపై నట్వర్ సింగ్ వెల్లడించిన విషయాలు అందరికి ముందు నుంచి తెలిసినవే. వారంటూ కొత్తగా చేసిన ఆరోపణలు ఏమాత్రం లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల అమ్ముకోవటానికి, వార్తల్లో నిలవటానికి జిమ్మిక్కులని కొట్టి పారేస్తున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఆత్మ కథల్లో ...'కథ'లు తప్ప దానిలో ఆత్మ కనిపించటం లేదని వినికిడి.