![Elon Musk Updates X Bio](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/musk-bio.jpg.webp?itok=S-HumYnd)
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్) శాఖకు అధిపతిగా ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మళ్లీ తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో వివరాలను మార్చారు. ఆయన అకౌంట్ తెరవగానే పేరు కింద కొత్తగా ‘‘వైట్‌హౌస్ టెక్ సపోర్ట్’’అనే పదాన్ని చేర్చారు. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలుచేసి దానికి ‘ఎక్స్’అని పేరు మార్చినప్పటికీ నుంచీ మస్క్ ‘ఎక్స్’లో క్రియాశీలకంగా పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు.
వైవిధ్యభరితంగా, వివాదాస్పదంగా, నవ్వు తెప్పించేలా పోస్ట్‌లు పెడుతూ సోషల్‌మీడియా వేదికపై ఎప్పుడూ ఫేవరెట్‌గా నిలుస్తున్నారు. అందర్నీ ఎగతాళి చేస్తానని చెప్పుకుంటూ గతంలో తన బయోలో చీఫ్ ట్రోల్ ఆఫీసర్(సీటీఓ) అని రాసుకొచ్చారు. బరాక్ ఒబామా కాలంలో యునైటెడ్ స్టేట్స్ డిజిటల్ సర్విస్(యూఎస్‌డీఎస్)గా మొదలైన అమెరికా ప్రభుత్వ శాఖకు ట్రంప్ తాను అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టాక డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)గా పేరు మార్చారు.
ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గిస్తూ, కొన్ని శాఖలకు నిధుల అనవసర, అధిక కేటాయింపులను తగ్గిస్తూ, ప్రాధాన్యతగల శాఖలకు కేటాయింపులు పెంచుతూ ఈ డోజ్ నిర్ణయాలు తీసుకుని అధ్యక్షుడికి సలహాలు, సూచనలు, సిఫార్సులు చేస్తుంది. డోజ్‌కు ప్రస్తుతం మస్క్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ‘‘యూఎస్‌డీఎస్ ఇప్పుడు డోజ్‌గా మారాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకే మార్చాశాం. అమెరికా ప్రభుత్వ కంప్యూటర్ వ్యవస్థలన్నింటినీ ఆధునీకరిస్తాం’’అని మస్క్ అన్నారు.
వైట్‌హౌస్‌పై మస్క్ కన్ను !
‘‘డోజ్ విభాగం తెగ పనిచేస్తోంది. వారానికి మేం 120 గంటలు పనిచేస్తున్నాం’’అని గత వారం మస్క్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అమెరికా మేగజైన్ ‘వైర్డ్’సైతం ఇలాగే స్పందించింది. ‘‘వాస్తవానికి మస్క్ అక్కడేం చేయట్లేడు. వాషింగ్టన్ డీసీలోని డోజ్ ప్రధాన కార్యాలయంలో నిద్రపోతున్నాడు’’అని ఒక కథనంలో పేర్కొంది.
అసలు పనిపై దృష్టి తగ్గించేసి అమెరికా అధ్యక్ష భవనంలో పాగా వేసేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నాడని వార్తలొచ్చాయి. వైట్‌హౌస్‌లోని వెస్ట్ వింగ్ అయిన ఓవెల్ ఆఫీస్‌లో తన పరపతి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘మస్క్, ఆయన బృందానికి వేరే చోట వేరే ఆఫీస్ సిద్ధంచేస్తాం. ఆ ఆఫీస్ ఓవెల్ ఆఫీస్‌లో భాగంగా ఉండబోదు. ఓవెల్ ఆఫీస్ కేవలం అధ్యక్షుడిగా కార్యనిర్వాహణ ఉత్తర్వులు ఇవ్వడానికే వినియోగిస్తా’’అని ట్రంప్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment