బయో డీజిల్ సరఫరా ప్రారంభం
హెచ్‌పీసీఎల్ టెర్మినల్ వద్ద ప్రారంభించిన సబ్ కలెక్టర్
గోకవరం : గోకవరంలోని హెచ్‌పీసీఎల్ టెర్మినల్‌లో బయో డీజిల్ సప్లయి స్టేషన్ ప్రారంభమైంది. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ లాంఛనంగాప్రారంభించారు. తొలుత ప్లాంట్ సీనియర్ మేనేజర్ దామోదరన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్లాంట్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డీలర్, డ్రైవర్, వర్కర్, సెక్యూరిటీ తదితర విభాగాల వారికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మరణించిన హెల్పర్ వీరబాబు కుటుంబానికి ఉద్యోగుల తరఫున రూ.40 వేల ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దామోదరన్ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా బయో డీజిల్ సప్లయి స్టేషన్‌ను హెచ్‌పీసీఎల్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం రాజమహేంద్రవరం, కాకినాడలోని సుమారు 12 బంకులకు బయో డీజిల్ సరఫరా చేస్తారని తెలిపారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడించారు. బయోడీజిల్ వల్ల వాతావరణ కాలుష్యం ఉండదన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.