Kerala Brothers Rishabh And Roshans Use Waste From Rice To Make Bio Degradable Tableware - Sakshi
Sakshi News home page

Qudrat Startup Success Story: 'బుద్ధి'.. గడ్డి తినడం కాదు!..గడ్డిప్లేట్‌లోనే తిందాం!

Published Sat, Jul 29 2023 11:40 AM | Last Updated on Sat, Jul 29 2023 1:50 PM

Bio Degradable Tableware Kerala Brothers Rishabh And Roshans Experiment - Sakshi

కేరళ సోదరులు రిషభ్, రోషన్‌ బయో డీగ్రేడబుల్‌ ప్లేట్‌

బుద్ధి గడ్డి తినడం కాదిది. బుద్ధిగా గడ్డి ప్లేట్‌లో తినడం. పర్యావరణ పరిరక్షణ పట్ల బుద్ధి వచ్చిన తర్వాత చేసే పని. దీనికి పెట్టిన అందమైన పేరే బయో డిగ్రేడబుల్‌ టేబుల్‌ వేర్‌.

కేరళకు చెందిన రిషభ్, రోషన్‌ సోదరుల ప్రయోగం ఇది. సముద్రాన్ని కూడా వదలని కాలుష్యం నుంచి తీసుకున్న నిర్ణయం. వీళ్లు ప్లేట్‌ల తయారీకి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఇప్పుడు ఉపయోస్తున్న ఫైబర్, పాలిథిన్‌ పొర ఉన్న పేపర్‌ ప్లేట్‌లలో భోజనం చేసి బయట పారేసినప్పుడు చెత్త కుండీల దగ్గర చేరిన కుక్కలు, ఆవులు, ఇతర జంతువులు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారంతోపాటు ప్లేట్లను కూడా నమిలి మింగేస్తుంటాయి.

దాంతో అవి అనారోగ్యాల బారిన పడుతుంటాయి. ఫైబర్‌ బదులు బయో డీగ్రేడబుల్‌ ప్లేట్‌ వాడినట్లయితే... మూగజీవులు మనం పారేసిన మిగులు ఆహారంతోపాటు ప్లేట్‌ని తిన్నప్పటికీ వాటి ఆరోగ్యానికి ఎటువంటి హానీ కలగదు. ఈ ప్లేట్‌లను నానబెట్టి ఎరువుగా మార్చుకుని పంటకు వాడుకోవచ్చు. ఏమీ చేయకుండా వదిలేసినా కూడా ఈ మెటీరియల్‌ మట్టిలో కలిసిపోయి ఆ మట్టి జవజీవాలను పెంచుతుంది.

గడ్డి కంచం ఇలా పుట్టింది!
అసలీ గడ్డి ప్లేట్‌ ఆలోచన ఎలా వచ్చిందంటే... రిషభ్‌కి సర్ఫింగ్‌ ఇష్టం. కేరళ, కోవళమ్, అరేబియా సముద్రంలో సర్ఫింగ్‌ చేసేవాడు. సముద్రపు అలలను తప్పించుకుంటూ బోర్డు మీద పెడలింగ్‌ చేయడం అత్యంత సాహసంతో కూడిన ఆట. ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు రిషభ్‌ తలకు, దేహానికి పాలిథిన్‌ పేపర్, ప్లాస్టిక్‌ వస్తువులు తగులుతుండేవి. ఒక్కోసారి పాలిథిన్‌ షీట్‌ వచ్చి కాళ్లకు చుట్టుకునేది. ఇలాంటిదే మరో సంఘటన ఈ సోదరులిద్దరికీ ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ఎదురైంది. అక్కడి పర్వత శిఖరాల మీదకు ట్రెకింగ్‌ చేస్తున్నప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్‌ కాలుష్యమే.

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం కంటే పాలిథిన్‌ వ్యర్థాలను తప్పించుకుంటూ అడుగులు వేయడంతోనే ట్రెకింగ్‌ పూర్తయింది. ఈ సమస్య ఒక్క కేరళనే కాదు, ప్రపంచం అంతటినీ వేధిస్తోందనిపింంది. పర్యావరణం ఎదురుగా భూతంలా నిలిన ఈ సవాల్‌కు జవాబు వెతికే ప్రయత్నంలో వీరికి వచి్చన ఆలోచన ఈ బయో డీగ్రేడబుల్‌ టేబుల్‌వేర్‌. క్వాడ్రాట్‌ పేరుతో మొదలు పెట్టిన ఈ ప్రయోగంలో ప్లేట్‌ తయారీకి తవుడు, పొట్టు, గడ్డి ఉపయోగించారు. ఇరవై నెలల నిరంతర పరశోధన, ప్రయోగాలతో ఒక రపం వచ్చింది. వేడుకల్లో ఉపయోగించే పేపర్‌ ప్లేట్, అల్యమినియం ఫాయిల్‌ అద్దుకున్న ప్లేట్, ఫైబర్‌ ప్లేట్‌ల స్థానాన్ని భర్తీ చేయగలుగుతుందా అనే పరీక్షలన్నింటినీ ఈ బయోడీగ్రేడబుల్‌ ప్లేట్‌ పాసయింది.

ఇలా చేస్తున్నారు!
పంట పొలాల నుంచి గడ్డిని, రైస్‌ మిల్లుల నుంచి తవుడు, పొట్టు సేకరించి శుభ్రం చేసిన తర్వాత హీటర్‌లో వేడి చేసి, మెత్తగా పొడి చేసి ప్లేట్, కప్పు, స్పన్‌ ఆకారంలో ఉన్న మౌల్డ్‌ ఆధారంగా రపం తెస్తారు. ఈ ప్లేట్‌లు భోజనం చేసే లోపు నానిపోతాయేమో అనే సందేహం కలుగుతుంది. పులుపు, రసం, మజ్జిగతో హాయిగా భోజనం చేయవచ్చని, నీటిలో నానబెట్టిన తర్వాత అరగంట సేపటి వరకు వాటి షేప్‌ మారదని చెప్పారు. అలాగే కప్పులు మరింత దృఢంగా 70 నిమిషాల సేపు ద్రవాలను నిలిపి ఉంచుతాయి. ఒకసారి తయారైన ఈ టేబుల్‌ వేర్‌ని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు.


బయో డీగ్రేడబుల్‌ ప్లేట్‌లో ఆహారపదార్థాలు

విదేశాలకెళ్తున్నాయి!
ఢిల్లీ, ముంబయి, బెంగళరు నగరాలతోపాటు అండవన్‌ నికోబార్‌ దీవులు, మిజోరాం, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఈ ప్రత్యామ్నాయాన్ని ఆదరిస్తున్నాయి. అంతేకాదు, యూఎస్, యూకే, కెనడా, మెక్సికోలు కూడా ఈ బయోడీ గ్రేడబుల్‌ టేబుల్‌ వేర్‌కు స్వాగతం పలికాయి. నెలకు ప్లేట్‌లు, కప్పులు, స్ట్రాలు, స్పన్‌లు అన్నీ కలిపి పాతిక వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు రిషభ్, రోహన్‌లు.

పొట్ట ఉబ్బిపోతుంది!
జంతువులు మనం తినే ఆహారం వైపు చూస్తున్నాయంటే వాటికి వాటి ఆహారం దొరకడం లేదని అర్థం. వీధికుక్కలతోపాటు ఆవులు మరికొన్ని జంతువులు ఓ దశాబ్దకాలంగా జీర్ణవ్యవస్థ సమస్యలతో మరణిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్లాస్టిక్‌ వ్యర్థాలే. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వరుసగా నెలరోజుల పాటు తిన్నాయంటే వాటి పెద్దపొట్టలో పదహారు నుంచి పద్దెనిమిది కిలోల ప్లాస్టిక్‌ పేరుకుంటుంది. ఐదారు కిలోలు చేరినప్పటి నుంచి వాటికి ఇబ్బందులు మొదలవుతాయి. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోతుంది. అక్యూట్‌ బ్లోటింగ్‌తో కొద్ది రోజుల్లోనే మరణిస్తాయి.

ఎవరి పెంపకంలో లేని జంతువులకు ఈ ప్రమాదం ఎక్కువ. పరిస్థితి ఎంత దయనీయమంటే... ఆవులు నెమరు వేసుకునే ప్రక్రియలో ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకున్నప్పుడు ఫైబర్, ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముక్కలు ముక్కలుగా బయటపడుతుంటాయి. బయటపడడం కొంతలో కొంత నయం. పాలిథిన్‌ కవర్లు లోపల చుట్టచుట్టుకుని పోతే వాటంతట అవి బయటకు రాలేవు. ఆపరేషన్‌ చేయడమే మార్గం. ఈ జంతువులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలన్నా కూడా ప్లాస్టిక్‌ పెద్ద పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. అవి విసర్జక వ్యవస్థలోకి వెళ్లాయంటే ఇక ఏమీ చేయలేం. మరణాన్ని ఆపలేం.


– డాక్టర్‌ మల్లేశ్‌ పాటిల్, అసిస్టెంట్‌ డైరెక్టర్, యానిమల్‌ హజ్బెండరీ, ఆంధ్రప్రదేశ్‌

(చదవండి: ఆ సమోసాల అమ్మే వ్యక్తి..ఓ గొప్ప జీవిత పాఠాన్ని నేర్పాడు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement