Revelation
-
పాలేరు నుంచి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి. సాగర్, ఎండీ అబ్బాస్‌తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మూడు నినాదాలతో సీపీఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ’’మొదటిగా.. సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడేందుకు సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతి నిధ్యం ఇవ్వాలని అడుగుతాం. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తాం. మూడో అంశంగా.. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు గానీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లో కూడా అడ్డుకోవాలని కోరతాం.’’అని ఆయన వివరించారు. పొత్తుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు వామపక్షాలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదని, ఆ పార్టీ తీరు సరిగా లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టు సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న ప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదన్నారు. తమ్మినేనికి భట్టి, జానారెడ్డి ఫోన్ కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలు తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందని చెప్పారు. పొత్తు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పొత్తుల విషయంపై సీపీఐ.. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గంలో కారం పుల్లయ్య, అశ్వారావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్యా వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్‌లో బజ్జ చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నర్సింహ్మ, జనగాంలో మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పగడాల యాదయ్య, పటాన్చెరులో జె.మల్లికార్జున్, ముషీరాబాద్‌లో ఎం.దశరథ్ పోటీ చేస్తారని తమ్మినేని ప్రకటించారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
బ్రాండ్ బాబులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ రంగాల్లో విజయం సాధించి, ఆర్థికంగా మరో మెట్టు పైకెదు గుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా వారి అభిరుచులు, ఇష్టాలు మారుతున్నాయి. తదనుగుణంగా ఉన్నత శ్రేణి, అధిక నాణ్యత గల వస్తువులు లేదా అధిక ధరలు కలిగిన ఉత్పత్తుల (ప్రీమియం కన్జమ్షన్) కొనుగోలు వైపు వారు మొగ్గు చూపుతున్నారని, అలాంటి వాటిపై వారి ఆసక్తి పెరుగుతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుతున్న భారతీయులు చేస్తున్న వ్యయం, ఇతర అంశాలను పరిశీలిస్తే ప్రీమియం కన్జమ్షన్ వైపు వారి ప్రాధాన్యతలు మారుతున్నట్టుగా అవగతమవుతోందని పేర్కొంటున్నాయి. 2019 నుంచి వ్యక్తిగత వినియోగం (ప్రైవేట్ కన్జమ్షన్) అనేది అంతకంతకు (కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, తదనంతర పరిణామాల కారణంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా) వృద్ధి చెందుతోందని, వివిధ కేటగిరీల్లో ఎక్కువగా వ్యయం చేయడం వ్యక్తుల ఆర్థిక పురోభివృద్ధిని సూచిస్తున్నాయని స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ‘రెడ్‌సీర్’తాజా నివేదిక వెల్లడించింది. మరికొన్ని ముఖ్యాంశాలు ఆర్థికంగా ఎదుగుతున్నవర్గాలు.. ట్రావెల్–టూరిజం, ఫైనాన్షియల్ సర్విసెస్, రిక్రియేషన్, ఇన్సూరెన్స్ తదితరాలపై చేసే వ్యయంలో పెరుగుదల చోటు చేసుకుంది. నాణ్యమైన విద్య,వ్యక్తిగత వాహనాలు, పర్సనల్ కేర్ వస్తువులు, ఆహారం, వివిధ రకాల బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. ఏప్రిల్, మే, జూన్‌లతో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపులు, చేసిన విమాన ప్రయాణాలు, వివిధ రకాల హైఎండ్ వాహనాల కొనుగోళ్లు ప్రైవేట్ కన్జమ్షన్ తీరును తెలియజేస్తున్నాయి. సంపద పెరుగుదలను సూచిస్తున్నవినియోగ ధోరణులు భారతీయుల దీర్ఘకాలిక వినియోగ ధోరణులు క్రమంగా సంపద పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయి. వినియోగదారుల ప్రవర్తన, వ్యవహారశైలి (కన్జ్యూమర్ బిహేవియర్) చూస్తుంటే అన్ని విషయాల్లోనూ ఉన్నత శ్రేణి కేటగిరీల వైపు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమౌతోంది.ఇండియా డిజిటల్‌గా ఎదగడంతో పాటు దేశంలో మౌలిక సదుపాయాలు కూడా మెరుగైనందున ఈ దశాబ్దంలో ఈ ప్రత్యేక ప్రయాణం మరింత ముందుకు సాగనుంది. – మృగాంక్ గుట్గుటియా, రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ -
‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్ ఐసీఎంఆర్ నేతృత్వంలో.. భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది. చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది. వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్ఫ్లమేషన్కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు. ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్! మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు. జీవన శైలిలో మార్పులే పరిష్కారం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు. అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. న్యూట్రియంట్స్’ఆన్లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. -
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ఊరట
మెదక్‌జోన్: ఇంటర్ ఫలితాలపై కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళం.. ఆందోళనలకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడంతో విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ఫెయిలైన వారికి ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయాలంటూ అధికారులను ఆదేశించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో విద్యార్థికి రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ చేయాలంటే నింబంధనల ప్రకారం రూ.700 ఖర్చ వుతుం డగా బోర్డు తప్పిదాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచితంగానే చేయాలని ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా అయ్యే రూ.64,14,100 ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించి 55 జూనియర్ కాళాశాలలు ఉన్నాయి. వీటిలో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 13,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో కేవలం 4,723 మంది పాస్‌కాగా 9,163 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగున నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 7,028 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,054 మంది పాస్ కాగా సగానికిపైగా (4,974 మంది విద్యార్థులు) ఫెయిలయ్యారు. ఈ లెక్కన 29శాతం మాత్రమే మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌కు సంబంధించి ఒకేషనల్‌లో 624 మంది పరీక్ష రాయగా 369 మంది పాస్‌కాగా 255 ఫెయిలయ్యారు. 59శాతం పాసయ్యరు. రెండో సంవత్సరం జనరల్‌లో 5,780 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయగా 1,972 మంది పాస్‌కాగా 3,808 మంది ఫెయిలయ్యారు. 34 శాతం విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. రెండో సంవత్సరానికి సంబంధించి ఒకేషనల్‌లో 454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 328 మంది పాస్‌కాగా 126 మంది ఫెయిలయ్యారు. 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్, సెకండియర్‌తో పాటు ఒకేషనల్‌తో కలుపుకొంటే మొత్తం జిల్లాలో 13,886 మంది పరీక్షలు రాయగా 4,723 మంది మాత్రమే పాసయ్యారు. 9,163 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫస్టియర్‌లో 29శాతం ఉత్తీర్ణులు కాగా సెకండియర్‌లో 34 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 9,163 మంది విద్యార్థులకు ప్రయోజనం.. ఫెయిలైన విద్యార్థుల్లో చాలామంది ఆందోళనకు గురయ్యారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్తో తమకు వచ్చిన మార్కులు సరైనవేనా..? లేక అధికారులు తప్పులు దిద్దారా అనే విషయం పూర్తిగా తెలిసిపోనుంది. ఒక్క విద్యార్థి రీకౌంటింగ్ చేయించుకుంటే రూ.100 రుసుం, రీవాల్యుయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన జిల్లాలోని 9,163 మంది ఫెయిలైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.700 చొప్పున మొత్తం రూ.64,14,100 ఖర్చవుతుంది. ఉచితంగా రీవాల్యుయేషన్,రీకౌంటింగ్ చేయనుండడంతో వారందరికీ ఊరట కలగనుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులు రీవెరిఫికేషన్ చేయించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం సూచించిన రుసుం చెల్లించాల్సిందే. జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య.. ఇంటర్లో ఫెయిలైన విద్యార్థుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 20 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో మెదక్ జిల్లాలోని మడూర్గ్రామానికి చెందిన చాకలి రాజు కూడా ఉన్నాడు. ఇంటిపక్కనే గల పాఠశాలలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి విధితమే. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో పాటు వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గ్లోబరీన సంస్థ యజమానిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఆర్డీవో కార్యాలయాల అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఫెయిలైన విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ పేపర్లను ఉచితంగా రీవాల్యుయేషన్, కౌంటింగ్ చేయాలని ఆదేశించింది. విద్యాసంవత్సరం నష్టపోకుండా.. విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకం. వారి భవిష్యత్తుకు ఈ పరీక్షలు ఎంతగానో ముఖ్యమైనవి. వారు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రీ వాల్యుయేషన్ త్వరగా పూర్తిచేస్తే ఫెయిలైన సబ్జెక్టులను చదివి సప్లిమెంటరీలో పాసయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఏ మాత్రం నష్టం జరగకుండా యథావిధిగా పైతరగతికి వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
ఆవిష్కరణం: ఆడవాళ్ల సౌకర్యం కోసమట!
రిస్ట్‌వాచ్‌ను కట్టుకోవడంలోనూ, దాంతో టైమ్ చూసుకోవడంలోనూ ఆడవాళ్లకూ, మగవాళ్లకూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. సంప్రదాయం ఉంది. ‘యూని సెక్స్ థియరీ’ పాపులర్ అయిన నేటి రోజుల్లో కూడా వాచ్‌ల విషయంలో ఇంత వైరుధ్యాలు ఉండటానికి కారణం మూలాల్లోనే ఉంది! అసలు ప్రపంచంలో తొలిసారి రిస్ట్ వాచ్ రూపొందించింది ఒక మహిళ కోసమేనట. అంత వరకూ ‘టైమ్ కీపింగ్ డివైజ్’లను జేబులో వేసుకొని తిరిగే సంప్రదాయం ఉండేది. అయితే 1868లో పటెక్ ఫిలిప్పీ అనే స్విస్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ హంగేరీకి చెందిన కొస్కోవిజ్ అనే మహిళ కోసం తొలిసారిగా రిస్ట్‌వాచ్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. చరిత్రలో ఇదే తొలి రిస్ట్‌వాచ్ అని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేర్కొన్నారు. అది ఆమెకు చాలా బాగా నచ్చడంతో వాచ్ మహిళల ఆభరణంలో ఒకటైంది. అంత వరకూ బ్రాస్లైన్ను చేతికి ధరించే మహిళలు దానికి ప్రత్యామ్నాయంగా వాచ్‌లను ధరించడం మొదలైంది. అలా మహిళలకే పరిమితం అయిన రిస్ట్‌వాచ్ బ్రెజిల్‌కు చెందిన అల్బర్టో శాంటోస్ అనే పరిశోధకుడి పుణ్యామా అని పురుషులకు కూడా అలవాటుగా మారింది. 20 శతాబ్దం వాడైన శాంటోస్ తన పరిశోధనల్లో భాగంగా అనుక్షణం టైమ్ చూసుకోవాల్సి వచ్చేది. దీంతో తన కోసం చేతికి కట్టుకొనేలా ఒక వాచ్‌ను రూపొందించాలని శాంటోస్ తన స్నేహితుడైన లూయిస్ కార్టియర్ అనే పరిశోధకుడిని కోరాడట. అతడు తన స్నేహితుడి కోసం ఒక ప్రత్యేకమైన డిజైన్‌తో రిస్ట్‌వాచ్‌ను రూపొందించాడు. దీంతో రిస్ట్‌వాచ్‌లు పురుషులకు, మహిళలకు అంటూ భిన్నమైనవిగా మారాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పురుషులు వాచ్‌లను మణికట్టుకు కట్టుకోవడం మొదలైంది. అలా సైనికులతో మొదలైన ఈ రిస్ట్‌వాచ్ ధారణ క్రమంగా విస్తృతమైంది.