మెదక్‌జోన్: ఇంటర్ ఫలితాలపై కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళం.. ఆందోళనలకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడంతో విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ఫెయిలైన వారికి ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయాలంటూ అధికారులను ఆదేశించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కో విద్యార్థికి రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్ చేయాలంటే నింబంధనల ప్రకారం రూ.700 ఖర్చ వుతుం డగా బోర్డు తప్పిదాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉచితంగానే చేయాలని ఆదేశించడంతో జిల్లావ్యాప్తంగా అయ్యే రూ.64,14,100 ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించి 55 జూనియర్ కాళాశాలలు ఉన్నాయి. వీటిలో ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 13,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో కేవలం 4,723 మంది పాస్‌కాగా 9,163 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు.
రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగున నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్‌లో 7,028 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,054 మంది పాస్ కాగా సగానికిపైగా (4,974 మంది విద్యార్థులు) ఫెయిలయ్యారు. ఈ లెక్కన 29శాతం మాత్రమే మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌కు సంబంధించి ఒకేషనల్‌లో 624 మంది పరీక్ష రాయగా 369 మంది పాస్‌కాగా 255 ఫెయిలయ్యారు. 59శాతం పాసయ్యరు. రెండో సంవత్సరం జనరల్‌లో 5,780 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయగా 1,972 మంది పాస్‌కాగా 3,808 మంది ఫెయిలయ్యారు. 34 శాతం విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. రెండో సంవత్సరానికి సంబంధించి ఒకేషనల్‌లో 454 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 328 మంది పాస్‌కాగా 126 మంది ఫెయిలయ్యారు. 72 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్, సెకండియర్‌తో పాటు ఒకేషనల్‌తో కలుపుకొంటే మొత్తం జిల్లాలో 13,886 మంది పరీక్షలు రాయగా 4,723 మంది మాత్రమే పాసయ్యారు. 9,163 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఫస్టియర్‌లో 29శాతం ఉత్తీర్ణులు కాగా సెకండియర్‌లో 34 శాతం మంది మాత్రమే పాసయ్యారు.
9,163 మంది విద్యార్థులకు ప్రయోజనం..
ఫెయిలైన విద్యార్థుల్లో చాలామంది ఆందోళనకు గురయ్యారు. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌తో తమకు వచ్చిన మార్కులు సరైనవేనా..? లేక అధికారులు తప్పులు దిద్దారా అనే విషయం పూర్తిగా తెలిసిపోనుంది. ఒక్క విద్యార్థి రీకౌంటింగ్ చేయించుకుంటే రూ.100 రుసుం, రీవాల్యుయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కన జిల్లాలోని 9,163 మంది ఫెయిలైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.700 చొప్పున మొత్తం రూ.64,14,100 ఖర్చవుతుంది. ఉచితంగా రీవాల్యుయేషన్,రీకౌంటింగ్ చేయనుండడంతో వారందరికీ ఊరట కలగనుంది. ఉత్తీర్ణులైన విద్యార్థులు రీవెరిఫికేషన్ చేయించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం సూచించిన రుసుం చెల్లించాల్సిందే.
జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య..
ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 20 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో మెదక్ జిల్లాలోని మడూర్‌గ్రామానికి చెందిన చాకలి రాజు కూడా ఉన్నాడు. ఇంటిపక్కనే గల పాఠశాలలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంగతి విధితమే. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడంతో పాటు వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న గ్లోబరీన సంస్థ యజమానిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఆర్డీవో కార్యాలయాల అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం ఫెయిలైన విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ పేపర్లను ఉచితంగా రీవాల్యుయేషన్, కౌంటింగ్ చేయాలని ఆదేశించింది.
విద్యాసంవత్సరం నష్టపోకుండా..
విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలకం. వారి భవిష్యత్తుకు ఈ పరీక్షలు ఎంతగానో ముఖ్యమైనవి. వారు విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రీ వాల్యుయేషన్ త్వరగా పూర్తిచేస్తే ఫెయిలైన సబ్జెక్టులను చదివి సప్లిమెంటరీలో పాసయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఏ మాత్రం నష్టం జరగకుండా యథావిధిగా పైతరగతికి వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment