
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి. సాగర్, ఎండీ అబ్బాస్‌తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మూడు నినాదాలతో సీపీఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని వెల్లడించారు.
’’మొదటిగా.. సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడేందుకు సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతి నిధ్యం ఇవ్వాలని అడుగుతాం. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తాం. మూడో అంశంగా.. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు గానీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లో కూడా అడ్డుకోవాలని కోరతాం.’’అని ఆయన వివరించారు.
పొత్తుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు
వామపక్షాలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదని, ఆ పార్టీ తీరు సరిగా లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టు సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న ప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదన్నారు.
తమ్మినేనికి భట్టి, జానారెడ్డి ఫోన్
కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలు తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందని చెప్పారు. పొత్తు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పొత్తుల విషయంపై సీపీఐ.. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది.
ఎవరెవరు ఎక్కడెక్కడంటే
సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గంలో కారం పుల్లయ్య, అశ్వారావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్యా వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్‌లో బజ్జ చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నర్సింహ్మ, జనగాంలో మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పగడాల యాదయ్య, పటాన్‌చెరులో జె.మల్లికార్జున్, ముషీరాబాద్‌లో ఎం.దశరథ్ పోటీ చేస్తారని తమ్మినేని ప్రకటించారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment