సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నదానిపై వామపక్షాల్లో సందిగ్ధం నెలకొంది. ‘మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పొత్తుతో ముందుకు వెళ్లినా.. ప్రస్తుతం ఆ పారీ్టతో పొత్తు వ్యవహారం యథాతథ స్థితిలో ఉంది’అని ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది. పొత్తుల విషయంలో బీఆర్‌ఎస్ మౌనంగా ఉండటంపై వామపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కలసి పనిచేసిన తర్వాత.. ఇప్పుడా పార్టీని కాదని మరో పార్టీతో ముందుకెళితే ప్రజల్లో చులకన భావన ఏర్పడుతుందని అంటున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందా, లేదా అన్నదానిపై తమ కార్యకర్తలకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ఆ ప్రభావం ఇక్కడా ఉంటుందన్న చర్చల నేపథ్యంలో హస్తం పార్టీ వైపు వెళ్లాలని కొందరు వామపక్ష నేతలు చర్చ లేవనెత్తుతున్నారు.
పొత్తులపై త్వరలో తేలుస్తామంటున్న నేతలు
సీపీఐ, సీపీఎం నేతలు ప్రజాసమస్యలతోపాటు పొత్తులపైనా సీఎం కేసీఆర్‌తో చర్చించాలని అనుకున్నారు. దీనిపై సీఎం అపాయింట్‌మెంట్ కూడా అడిగారు. కానీ వారాలు గడిచినా అపాయింట్‌మెంట్‌పై ఎలాంటి స్పందనా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు ‘పొత్తులుంటాయి కానీ.. లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇవ్వబోం. కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాం’అని పేర్కొనడం.. దానిపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమవి ప్రజా పార్టీలనీ, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేయడం గమనార్హం.
పొత్తులో భాగంగా చెరో 10 సీట్లు అడగాలని సీపీఐ, సీపీఎం భావించాయి. చివరికి చెరో ఐదు సీట్లతో అయినా పొత్తుకు సిద్ధం కావా లని అనుకున్నాయి. కానీ బీఆర్‌ఎస్ నుంచి స్పందన లేదు. దీనితో వామపక్షాలను బీఆర్‌ఎస్‌ను పట్టించుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాము ఖమ్మం, నల్లగొండ వంటి రెండు, మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావితం చూపుతామని.. పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌కే లాభమని వామపక్షాలు అంటున్నాయి.
త్వరలో ఏదో ఒకటి తేల్చుతాం!
పొత్తులపై త్వరలోనే ఏదో ఒకటి తేల్చుతామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల తర్వాత కేసీఆర్‌ను కలసి ఒక ఒప్పందానికి వస్తామని వామపక్షాలు అంటున్నాయి. తమకు గౌరవ ప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వకపోతే పొత్తుపై పునరాలోచిస్తామని.. అయితే ఈ విషయంలో తొందర పడబోమని పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ నేతలు కూడా వామపక్షాలంటే లెక్కలేకుండా ఉన్నారని, కనీసం తమను సంప్రదించలేదని, వారితో ఎలా ముందుకు సాగగలమని లెఫ్ట్‌నేతలు అంటున్నారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించే శక్తులతో ముందుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వామపక్షాల పొత్తు అంశం అంతుబట్టడం లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment