సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్షాలు ఎన్నికల రణరంగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అయితే పొత్తు, సీట్ల వ్యవహారంపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఒప్పందం జరగలేదని సీపీఐ చెపుతోంది.
కాగా, రాష్ట్రంలో తాము అనేక అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలమని, ఇది కాంగ్రెస్‌కు కలసి వస్తుందని సీపీఐ, సీపీఎం నేతలు చెబుతున్నారు. తమ ఓట్లతో బీఆర్‌ఎస్, బీజేపీలను మట్టికరిపించవచ్చనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని లెఫ్ట్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము గెలిచే స్థితిలో లేకపోయినా, మిత్రులను గెలిపించడంలోనూ, శత్రువులను ఓడించడంలోనూ కీలకంగా ఉంటామని చెబుతున్నారు. దీంతో వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికంగా ఓట్లు : రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 30 స్థానాల్లో అంటే నాలుగోవంతు సెగ్మెంట్‌లలో తాము పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలమని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. 30 స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలకు వెయ్యి నుంచి 5 వేల మధ్య ఓట్లు ఉంటాయని సీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అధిక స్థానాల్లో ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇక 100 నుంచి వెయ్యి వరకు ఓట్లున్న స్థానాలు 60 వరకు ఉంటాయని చెబుతున్నారు.
2018 ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో అప్పుడు సీపీఎం తరఫున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి 11 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. భద్రాచలంలో కూడా సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావుకు 14 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సీపీఐకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు ఉన్నాయి.
ఈ స్థాయి ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని, గెలుపు అవకాశాలను నిర్ణయిస్తాయని లెఫ్ట్ నేతలు అంటున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలతోపాటు, గణనీయంగా ఓట్లున్న 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే లెక్కలతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతోందని చర్చా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment