సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది.
ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు
ఎంబీ భవన్‌లో కామ్రేడ్ల మంతనాలు
ఒక చోట పోటీ, ఒక ఎమ్మెల్సీ నిబంధనకు ఆమోదయోగ్యంగా ఉన్నట్లు సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఇందులో భా గంగా సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సీనియర్ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు శనివారం ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో పాటు సీనియర్ నేతలతో మంతనాలు సాగించినట్లు తెలిసింది.
సీపీఎం తగ్గేదేలే?
ఈ సందర్భంగా సీపీఎంతో కూడా పొత్తును సాగించేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతి తెలిపిందనే అంశాన్ని సీపీఐ నేతలు ప్రస్తావించారు. అయితే ఇంతకు ముందు అనుకున్న విధంగా రెండు సీట్లలో పోటీ, ఎమ్మెల్సీ అవకాశానికే కట్టుబడి ఉన్నామని, ఒక సీటు, ఒక ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదించే ప్రసక్తే లేదని సీపీఎం నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం.
కాగా రాష్ట్రవ్యాప్తంగా 17కిపైగా స్థానాల్లో సీపీఎం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించగా.. ఆదివారం నాడు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేస్తామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment