World space celebrations
-
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
మువ్వన్నెల చంద్రహాసం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా–25 విఫలమైన చోటే భారత్ విజయపతాక ఎగురవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. అత్యంత అరుదైన ఘనత ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాలు తీవ్ర ఉత్కంఠ చంద్రయాన్–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ తన నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్ హొరిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే? చంద్రయాన్–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్ ల్యాండింగ్. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్ క్రాష్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు. బయటకు వచి్చన రోవర్ సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాబిల్లిపై గర్జించిన సింహాలు..! చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్ రైజర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. -
చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..
అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి? నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు? తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి? రాకెట్లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా! బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో! నేను రాకెట్లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!! ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది. ఇస్రో స్పేస్ క్విజ్‌లో విజేతగా నిలిచింది. అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్ క్విజ్, వృక్తృత్వం, సైన్స్ ఫేర్లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ ఆస్టరాయిడ్ డే (జూన్ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది. అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్’ అంబాసిడర్స్ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య. ‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్సైక్లోపీడియా బుక్స్ తెచ్చింది. ఫోర్త్ క్లాస్ హాలిడేస్‌లో వాటిని చదివాను. ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్ పెట్టాను. జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో! పోటీలే పాఠాలు! మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్సైట్లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్వేర్లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్లలో పాల్గొన్నాను. నా కెరీర్ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. డాన్స్‌కు ఇక దూరమే! నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్ డాన్స్ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్ పోర్ట్ ఫౌండేషన్ అంబాసిడర్ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య. అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు ఆస్టరాయిడ్ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్స్టర్ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్ఐఎఫ్ జీరో వన్ వన్...’ ఇలా ఒక టెంపరరీ నేమ్ ఇస్తాం. ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్ మీటింగ్‌లో సర్టిఫికేట్ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది. – గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు -
‘అంతరిక్షం’లో భారత కీర్తి ప్రత్యేకం
భారతీయ జన్యువుల్లో పరిశోధన సంపత్తి ఏయూ వీసీ నాగేశ్వరరావు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం ఏయూక్యాంపస్ : అపజయ మెరుగని విజయాల చరిత్ర భారత అంతరిక్ష రంగం సొంతమని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో శనివారం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. అణుశాస్త్రం, అంతరిక్ష రంగాలలో అగ్రదేశాలకు మించిన ప్రగతిని భారతదేశం సాధిస్తుందన్నారు. భారతీయుల జన్యువులలో పరిశోధన ఆసక్తి, జ్ఞానం దాగి ఉన్నాయన్నారు. యువత శాస్త్ర సంబంధ అంశాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరచాలని సూచించారు. షార్ డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల అనువర్తనాలు అపారమన్నారు. హుద్‌హుద్ సమయంలో శాటిలైట్ సహాయంతో వాతావరణ మార్పులను ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. దేశంలో వ్యవసాయ రంగం ప్రగతి, పంటల విస్తృతిని గణించడానికి ఈ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. మత్స్యకారులకు మత్స్య సంపదను అందించడానికి, ప్రమాదంలో ఉన్న సమయాలలో ఆదుకోవడానికి శాటిలైట్ల సహకారం తీసుకుంటున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్‌తో విభిన్న రంగాలకు అవసరమైన సేవలను అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ప్రపంచ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఇస్రో ప్రగతి, పటిమను విద్యార్థులకు తెలియజేస్తూ వారిని శాస్త్ర అధ్యయనం దిశగా నడిపించాలన్నారు. షార్ డీజీఎం బి.వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ శాంతికి, దేశ ప్రగతికి శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతోందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలోని 14 ప్రాంతాలలో ఈ తరహా కార్యక్రమాలను విద్యార్థుల మధ్య నిర్వహిస్తున్నామన్నారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సంమృద్ధి సాధించి సుసంపన్నం అయ్యిందన్నారు. యువతరం పరిశోధన రంగంలో అడిగిడాలని సూచించారు. షార్‌ను దర్శించాలని విద్యార్థులను ఆహ్వనించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఇస్రో ప్రయోగాలు, పనితీరును వివరించే ప్రదర్శన, సమాచార కరపత్రాలు ఆకట్టుకున్నాయి. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాకెట్ నమూనాలు విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్, ఆచార్య కె.వి.ఎస్.ఆర్ ప్రసాద్, రాజశేఖర్, షార్ అధికారులు పాల్గొన్నారు.