‘అంతరిక్షం’లో భారత కీర్తి ప్రత్యేకం
‘అంతరిక్షం’లో భారత కీర్తి ప్రత్యేకం
Published Sun, Oct 9 2016 1:43 PM | Last Updated on Sat, Jun 2 2018 3:13 PM
భారతీయ జన్యువుల్లో పరిశోధన సంపత్తి
ఏయూ వీసీ నాగేశ్వరరావు
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
ఏయూక్యాంపస్ : అపజయ మెరుగని విజయాల చరిత్ర భారత అంతరిక్ష రంగం సొంతమని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో శనివారం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో), సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. అణుశాస్త్రం, అంతరిక్ష రంగాలలో అగ్రదేశాలకు మించిన ప్రగతిని భారతదేశం సాధిస్తుందన్నారు. భారతీయుల జన్యువులలో పరిశోధన ఆసక్తి, జ్ఞానం దాగి ఉన్నాయన్నారు. యువత శాస్త్ర సంబంధ అంశాలను అధ్యయనం చేయడానికి ఆసక్తి కనబరచాలని సూచించారు.
షార్ డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల అనువర్తనాలు అపారమన్నారు. హుద్‌హుద్ సమయంలో శాటిలైట్ సహాయంతో వాతావరణ మార్పులను ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. దేశంలో వ్యవసాయ రంగం ప్రగతి, పంటల విస్తృతిని గణించడానికి ఈ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. మత్స్యకారులకు మత్స్య సంపదను అందించడానికి, ప్రమాదంలో ఉన్న సమయాలలో ఆదుకోవడానికి శాటిలైట్‌ల సహకారం తీసుకుంటున్నామన్నారు. రిమోట్ సెన్సింగ్‌తో విభిన్న రంగాలకు అవసరమైన సేవలను అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ప్రపంచ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఇస్రో ప్రగతి, పటిమను విద్యార్థులకు తెలియజేస్తూ వారిని శాస్త్ర అధ్యయనం దిశగా నడిపించాలన్నారు. షార్ డీజీఎం బి.వి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ శాంతికి, దేశ ప్రగతికి శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతోందన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలోని 14 ప్రాంతాలలో ఈ తరహా కార్యక్రమాలను విద్యార్థుల మధ్య నిర్వహిస్తున్నామన్నారు. స్పేస్ టెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సంమృద్ధి సాధించి సుసంపన్నం అయ్యిందన్నారు. యువతరం పరిశోధన రంగంలో అడిగిడాలని సూచించారు. షార్‌ను దర్శించాలని విద్యార్థులను ఆహ్వనించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు. ఇస్రో ప్రయోగాలు, పనితీరును వివరించే ప్రదర్శన, సమాచార కరపత్రాలు ఆకట్టుకున్నాయి. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాకెట్ నమూనాలు విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్, ఆచార్య కె.వి.ఎస్.ఆర్ ప్రసాద్, రాజశేఖర్, షార్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement