మువ్వన్నెల చంద్రహాసం | India Records History After Chandrayaan-3 Mission Successfully Lands On The Moon, All You Need To Know - Sakshi
Sakshi News home page

Chandrayaan 3 Successful: మువ్వన్నెల చంద్రహాసం

Published Thu, Aug 24 2023 1:51 AM | Last Updated on Thu, Aug 24 2023 9:33 AM

India Records On Chandrayaan-3 successfully lands on the Moon - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు:  భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్‌ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్‌ లూనా–25 విఫలమైన చోటే భారత్‌ విజయపతాక ఎగురవేసింది.

భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్‌–3 మిషన్‌ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌–3 మిషన్‌ విజయవంతమైంది.

ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ ‘విక్రమ్‌’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్‌ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్‌ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది.  

అత్యంత అరుదైన ఘనత    
ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్‌–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది.

140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.  

నిమిషాలు తీవ్ర ఉత్కంఠ
చంద్రయాన్‌–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్‌–3 మిషన్‌ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది.

ఈ నెల 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ తన నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్‌ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది.

కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్‌ హొరిజాంటల్‌ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్‌ లింక్‌ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్‌–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్‌–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు.  

సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటే?
చంద్రయాన్‌–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్‌ ల్యాండింగ్‌. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్‌ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్‌ క్రాష్‌ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు.  

బయటకు వచి్చన రోవర్‌
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా):  చంద్రయాన్‌–3 ల్యాండర్‌ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు  చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్‌లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్‌ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్‌ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్‌ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.   

జాబిల్లిపై గర్జించిన సింహాలు..!
చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్‌–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్‌ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్‌ రైజర్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్‌ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement