బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ల్యాండర్ కీలక ఘట్టానికి సమయం సమీపిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బుధవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ ‘విక్రమ్’ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. సాయంత్రం 5.20 గంటల నుంచే ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ల్యాండర్ క్షేమంగా చంద్రుడిపై దిగితే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచానికి కూడా అదొక చిరస్మరణీయ ఘట్టమే అవుతుంది.
జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అంతేకాదు చంద్రుడిపై భద్రంగా దిగిన నాలుగో దేశంగా రికార్డు సృష్టిస్తుంది. చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే అక్కడ చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్–2 ఆర్బిటార్‌తో కమ్యూనికేషన్ ఏర్పర్చుకుందని ఇస్రో సైంటిస్టులు సోమవారం వెల్లడించారు. రెండూ పరస్పరం సంభాíÙంచుకుంటున్నాయని తెలిపారు. ‘వెల్‌కమ్, బడ్డీ!’ అంటూ ల్యాండర్ మాడ్యూల్‌కు ఆర్బిటార్ స్వాగతం పలకిందని చెప్పారు.
ఆర్బిటార్‌తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి మరింత ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చక్కగా పనిచేస్తోందని, ఇప్పటికైతే ఎలాంటి అవరోధాలు కనిపించడంలేదని వెల్లడించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఢిల్లీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌తో సమావేశమయ్యారు. ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులను ఆయనకు వివరించారు. ఈ మొత్తం ప్రయోగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని తెలిపారు.
లేదంటే 27వ తేదీన ల్యాండింగ్?
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ల్యాండింగ్ విషయంలో ఇస్రో కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ల్యాండర్ మాడ్యూల్ ప్రస్తుతం చందమామకు అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగే తరువాయి. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు.
ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌లో ఉన్న సైంటిఫిక్ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మరోమారు క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో ప్రకటించింది. పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటేనే ల్యాండ్ చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. చంద్రయాన్–2, రష్యా లూనా–25 క్రాష్ ల్యాండింగ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్–3 విషయంలో సైంటిస్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దక్షిణ ధ్రువం చిత్రాలు విడుదల
ల్యాండర్ మాడ్యూల్‌లోని ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా(ఎల్‌హెచ్‌డీఏసీ) చిత్రీకరించిన చందమామ దక్షిణ ధ్రువం ఫొటోలను ఇస్రో విడుదల చేసింది. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా కాలు మోపడానికి ఈ కెమెరా తోడ్పడనుంది. రాళ్లు, గుంతలను ఫొటో తీసి, అవి లేని చోట ల్యాండర్ దిగడానికి అనువైన ప్రదేశాన్ని ఈ కెమెరా గుర్తిస్తుంది.
ప్రకాశ్‌రాజ్ పోస్టుపై రగడ
ముంబై: చంద్రయాన్–3 ప్రయోగాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ‘ఎక్స్’లో ఆదివారం చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. చొక్కా లుంగీ ధరించిన ఓ వ్యక్తి టీ వడబోస్తున్న కార్టూన్ చిత్రాన్ని ప్రకాశ్‌రాజ్ పోస్టు చేశారు. కన్నడ భాషలో దీనికి వ్యాఖ్యను కూడా జతచేశారు. ‘‘ఇప్పుడే అందినవార్త.
చంద్రయాన్ నుంచి మొదటి చిత్రం ఇప్పుడే వచి్చంది’’ అని పేర్కొన్నారు. అయితే, అందులో టీ వడబోస్తున్న చాయ్‌వాలా ఎవరన్నది ప్రకాశ్‌రాజ్ బయటపెట్టలేదు. ఇస్రో మాజీ చైర్మన్ కె.శివన్‌ను ఎద్దేవా చేస్తూ ఈ పోస్టు పెట్టారని ప్రకాశ్‌రాజ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని పోస్టు చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment