అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు.
రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్‌లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు.
2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment