radiation impact
-
NASA: సౌర రేడియేషన్‌తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరుదైన పరిశోధన: సైంటిస్టులకు పాముల సాయం
అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండదు. రేడియేషన్ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది కూడా. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్, జపాన్ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు.. ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు. ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్‌థైయోలజీ అండ్ హెర్పెటోలజీ’ అనే జర్నల్ కథనం ప్రచురించింది. అలాగని పాముల్ని హింసించడం లాంటివి చేయరు. సింపుల్‌గా వాటిని బయోఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో మమేకమై ఉండే వృక్ష, జీవ రాశులన్నింటినీ బయోఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు.. చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటారా?.. గాలి నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది కాబట్టి. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే.. నాచు రంగు మారుతూ నాశనమవుతుంటుంది. చదవండి: వంద గ్రాముల విషంతో.. వంద మంది ఖతం! ఇప్పటిదాకా మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు.. ఫస్ట్ టైం పాములపై ఈ ప్రయోగం చేస్తున్నారు. పాములను ప్రత్యేకించి జెర్రి పోతు(గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోబోతున్నారు. ఎందుకంటే.. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో బాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి. పైగా దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే వీటిని ఎంచుకున్నారు సైంటిస్టులు. ఇక ఈ పరిశోధనలో.. ఫుకుషిమా రేంజ్లో బతుకుతున్న సుమారు 1700 పాముల్ని నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. వాటిపై రేడియేషన్ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్ లెవల్‌ను లెక్కగడతారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్ ప్రభావం తగ్గుతుందో.. అవి అప్పుడు యాక్టివ్‌గా సంచరిస్తుంటాయి. అలా రేడియేషన్ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నట్లు ప్రొఫెసర్ హన్నా గెర్కె వెల్లడించారు. ఇక వీటి ట్రాకింగ్ కోసం జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించబోతున్నారు. -
5G Network: 5జీ పై భయాందోళనలు
ప్రపంచ ప్రజానీకాన్ని అనుసంధానించటంలో... భారీ పరిమాణంలో వుండే డేటాను సైతం రెప్పపాటున బదిలీ చేయటంలో వినూత్న పోకడలు పోతుందంటున్న అయిదో తరం వైర్లెస్ సాంకేతికత(5జీ టెక్నాలజీ) అతి త్వరలో దేశంలో అడుగుపెట్టబోతోంది. దాని పనితీరును నిపు ణులు ఇప్పటికే ప్రాథమికంగా పరీక్షించారు. నెట్వర్క్ సంస్థలు, మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు సంసిద్ధంగా వున్నాయి. మన దేశంలో ఈ ఏడాది ఆఖరుకల్లా అది విస్తరించటం మొదలవుతుంది. వచ్చే ఏడాదంతా 5జీ కోలాహలమే వినిపించబోతోంది. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ అందరిలోనూ చర్చనీయాంశమవుతోంది. పౌరుల ఆరోగ్యంపై ఆ సాంకేతికత తీవ్ర ప్రభావం చూపే అవకాశము న్నదని, పర్యావరణానికి సైతం అది హానికరం కాగలదని ఆమె వాదన. అలాగని అత్యాధునిక సాంకేతికత అమలును తాను వ్యతిరేకించటం లేదంటున్నారు. పర్యవసానాలపై అధ్యయనం చేయ కుండా ప్రవేశపెట్టడంపైనే తనకు అభ్యంతరమని వివరిస్తున్నారు. 5జీ కోసం సెల్ టవర్లలో, ఫోన్లలో వాడే సాంకేతికత, వాటినుంచి వెలువడే రేడియేషన్ మనుషులకూ, పశుపక్ష్యాదులకూ తీవ్ర హాని కలిగించగలదని నమ్మడానికి తగిన కారణాలున్నాయని ఆమె చెబుతున్నారు. కొత్త సాంకేతికతతో పాటే సంశయాలూ వ్యాపిస్తాయి. విద్యుత్ దీపాలు వచ్చినప్పుడు ప్రాణాలకు ముప్పు కలుగుతుందన్న భయంతో అనేక గ్రామాలు చాన్నాళ్లు వాటికి దూరంగా వుండి పోయాయని చరిత్ర చెబుతోంది. మన దేశంలో మాత్రమే కాదు...ప్రపంచమంతటా ఈ ధోరణి కన బడుతుంది. బ్రిటన్, అమెరికా, స్విట్జర్లాండ్ వంటిచోట్ల ఏడెనిమిదేళ్లుగా అనేకులు 5జీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మనుషులకు మాత్రమే కాక, మొత్తంగా జీవరాశులకు ముప్పు తెస్తుందని వాదిస్తున్నారు. ఇలా అంటున్నవారిలో శాస్త్రవేత్తలు సైతం వుండటం సాధారణ పౌరుల్లోని భయాం దోళనలను మరింత పెంచుతున్నాయి. జుహీ చావ్లా లేవనెత్తిన అభ్యంతరాలు రాగలకాలంలో మన దేశంలో మరింత గట్టిగా వినబడతాయి. వీటిని ఒక్క మాటతో కొట్టి పారేయడం తేలిక. విశ్వసనీయత కలిగిన శాస్త్రవేత్తలు సవివరమైన పరిశోధనలు నిర్వహించి 5జీపై వుండే సంశయాలకు జవాబి వ్వగలగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా వుండే అంతర్జాతీయ కేన్సర్ పరిశోధనా సంస్థ(ఐఏఆర్సీ) కొంతకాలంక్రితం 5జీలో వినియోగించే రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) మనుషుల్లో కేన్సర్ కారకం కాగలదని...ముఖ్యంగా కొన్ని రకాల మెదడు కేన్సర్లను ఇది మరింత ప్రేరేపించే అవకాశం వున్నదని సందేహం వ్యక్తం చేసింది. అలా అంటూనే దీనిపై మరిన్ని పరిశోధనలు జరపాల్సిన అవసరం వున్నదని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత విడుదల చేసిన నివేదికలో ‘ప్రతి ఆరోగ్యపరమైన సమస్యనూ వైర్లెస్ సాంకేతికతతో ముడిపెట్టడం సరికాద’ని భావించింది. ప్రస్తుతం ఆ సంస్థలోని శాస్త్రవేత్తలు 5జీ సాంకేతికతను జల్లెడ పడుతు న్నారు. ఆ నివేదిక వచ్చే ఏడాదికి గానీ విడుదలయ్యే అవకాశం లేదు. 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ మొబైల్ ఫోన్ల సమస్యలపై కూడా ఆరా తీసింది. చివరకు వాటివల్ల మెదడు కేన్సర్లు వస్తాయనడానికి ఆధారాల్లేవని తేల్చింది. ప్రస్తుతం టచ్ స్క్రీన్ సౌకర్యం వుండే స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే అప్పుడు వినియోగించిన ఫోన్లు సురక్షితమైనవి. పైగా పాత ఫోన్లు కేవలం మాట్లాడు కోవటానికి, ఎస్సెమ్మెస్ సందేశాలు పంపుకోవడానికి మినహా మరెందుకూ ఉపయోగపడేవి కాదు. స్మార్ట్ ఫోన్లు అలా కాదు...భూగోళాన్ని మన చేతుల్లో పెడుతున్నాయి. విషాదమేమంటే వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకూ పరిశోధించిన దాఖలా లేదు. అందుకే నాలుగేళ్లక్రితం 39 దేశా ల్లోని 190మంది శాస్త్రవేత్తలు స్మార్ట్ ఫోన్లతో వచ్చే ప్రమాదాలను ఏకరువుపెడుతూ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. అయితే అశాస్త్రీయమైన నమ్మకాల ఆధారంగా కొందరు అనవసర భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారని 2019లో మరికొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆసుపత్రుల్లో ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న సీటీ–స్కాన్, ఎక్స్‌రే యంత్రాలతోనూ సమస్యలున్నాయి. అవి భారీగా రేడియేషన్‌ను కలగజేస్తాయన్న ఉద్దేశంతోనే బాధ్యతాయుతమైన వైద్యులు ఎంతో అత్యవసరమనుకుంటే తప్ప రోగులకు సీటీ–స్కానింగ్ సూచించరు. రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించడం మొదలై శతాబ్దం కావస్తోంది. అయితే 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ. సుదూర ప్రాంతాలకు సైతం అది సరిగా అందాలంటే సెల్ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. కనుక జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుగాక తప్పదు. ఇప్పుడున్న సాంకేతికతల ఆధారంగా 5జీని కొలవడం సరికాదన్నదే నిపుణుల భావన. అందుకే దీని సంగతి త్వరగా తేల్చాలని ఈమధ్యే 44 దేశాలనుంచి 253మంది శాస్త్రవేత్తలు ఐఏఆర్సీకి లేఖ రాశారు. మనుషుల్లోని నాడీమండల వ్యవస్థ, రక్తంలో కొన్ని రకాల రసాలను స్రవించే వినాళగ్రంధి వ్యవస్థ దెబ్బతింటాయన్నది వీరి ఆందోళన. బ్రిటన్ శాస్త్రవేత్తలైతే ప్రస్తుతానికి 5జీ అమలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కనుక జుహీ చావ్లా భయాందోళనలను తేలిగ్గా తీసుకోలేం. దేశంలో వున్న సమస్యలు చాలలేదన్నట్టు ఇంకా పరిపూర్ణమైన సమాచారం లేని ఈ సాంకేతికతను పులుముకోవటం విజ్ఞత కాదేమో ఆలోచించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వచ్చే వరకూ వేచిచూడటమే అన్నివిధాలా శ్రేయస్కరం. -
నగరానికి రేడియేషన్
సాక్షి, హైదరాబాద్ : కళ్ల మంటలు, త్వరగా అలసిపోవడం, తెల్లరక్త కణాలు తగ్గడం, జట్టు రాలడం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు లాంటి సమస్యలు నగరజీవికి సాధారణమయ్యాయి. ఇంట్లో ఉండే వారి కంటే వివిధ కారణాలతో రోడ్లపైకి వస్తున్న వారిలో ఇది ఎక్కువ. ఇలాంటి సమస్యలకు రేడియేషన్ కూడా ఓ కారణమంటోంది బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్). తాజాగా బార్క్ చేపట్టిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు తేలాయి. దక్కన్ పీఠభూమిలో అనేక భౌగోళిక ప్రత్యేకతలున్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో రేడియేషన్ (వికిరణ తీవ్రత) అధికంగా నమోదవుతున్నా దీన్ని శాస్త్రీయంగా లెక్కించే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతేడాది గ్రేటర్ పరిధిలో రేడియేషన్ తీవ్రతపై బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) నిపుణులు చేపట్టిన అధ్యయనంలో ఏటా 2 మిల్లీసీవర్ట్స్ (రేడియేషన్ కొలిచే ప్రమాణం) మేర నమోదవుతున్నట్లు తేలింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ తీవ్రత ఏటా 1 మిల్లీ సీవర్ట్స్‌కు మించరాదు. కాగా ఈ రేడియేషన్ తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించేందుకు ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ మానిటర్స్ (ఈఆర్ఎం)ను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని బార్క్ పరిశోధన సంస్థ పీసీబీకి సూచించినా ఫలితం లేదు. హైదరాబాద్‌తోపాటు పలు మెట్రో నగరాల్లో ఇటీవల రేడియేషన్ తీవ్రత క్రమంగా పెరుగుతోందని బార్క్ అధ్యయనంలో తేలింది. రేడియేషన్ పెరుగుతోంది ఇలా.. దక్కన్ పీఠభూమిలో సముద్ర మట్టానికి సుమారు 536 మీటర్ల ఎత్తున ఉన్న హైదరాబాద్‌లో గ్రానైట్, బాసాల్ట్, గోండ్వానా శిలా స్వరూపాలు అత్యధికంగా ఉండటమూ వాటి నుంచి వెలువడే వికిరణాలు సైతం రేడియేషన్ పెరిగేందుకు ఒక కారణం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల వినియోగం పెరగడం, కాలం చెల్లిన వాహనాలు వాడకం, పరిశ్రమల కాలుష్యం పెరుగుతూనే ఉంది. మరోవైపు భూమి పైపొరలపై విశ్వకిరణాలు (కాస్మిక్ కిరణాలు) పడుతుండటం, సిటీ కాంక్రీట్ జంగిల్లా మారడంతో భూమి వాతావరణం నుంచి వికిరణ తీవ్రత పైకి వెళ్లే దారులు లేక, హరిత వాతావరణం తగ్గడంతో రేడియేషన్ తీవ్రత పెరుగుతోందని తేలింది. విముక్తి ఇలా... గ్రేటర్ పరిధిలో 8 శాతం మేర ఉన్న హరిత వాతావరణాన్ని 30 శాతానికి పెంచాలి. ప్రతి ఇళ్లు, కార్యాలయం, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటాలి. ఎక్కువ సేపు మోటారు వాహనాల కాలుష్యాన్ని పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండటం కూడా రేడియేషన్ తీవ్రత బారిన పడకుండా కాపాడుతుంది. ఇక పీసీబీ సైతం ఎన్విరాన్మెంటల్ రేడియేషన్ మానిటర్స్‌ను ఏర్పాటు చేసి తీవ్రతను శాస్త్రీయంగా లెక్కించడంతోపాటు నివారణ చర్యలను చేపట్టే అంశంపై బల్దియా యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలి. రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాలు... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, మసాబ్‌ట్యాంక్, నాచారం, జీడిమెట్ల, బాలానగర్, కాటేదాన్, పాశామైలారం, కుత్బుల్లాపూర్ అనర్థాలు ఇలా.. చర్మం, కళ్ల మంటలు, ఉక్కపోతతో సతమతం. త్వరగా అలసిపోవడం, తలనొప్పి, గుండెకొట్టుకునే వేగం పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. డయేరియా, వాంతులు, జుట్టు రాలడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. -
మొబైల్స్‌తో ఆ రిస్క్ లేనట్టే..
లండన్ : స్మార్ట్ ఫోన్లతో రోజంతా గడిపే యువతకు తాజా అథ్యయనం ఊరట ఇస్తోంది. సెల్ఫోన్లతో బ్రైన్ క్యాన్సర్ రాదని, మొబైల్ రేడియేషన్ బ్రెయిన్లో కణుతులకు దారితీస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అతిపెద్ద అథ్యయనం వెల్లడించింది. మొబైల్ ఫోన్లు వెలువరించే రేడియేషన్‌తో బ్రైన్ ట్యూమర్ల ముప్పు ఉందనేందుకు 9000 మందిపై నిర్వహించిన తమ అథ్యయనంలో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని స్పానిష్ పరిశోధకులు వెల్లడించారు. కాగా మొబైల్ ఫోన్లు వెలువరించే ఎలక్ర్టోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) రేడియేషన్‌తో జన్యువులు దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని 2011లో క్యాన్సర్‌పై అంతర్జాతీయ పరిశోధన సంస్థ హెచ్చరించింది. అయితే ఈ రేడియేషన్‌తో క్యాన్సర్ ముప్పుపై స్పష్టమైన ఆధారాలు తమ అథ్యయనంలో లభించలేదని స్పానిష్ పరిశోధకులు స్పష్టం చేశారు. ఈఎంఎఫ్ రేడియేషన్ త్వరితగతిన వ్యాప్తి చెందుతుందనే అంచనాతో గతంలో క్యాన్సర్ ముప్పుపై అంచనాకు వచ్చారని, అయితే తమ అథ్యయనంలో సెల్ ఫోన్ల వాడకంతో బ్రైన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్న దిశగా ఎలాంటి ఆధారాలు వెల్లడికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ దిశగా మరిన్ని పరిశోధనలు అవసరమని వారు సూచించారు. -
ఈ సీజనంతా రాష్ట్రం నిప్పుల కొలిమే
ఏప్రిల్‌లో ఇంతటి ఎండలు 1973 తర్వాత ఇదే ప్రథమం మేలో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్న వైనం మేడారంలో 45 డిగ్రీలు... హైదరాబాద్‌లో 43.11 అన్నిచోట్లా 40-44 డిగ్రీలతో ఠారెత్తిస్తున్న భానుడు ఈ సీజన్లో ఇప్పటికే 47 డిగ్రీలనూ దాటేసిన ఎండలు వచ్చే రెణ్నెల్లు 45-50 డిగ్రీలు: వాతావరణ శాఖ ఏకంగా 40 రోజుల పాటు వడగాడ్పులు! వడగాడ్పులకు ఇప్పటికే 75 మంది బలి సాక్షి, హైదరాబాద్: అటు మండే ఎండలు, ఇటు తాళలేని వడగాడ్పులు తెలంగాణను అతలాకుతలం చేస్తున్నాయి. సాధారణంగా మే నెలలో నమోదయ్యేంతటి తీవ్ర ఉష్ణోగ్రతలు ఈసారి ఏప్రిల్‌లోనే రికార్డవుతుండటంతో జనం ఠారెత్తిపోతున్నారు. ఉదయం 10 దాటాక బయటికి రావాలంటేనే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తోంది. 1973 తర్వాత ఏప్రిల్‌లో ఇంతటి ఎండలు కాయడం ఇదే ప్రథమమని భారత వాతావరణ శాఖ చెబుతోంది. 1973 ఏప్రిల్ 30న 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, ఈ ఏడాది మాత్రం మార్చిలోనే (24న) కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో ఏకంగా 47.33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది! ఏప్రిల్ తొలి వారంలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో 46.08 డిగ్రీలు, దండేపల్లిలో 45.05, వాంకిడిలో 45.08 డిగ్రీలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం వెల్లడించింది. అంతేకాదు, కనీవినీ ఎరుగని విధంగా ఈసారి మార్చిలోనే సగటున ఏకంగా 40-44 డిగ్రీలతో రాష్ట్రాన్ని ఎండలు అక్షరాలా మంటెత్తించాయి. ఇక ఏప్రిల్లోనయితే ఎండల తీవ్రత మరీ పెరుగుతోంది. గురువారం వరంగల్ జిల్లా మేడారంలో 45.06 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది! హైదరాబాద్‌లో 43.11, మిర్యాలగూడలో 44.04 డిగ్రీలు, పలుచోట్ల 43 డిగ్రీలు నమోదైంది. ఎండలకు తోడు వడగాడ్పులు కూడా తీవ్రస్థాయికి చేరాయి. దాంతో జనం వడదెబ్బ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలా ఈ సీజన్లో ఇప్పటికే ఏకంగా 75 మంది మృతి చెందారు! వామ్మో వడగాడ్పులు సాధారణంగా ఏటా వేసవిలో వడగాడ్పులు సరాసరి 10-15 రోజులు మాత్రమే ఉంటాయన్నది వాతావరణశాఖ లెక్క. ఈసారి మాత్రం ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో వడగాడ్పులు దాదాపు 40 రోజులకు మించి ఉంటాయంటున్నారు! ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదు డిగ్రీలకు మించి ఉంటే వడగాడ్పులుగా పరిగణిస్తారు. అలా చూస్తే ఈ వేసవి మొత్తం రాష్ట్రం దాదాపు వడగాడ్పుల గుప్పిట్లోనే ఉండేలా కన్పిస్తోంది. నిజామాబాద్, రామగుండం, ఖమ్మంలలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని అంటున్నారు. మిగతా చోట్ల కూడా పరిస్థితి వాతావరణ శాఖ అంచనాలకు మించి తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా పిల్లలు ఎండలబారిన పడకుండా చూసేందుకు జిల్లా స్థాయిలో యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక కాగితాలకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. వచ్చే రెండు నెలలపాటు రాష్ట్రంలో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ఉదయం 11-సాయంత్రం 4 గంటల మధ్య బయటికి అడుగు పెట్టకపోవడమే మేలని నిపుణులంటున్నారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల దెబ్బకు రాష్ట్రంలో రేడియేషన్ ప్రభావం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం 11-మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ ప్రభావం అధికంగా ఉంది. సాధారణం కంటే రాష్ట్రంలో అనేకచోట్ల పదింతలకు పైగానే రేడియేషన్ నమోదవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మ సమస్యలకు దారితీయడమేగాక కిడ్నీలపైనా దుష్ర్పభావం చూపుతుందని చెబుతున్నారు. మండే ఎండల్లోనూ స్కూళ్లా? ఓవైపు ఎండలు పెద్దవాళ్లను కూడా ఠారెత్తిస్తున్నా రాష్ట్రంలో స్కూళ్లు మాత్రం ఇంకా పని చేస్తూనే ఉన్నాయి. పిల్లలు మాత్రం మండే ఎండల్లోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. వార్షిక పరీక్షలు పూర్తయినా ప్రభుత్వాదేశం మేరకు వచ్చే విద్యా సంవత్సరాన్ని మొదలుపెట్టి పై తరగతులు నడిపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ క్లాసులు జరుగుతుండటంతో మిట్టమధ్యాహ్నం వేళ మండే ఎండల్లో పిల్లలు ఇళ్లకు రావాల్సి వస్తోంది. వడదెబ్బతో 27 మంది మృతి తెలంగాణలో గురువారం వడదెబ్బతో 27 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో పదిమంది, నల్లగొండ జిల్లాలో నలుగురు, మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్‌లో ఒకరు వడదెబ్బతో మృతిచెందారు.