disasters
-
NASA: సౌర రేడియేషన్‌తో పెనుముప్పు
అంతరిక్షం నుంచి వెలువడే ప్రమాదకర సౌర రేడియేషన్‌ను భూమి అధికంగా శోషించుకుంటోందని దాంతో వాతావరణంలో మార్పులు, విపత్తులు సంభవిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నాసా తాజా డేటాను విశ్లేషించి సౌర రేడియేషన్ గురించి వారు కీలక విషయాలు వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి 2023 డిసెంబర్ దాకా డేటాను వారు పరిగణనలోకి తీసుకున్నారు. రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం అనేది సంవత్సరమంతా ఒకేతీరుగా లేదని, కొన్నిసార్లు ఎక్కువ స్థాయి, మరికొన్నిసార్లు తక్కువ స్థాయిలో నమోదైనట్లు గుర్తించారు. 2023లో ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్లో అధికంగా సోలార్ రేడియేషన్‌ను భూమి గ్రహించిందని వెల్లడించారు. గత ఏడాది జనవరిలో స్వల్పంగా పెరిగిన రేడియేషన్ ఫిబ్రవరిలో చదరపు మీటర్‌కు 3.9 వాట్లు, మార్చిలో చదరపు మీటర్‌కు 6.2 వాట్లుగా నమోదైందని తెలియజేశారు. 2000 సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే 2023లో సౌర రేడియేషన్‌ను భూమి శోషించుకోవడం ఎన్నో రెట్లు పెరిగినట్లు తేల్చారు. ఇది ఇంకా పెరగడమే తప్ప తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భూగోళంపై శక్తి సమతుల్యతలో మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇదంతా భూవాతావరణంలో ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, మంచు కరిగిపోవడం, సముద్ర మట్టాలు పెరగుదల వంటి పరిణామాలకు దారి తీస్తున్నట్లు స్పష్టం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుపాన్లు తలొంచుతున్నాయ్..! వారం రోజుల ముందే హెచ్చరికలతో..
మాండాస్, సిత్రాంగ్, అసానీ, గులాబ్, బిపర్ జోయ్. పేరు ఏదైనా కానివ్వండి ఆ తుపాను ఎంత తీవ్రమైనదైనా కానివ్వండి మనం తట్టుకొని నిలబడుతున్నాం. 1990,–2000నాటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు తుపాన్లు, వరదలంటే భారీగా ప్రాణ నష్టాలే జరిగేవి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ముందస్తుగా తుపాన్లను గుర్తించి పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాల్ని ఇస్తోంది. గుజరాత్లో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలించడంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. తుపాన్ల సన్నద్ధతలో ఒడిశా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర చర్యలకు ఐక్యరాజ్య సమితి కూడా శభాష్ అనడం విశేషం. అది 1999 సంవత్సరం అక్టోబర్ 29. ఒడిశా ప్రజలకు అదో కాళరాత్రి. పారాదీప్ సూపర్ సైక్లోన్ రాష్ట్రంపై విరుచుకుపడింది. సముద్రం అలల ధాటికి 14 జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. జగత్సింగ్పూర్ జిల్లాకి జిల్లాయే తుడిచిపెట్టుకుపోయింది. తుపాను దెబ్బకి 10 వేల మంది జలసమాధి అయ్యారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. 30 వేల మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుని ఉంటారని ఒక అంచనా. అప్పట్లో భారత వాతావరణ కేంద్రం దగ్గర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. దీంతో తుపాను ముంచుకొస్తోందని కేవలం 48 గంటల ముందు మాత్రమే తెలిసింది. వాతావరణ శాఖ అధికారులు ఒడిశా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినప్పటికీ సన్నద్ధత లేని కారణంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 10 వేలు నుంచి 30 వేల మంది మరణిస్తే, 3.5 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు గ్రామాలే నీళ్లలో కొట్టుకుపోయాయి. 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండు లక్షల జంతువులు మరణించాయి. గంటకి 250 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనమైంది. ఒడిశాతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. ఈ పెను విధ్వంసంతో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తుపాన్లు ఎదుర్కోవడంలో నవీన పంథా సూపర్ సైక్లోన్ ముంచెత్తిన తర్వాత సంవత్సరం 2000లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ తుపాన్లు ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. సూపర్ సైక్లోన్ తుపాను బీభత్సం నుంచి అప్పటికి ఇంకా రాష్టం కోలుకోలేదు. భౌగోళికంగా ఒడిశా తుపాన్ల తాకిడిని తప్పించుకోవడం అసాధ్యం. 1891 నుంచి 100కి పైగా తుపాన్లు ఒడిశాను వణికించాయి. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు ► రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేశారు. ఇలా ఒక రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయడం అదే మొదటి సారి. జిల్లాలు, బ్లాక్ స్థాయిలో కూడా విపత్తు కమిటీలు ఏర్పాటు చేశారు. 22 వేల గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక యువకుల్ని సభ్యులుగా నియమించారు. తుపాను హెచ్చరికలు అందిన వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే వీరు చేయాల్సిన పని ► రాష్ట్రంలోని 480 కి.మీ. పొడవైన తీర ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, తుపాన్లపై ప్రజల్ని అప్రమత్తం చేయడానికి 2018లో ప్రభుత్వం ఎర్లీ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ (ఈడబ్ల్యూడీఎస్) ఏర్పాటు చేసింది. తుపాన్లు ముంచుకొస్తే లోతట్టు ప్రాంత ప్రజలకి కనీసం అయిదారు రోజుల ముందే హెచ్చరికలు అందుతాయి. ► తీర ప్రాంతాల్లో నివసించే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చింది ► ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లో బాగా విస్తరించి సుశిక్షితులైన సిబ్బందిని 20 రెట్లు పెంచింది. వారి దగ్గర 66 రకాల ఆధునిక పరికరాలు అంటే జనరేటర్లు, చెట్లను కట్ చేసే, రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు, పడవలు, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ వంటివి ఎప్పుడూ ఉండేలా చర్యలు తీసుకుంది. ► 1999 సూపర్ సైక్లోన్ సమయం నాటికి ఒడిశాలో కేవలం ఆరు జిల్లాల్లో కేవలం 23 శాశ్వత తుపాను శిబిరాలు ఉండేవి. తీర ప్రాంతాల్లో అడుగడుక్కీ బహువిధాలుగా ఉపయోగపడే శిబిరాలు నిర్మించారు. ఇప్పుడు వాటి సంఖ్య 870కి చేరుకుంది. ఒక్కో శిబిరంలో వెయ్యి మంది వరకు తలదాచుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రశంసలు 2013 సంవత్సరంలో ఫాలిని అత్యంత తీవ్రమైన తుపానుగా ఒడిశాను ముంచెత్తింది. అప్పుడు భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ తుపాను సమయంలో లక్షలా ది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఒడిశా ప్రభుత్వ సహాయక చర్యలకు ఐక్యరాజ్యసమితి ఫిదా అయింది. ఒడిశా ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని అభినందించింది. కేంద్రం మూడంచెల వ్యవస్థ బిపర్జోయ్ మహా తుపాను గుజరాత్లో విధ్వంసం సృష్టించినా ప్రాణ నష్టం జరగలేదు. దీనికి తుపాన్లపై ముందస్తు సన్నద్ధతే కారణం. తుపాను ముప్పుని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం మూడంచెల వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ పనితీరుతో ఏకంగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడగలిగారు. తుపాన్లు ఎప్పుడు ఏర్పడతాయి? ఏ దిశగా ప్రయాణిస్తాయి, ఎక్కడ తీరం దాటుతాయన్న అంశాలను వారం రోజులు ముందుగానే గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజల్లో తుపాన్లపై అవగాహన పెరుగుతుంది. ఇక రెండో అంచెగా శిబిరాల నిర్మాణం, ప్రజల్ని తరలించడం ఒక యుద్ధంలా చేస్తారు. ఇక మూడో దశలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో విద్యుత్ లైన్లు, మంచినీటి పైపుల నిర్మాణం, రైల్వే, విమానాశ్రయాల్లో రాకపోకలు సాగేలా ఏర్పాట్లు వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫలితాలు ఇలా..! ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ఆర్థిక నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణలైతే కాపాడగలుగుతున్నాం. గత కొద్ది ఏళ్లలో ఒడిశాను అల్లకల్లోలం చేసిన తుపాన్లలో ప్రాణనష్టం తగ్గుతూ వస్తోంది. -
మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ విషాద ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం. 2022, జనవరి 1: జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 2016, ఏప్రిల్ 10: కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2016, మార్చి 31: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్పై హత్య కేసు నమోదైంది. 2014, అక్టోబర్ 3: బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది. 2013, ఫిబ్రవరి 10: కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 2012, నవంబర్ 19: బిహార్ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్ ఘాట్ వద్ద చట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2011, జనవరి 14: కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 2010, మార్చి 4: ఉత్తర్‌ప్రదేశ్, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు. 2008, సెప్టెంబర్ 30: రాజస్థాన్, జోధ్‌పుర్ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. 2008, ఆగస్టు 3: హిమాచల్ ప్రదేశ్ బిలాస్‌పుర్ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 2005, జనవరి 25: మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 1997, జూన్ 13: దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్ థియేటర్లో బాలీవుడ్ సినిమా ‘బార్డర్’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 1997, ఫిబ్రవరి 23: ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 1954, ఫిబ్రవరి 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన పలు బ్రిడ్జిలు (ఫొటోలు) ఇదీ చదవండి: మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. కిందిస్థాయి ఉద్యోగుల అరెస్టు.. పత్తా లేకుండా పోయిన పైఅధికారులు -
Davos: ఆర్థిక విచ్ఛిన్నంతో విపరిణామాలు
దావోస్: ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో మరింత విపరిణామాలు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్థికవేత్తలు హెచ్చరించారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా వీరు నివేదికను విడుదల చేశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలు ఎక్కువగా ఉండడం, యూరోప్, లాటిన్ అమెరికాలో వాస్తవ వేతనాలు తగ్గిపోవడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో ప్రపంచం అతిపెద్ద ఆహార సంక్షోభాన్ని (భద్రతలేమి) ఎదుర్కొంటోందని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఈ పరిస్థితులు నెలకొన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యకలాపాల వేగం తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వేతనాలు, అతిపెద్ద ఆహార అభద్రత అన్నవి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నం కారణంగా తలెత్తే విపరిణామాలని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంబంధించి గత అంచనాలను తగ్గించేసింది. అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచర్యం, ఉత్తర ఆఫ్రికాలో మోస్తరు ఆర్థిక వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. -
విపత్తులు సరే... నివారణ ఎలా?
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా. అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట! వీటి పరిధి, తీవ్రత కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా, ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ బాధితురాలిగా ఉంటున్నందున, భారత్ ఈ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే. ఈ సూచికకు సంబంధించి భారత్ స్కోర్ 7.7గా ఉంది. దేశ జనాభాలో 32 శాతంమంది జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్న వాస్తవం మర్చిపోకూడదు. మునుపటి అయిదేళ్ల కాలంకంటే ప్రస్తుత అయిదేళ్ల కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు లేదా విపత్తుల బారిన పడ్డారు. విపత్తుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, లేదా అంచనా వేయడంలో సమకాలీన పద్ధతులు యథాతథ స్థితినే తరచుగా పరిగణిస్తున్నాయి తప్ప వ్యవస్థల్లో ప్రమాదాలు ఎలా రూపొందుతున్నాయి అనే అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, కోవిడ్–19 నేప థ్యంలో అహ్మదాబాద్ ఓల్డ్ సిటీలో, ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారు లేదా ఒకే ఇంట్లో అయిదుమందికి పైగా నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా వైరస్‌ని వ్యాపింపజేస్తున్నట్లు కనిపించింది. ఇవి చారిత్రక, సామాజికార్థిక వాస్తవికతలు. కాబట్టి, సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించకపోతే, ఇలాంటి ఆకస్మిక వ్యాధులు పదేపదే పునరావృతమవుతూ ఒకేరకమైన పర్యవసానాలకు దారి తీస్తుంటాయి. దీనికి సంబంధించి విధాన నిర్ణేతలు– సామాజిక, ఆర్థిక దౌర్బల్యాలకు వెనుక గల సమకాలీన, చారిత్రక కారణాలను పరిశోధించాలి. విపత్తు ప్రమాద తగ్గింపుపై అంతర్జాతీయ అంచనా నివేదిక, కోవిడ్–19 ప్రపంచం ముందు సంధించిన సవాలును చర్చిస్తూనే ఆరోగ్య వ్యవస్థలలో ఉనికిలో ఉన్న దుర్బలత్వాలని మహమ్మారి ఎత్తిచూపిన కోణాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. అంతకుమించి అది అసమా నత్వం, నిరుద్యోగితను బలంగా ప్రదర్శించి చూపింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్య, పోషకాహారం, ఆహార భద్రత వంటి విషయాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు, దాని క్రమాలను భారత్‌లోని ప్రపంచ చారిత్రక నగరమైన అహమ్మదాబాద్ ఓల్డ్ సిటీలో నిర్వహించిన తాజా నివేదిక (2022) వెల్లడించింది. శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ ప్రమాదాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. పట్టణీకరణ వేగ ప్రక్రియే వాతావరణ మార్పు ప్రభావాలకు ప్రజలను బలిజీవులుగా మారుస్తోందని నివేదిక తెలిపింది. తీర ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో జనాభా సాంద్రీకరణ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం 2006 నుంచి సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు సంవత్సరానికి 3.7 మిల్లీ మీటర్లుగా ఉంటోందని వెల్లడయింది. ఈ లెక్కన 2100 నాటికి 20 కోట్లమంది ప్రజలు దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. ఆసియా ప్రజలే ప్రధానంగా దీని బారిన పడనున్నారని, ప్రత్యేకించి చైనాలో (4 కోట్ల 30 లక్షల మంది), బంగ్లాదేశ్‌లో (3 కోట్ల 20 లక్షలమంది), భారతదేశంలో (2 కోట్ల 70 లక్షలమంది) దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2015 నుంచి 2030 నాటికి, ప్రతి సంవత్సరం విపత్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మేరకు పెరగవచ్చు. ఇక కరువుల విషయానికి వస్తే 2001 నుంచి 2030 నాటికి 30 శాతం పెరుగుతాయని ప్రస్తుత ధోరణులు సూచిస్తున్నాయి. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్న ఘటనల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. విపత్తుల వల్ల ఎక్కువమంది దెబ్బ తినడమే కాకుండా, దారిద్య్రం కూడా పెరుగుతుంది. 1990లలో విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు సగటున 70 మిలియన్ డాలర్లమేరకు సంభవించగా, 2020 నాటికి సంవత్సరానికి 170 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్థిక నష్టాలకు సంబంధించి బహుశా 40 శాతానికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. అయితే ఈ బీమా రక్షణ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే చాలావరకు కేంద్రీ కృతం అయింది. (చదవండి: ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!) వాతావరణ అత్యవసర పరిస్థితి, కోవిడ్–19 మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు ఒక కొత్త వాస్తవికతను ముందుకు తీసుకొచ్చాయి. ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో, నిజమైన, నిలకడైన అభివృద్ధిని సాధించటానికి నష్టభయాన్ని అవగాహన చేసుకోవడమే ప్రధానం. భవిష్యత్తు షాక్‌లకు వ్యతిరేకంగా ఉత్తమమైన రక్షణ ఏమిటంటే, ఇప్పుడు వ్యవస్థలను పరివర్తన చెందించి, వాతా వరణ మార్పు, తదితర అవరోధాలను పరిష్కరిస్తూ స్థితిస్థాపకతను నిర్మించుకోవడమే. హానికర పరిస్థితులను తగ్గించి, విపత్తులవైపు నెట్టే అసమానత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా దీంట్లో భాగమే. ఇలా చేయగలిగితేనే కార్యాచరణ సాధ్యం అవుతుంది. (చదవండి: సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం) తప్పుల నుంచి నేర్చుకోవడానికీ, అనిశ్చితి పట్ల మరింత స్పష్టంగా కమ్యూనికేట్ కావడం ఎలాగో తిరిగి అంచనా వేసుకోవడానికీ పాలనా వ్యవస్థలు లక్ష్యాల సాధనకు అవసరమైన పద్ధతులను తక్షణం అలవర్చు కోవాలి. పాలనా వ్యవస్థలు తప్పుడు విషయాలను మదిస్తూ వాటి విలువను లెక్కిస్తున్నాయి. మానవ మనస్సు – వ్యవస్థలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, ఉత్పత్తి – సేవలు ఎలా పనిచేస్తాయి, నష్టభయాన్ని అర్థం చేసుకుని వాటిని నిర్వహించడంలో ప్రస్తుత పద్ధతులు ఎలా విఫలమయ్యాయనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ద్వారా మన పాలనా, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం అవసరం. - డాక్టర్ జ్ఞాన్ పాఠక్ ప్రసిద్ధ కాలమిస్ట్ -
హద్దు మీరితే ప్రకృతి శిక్షే.. ఏడాదికి 560 విపత్తులు!
మనిషి హద్దు మీరితే ప్రకృతి శిక్షిస్తుంది.. పురాణకాలం నుంచీ వింటూనే ఉన్నా మానవ ప్రవర్తన మారడంలేదు, ప్రకృతి విధ్వంసం ఆపడం లేదు. పర్యావరణంపై మనిషి అకృత్యాలు మితిమీరిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ప్రకృతి విలయతాండవాన్ని చవిచూడాల్సివస్తుందని తాజాగా ఐరాస నివేదిక హెచ్చరిస్తోంది. ప్రస్తుత ధోరణులే కొనసాగితే 2030నుంచి ఏడాదికి 560 విపత్తులను మానవాళి చవిచూడాల్సివస్తుందని నివేదిక తెలిపింది. 2015లో అత్యధికంగా 400 విపత్తులు ఎదురైతేనే మనిషి అల్లకల్లోలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఏడాదికి 560 అంటే రోజుకు దాదాపు ఒకటిన్నర విపత్తు ఏదోరూపంలో మనిషిని ఇబ్బందిపెట్టనుందన్నమాట! వరదలు, తుపానులు, భూకంపాలు, కొత్త వ్యాధులు, రసాయన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు.. ఇలా అనేక రూపాల్లో ఇవి ఎదురవుతాయి. 1970– 2000 సంవత్సరం వరకు ప్రపంచంలో ఏదోఒక చోట ఏడాదికి 90– 100 వరకు విపత్తులు వచ్చేవని, కానీ పర్యావరణ విధ్వంసం వేగవంతం కావడంతో విపత్తుల వేగం కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. మూడురెట్ల వేడి 2030లో ప్రపంచాన్ని వేడిగాలులు చుట్టుముడతాయని, వీటి తీవ్రత 2001 కన్నా మూడురెట్లు అధికంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. అదేవిధంగా కరువులు 30 శాతం మేర పెరుగుతాయని తెలిపింది. కేవలం ప్రకృతి విధ్వంసాలు మాత్రమే కాకుండా ఆర్థిక మాంద్యాలు, వ్యాధులు, ఆహారకొరతలాంటివి కూడా శీతోష్ణస్థితి మార్పుతో సంభవిస్తాయని హెచ్చరించింది. ఇప్పటికైనా మేల్కోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిఉంటుందని ఐరాస ప్రతినిధి మమి మిజుటోరి చెప్పారు. 1990ల్లో విపత్తుల కారణంగా సంవత్సరానికి దాదాపు 7వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని, ఇప్పుడీ నష్టం 17వేల కోట్ల డాలర్లకు పెరిగిందని చెప్పారు. విపత్తుల ప్రభావం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఉంటుందని ఐరాస డిఫ్యూటీ సెక్రటరీ జనరల్ అమినా చెప్పారు. ప్రదేశాలవారీగా ఆసియాపసిఫిక్ ప్రాంతంలో విపత్తుల వల్ల ఏడాదికి జీడీపీలో 1.6 శాతం మేర నష్టపోతుందని తెలిపారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
‘మనం’ మారితేనే మనుగడ!
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి. పరిష్కారంలో భాగమైతేనే... వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది. మన సముద్ర తీరంలోని ఖిదిర్పూర్ (కోల్‌కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్‌నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి. పెద్దన్న పాత్ర పోషించాలి ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్‌ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు. ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం. విధానాలు మార్చుకోక తప్పదు! విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సూచించినట్టు సింగపూర్‌తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్‌లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్‌ఏఎఫ్‌సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి. దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం! ఈమెయిల్:dileepreddy@sakshi.com -
ప్రకృతి విపత్తులతో వణికిపోయిన దైవభూమి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విలయం గతాన్ని గుర్తుచేస్తోంది. ఇప్పటికే అనేకసార్లు నదులు ఉప్పొంగి వేలాది మంది ప్రజలను బలితీసుకున్నాయి. తాజాగా సంభవించిన ధౌలిగంగా నది ప్రమాదం మరోసారి హిమాలయ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంచుచరియలు విరిగిపడటంతో ఉప్పొంగిన ధౌలీనది పెను విపత్తునే సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యంకాగా.. ఇంకా 170 మంది ఆచూకీ లభ్యం కాలేదు. 16 మంది సహాయక సిబ్బంది రక్షించింది. గతంలో ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రకృతి విలయాలు 1991 అప్పటికి ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోలేదు. 1991 అక్టోబర్‌లో భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం ఉత్తర కాశీ కేంద్రంగా సంభవించింది. అప్పుడు 768 మంది చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 1998 పితోరాగఢ్ జిల్లాలోని మాల్పా గ్రామంపై కొండచరియలు విరిగిపడి మొత్తం గ్రామాన్నే నామరూపాలు లేకుండా చేశాయి. ఆ ఘటనలో 55 మంది కైలాస్ మానస సరోవర్ యాత్రికులు సహా 255 మంది చనిపోయారు. 1999 భూకంప లేఖినిపై 6.8 తీవ్రతతో చమోలి జిల్లాను కుదిపేసిన భూకంపం కారణంగా 100 మంది చనిపోయారు. పక్కనున్న రుద్రప్రయాగ జిల్లాపై కూడా ఈ భూకంపం ప్రభావం చూపింది. 2013 జూన్ నెలలో కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలతో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడడంతో రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ విలయంలో 5700 మంది ప్రాణాలు కోల్పోయారు. -
మరో రెండు విపత్తులు.. కోటి మరణాలు
వాషింగ్టన్ : కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలి నాళ్లలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవ్వడమే కాక పలు అనుమానాలను రేకేత్తించింది. 2015నాటి ఈ వీడియోలో బిల్ గేట్స్.. కరోనా గురించి ముందుగానే హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మానవ నిర్మిత వైరస్ ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొన్నారు. ఆయన మాటలు 2020లో వాస్తవ రూపం దాల్చాయి. గతేడాది వెలుగు చూసిన కరోనా వైరస్ ల్యాబ్‌లో అభివృద్ధి చేసిందేనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. అయితే విధ్వంసం ఇంతటితో ఆగలేదని గేట్స్ హెచ్చరించారు. మరో రెండు విపత్తులు ప్రపంచాన్ని కకావికలం చేస్తాయని తెలిపారు. వచ్చే పదేళ్లలో ఈ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటాయన్నారు. వాతావరణ మార్పులు, బయో టెర్రరిజాలే ఆ రెండు విపత్తులు అన్నారు. ‘‘వచ్చే దశాబ్ద కాలంలో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజల ప్రాణాలు హరించేది యుద్ధం కాదు.. వైరస్. అవును మిస్సైల్స్, మైక్రోబ్స్ కాదు.. చాలా ప్రమాదకరమైన వైరస్ వల్ల కోటి మంది మరణిస్తారు. ఇక మీదట వచ్చేవి అన్ని బయో వార్లే’’ అన్నారు బిల్ గేట్స్. డెరేక్ ముల్లర్ అనే వ్యక్తి నడుపుతోన్న యూట్యూబ్ చానెల్ వెరిటాసియంలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు సంవత్సరాల క్రితం నాటి ఈ వీడియో ప్రస్తుతం మరో సారి ఇంటర్నెట్లో వైరలవుతోంది. ఎబోలా వైరస్ వ్యాప్తి సమయంలో గేట్స్ సమీప భవిష్యత్తులో ఇంతకంటే ప్రమాదకరమైన వైరస్లు మన మీద దాడి చేస్తాయని.. వాటి నుంచి రక్షణ పొందటానికి మన దగ్గర ఎలాంటి ఆయుధం ఉండదని తెలిపారు. ఆయన మాటల ప్రకారం 2020లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 2.271 మిలియన్ల మందిని బలి తీసుకోగా.. 104.3 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు. అయితే తన ఊహాలు ఏవి నిజం కాకూడదని బిల్‌గేట్స్ కోరుకున్నారు. ఇవన్ని అంచనాలుగానే ఉండాలని ఆశించారు. చదవండి: రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్ గేట్స్ మాస్క్‌లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి -
యంత్రాంగమే ఎదుర్కోగలదు
న్యూఢిల్లీ: దేశంలో విపత్తులు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు వాటిని కార్యనిర్వాహక వ్యవస్థే సమర్థంగా ఎదుర్కోగలదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. సంక్షోభాల్లో ‘ప్రజలు, ధనం, వస్తుసామగ్రి’ని ప్రాధాన్యతా క్రమంలో వినియోగించుకోవడం ఎలా అనేది యంత్రాంగమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లోనూ కోర్టులు పనిచేస్తాయనీ, యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా పౌరులకు అపాయం వాటిల్లినప్పుడు జోక్యం చేసుకుంటాయని సీజేఐ స్పష్టం చేశారు. -
ఇది మానవతప్పిదమే: గాడ్గిల్
పణజీ: కేరళ ప్రకృతి విలయానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ అన్నారు. పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందానికి నేతృత్వం వహించిన ఆయన.. నదీ తీరాలపై అక్రమ నిర్మాణాలు, అక్రమ క్వారీలు, మైనింగ్ కారణంగానే విపత్తు తలెత్తిందన్నారు. ‘నాటి మా నివేదికను ప్రభుత్వం మినహా ఎవరూ తప్పుబట్టలేదు. అక్రమ మైనింగ్, క్వారీయింగ్‌లనుంచి పశ్చిమ కనుమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి విపత్తులు తప్పవు. కేరళలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అసాధారణవర్షాలు కాదు’ అన్నారు. -
కుప్పకూలిన సమాచార వ్యవస్థను పునరుద్ధరించేలా..
- 'విపత్తు నిర్వహణ'పై భారత సంతతి విద్యార్థి నూతన ఆవిష్కరణ లండన్: భూకంపం, సునామి, టోర్నడో, హిమపాతాల వంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలడం, బాధితుల కోసం చేపట్టే సహాయ కార్యక్రమాల్లో ఆటంకాలు తలెత్తడం తెలిసిందే. అయితే భారత సంతతి విద్యార్థి ఆవిష్కరించిన ఓ నూతన పరికరంతో విపత్తు తలెత్తిన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించే వీలుంటుంది. తద్వారా విపత్తు నిర్వహణ సాధ్యమైనంత వేగంగా చేపట్టేవీలుంటుంది. ఇంగ్లాండ్ లోని స్టాఫోర్డ్ షైర్ యూనివర్సిటీ విద్యార్థి లక్మాన్ పటేల్ 'ఎక్సిజెన్సీ' పేరుతో రూపొందించిన పరికరం.. అడ్ హాక్ నెట్ వర్క్ ద్వారా పనిచేస్తుంది. విపత్తు తలెత్తిన చోట ఈ పరికరాన్ని ఉంచితే.. దాని చుట్టుపక్కల 2.5 కిలోమీటర్ల పరిధిలోని ఫోన్లకు శాటిలైట్ డేటా బట్వాడా అవుతుంది. ఆయా ప్రదేశాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించేవారికి 'ఎక్సిజెన్సీ' ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నాడు లక్మాన్. అయితే ఇప్పటికీ పరికరం తయారి ప్రాథమిక దశలోనే ఉందని, త్వరలోనే పూర్తిస్థాయి పరికరాన్ని రూపొందిస్తానని అంటున్నారు. (పై ఫొటోలోని యంత్రం లక్మాన్ ప్రయోగానికి సంబంధించిన ఊహాచిత్రం) భారత సంతతి విద్యార్థి తయారుచేసిన విపత్తు నిర్వహణ యంత్రానికి వర్సిటీ శాస్త్రవేత్తల నుంచి కితాబులు దక్కాయి. -
ధాన్యం.. దైన్యం!
ఆశాజనకంగా లేని ధాన్యం దిగుబడి ప్రకృతి వైపరీత్యాలతో ఏటా క్షీణిస్తున్న వైనం విజయనగరం ఫోర్ట్ : జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపైనేఆధారపడి జీవిస్తున్నారు. ప్రధాన ఆహార పంట.. వరి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం వెరసి జిల్లాలో రైతులకు ఈ పంట కలసి రావడం లేదు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఒకట్రెండు సంవత్సరాలు మినహా.. మిగిలిన కాలమంతా వరి పంటకు అతివృష్టి లేదా అనావృష్టి వల్ల నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా ధాన్యం దిగుబడి తగ్గిపోతోంది. పంటచేతికి వచ్చే సమయంలోనే నష్టం ఏదో విధంగా నాట్లు వేశాం.. మంచిదిగుబడి వస్తుందని రైతులు ఏటా ఆశిస్తూ వస్తున్నారు. పంట పొట్టదశలో ఉన్నప్పుడు వర్షాలు కురవకపోవడం వల్ల ఒక ఏడాది.. పంట నీట మునగడం వల్ల మరో ఏడాది ఇలా వరి పంటకు నష్టం వాటిల్లుతోంది. హెక్టారుకు 3 వేల కేజీలకు మించి దిగుబడి రాని పరిస్థితి వరి పంట అనుకూలంగా పండితే హెక్టారుకు 4 వేల కేజీలు వరకు దిగుబడి వస్తుంది. అయితే వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా హెక్టారుకు 3 వేలకు మించి దిగుబడి రావడం లేదు. 2014లో కాస్త దిగుబడి పెరగడం ఊరట కలిగించే విషయం. తగ్గిన ఆదాయం: వరి పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. 4 వేల కేజీలు దిగుబడి వచ్చినట్లయితే హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు రైతులు ఆదాయం చూడగలరు. అయితే దిగుబడి తగ్గడం వల్ల హెక్టారుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకే ఆదాయ పరిమితమవుతోంది. ఆదుకునే హస్తం కరువు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని సకాలంలో ఇచ్చి రైతులను ఆదుకోవాలి. జాప్యం చేస్తే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎకరానికి రూ.10 వేల వరకు పరిహారాన్ని అందజేయాలి. విత్తనాలను, ఎరువులను ఉచితంగా సరఫరా చేయాలి. తుఫాన్ కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పంటనష్టం అంచనా వేసినప్పుడు నిబంధనలను పెట్టకుండా నష్టం జరిగిన రైతులందరినీ ఆదుకోవాలి. అయితే, జిల్లాలో ఈ పరిస్థితి అమలు కావడం లేదు. పంట నష్టపరిహారం పంపిణీలోనూ రాజకీయ ప్రమేయం ఎక్కువవుతోంది. నష్టం సంభవించి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందడం లేదు. 2010 నుంచి 2014 వరకు తుపాన్ల కారణంగా వరిపంటకు సంభవించిన నష్టం వివరాలు సంవత్సరం తుఫాన్ నష్టం(రూపాయలలో) 2010 లైలా రూ.కోటి 2010 జెల్ రూ.13.50 కోట్లు 2010 డిసెంబర్లో తుఫాన్ రూ.21 కోట్లు 2012 నీలం రూ.4.33 కోట్లు 2013 అక్టోబర్ వాయుగుండం రూ. 16.17 కోట్లు 2013 హెలెన్ రూ.80 లక్షలు 2014 హుద్‌హుద్ రూ.6.83 కోట్లు 2007 నుంచి జిల్లాలో సాగైన వరి పంట వివరాలు, ధాన్యం దిగుబడి వివరాలు సంవత్సం సాగు హెక్టార్లలో దాన్యం టన్నులలో 2007 1,24,000 3.71 లక్షలు 2008 1,24000 3.71లక్షలు 2009 1,05,000 2.31 లక్షలు 2010 1,26,000 3.24లక్షలు 2011 1,23,000 2.64లక్షలు 2012 1,19,000 3.06లక్షలు 2013 1,09,271 3.00లక్షలు 2014 1,18,950 4.86 లక్షలు -
ప్రళయంలో చిరు సాయం
హైదరాబాద్: అప్పుడు లాతూరు..ఆ తర్వాత జపాన్..తాజాగా నేపాల్ ఇలా అందరికీ సవాల్ విసిరింది భూ ప్రళయం. ఈ విపత్తుల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడమే ఆధునిక ప్రపంచానికి ఛాలెంజ్. ఆర్తనాదాలు చేస్తున్న సాటి మానవులను సజీవులుగా నిలుపుకునేందుకు విలయానికే ఎదురొడ్డాలి. సరిగ్గా ఆ ఆలోచన తోనే అలాంటి వేళ స్పందించి ఆదుకునేందుకే ఆ ఔత్సాహిక ఇంజనీర్లు నడుం కట్టారు. అద్భుత యంత్రాన్ని రూపొందించి భూ ప్రళయమా నీ చిరునామా ఎక్కడా అంటూ బాధితులను రక్షించేందుకు వీలైన ‘ల్యాండ్ ఎస్కలేటర్’ను రూపొందించారు. ఈ ఆవిష్కరణ చేసి ఔరా అనిపిస్తోంది కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల (ఐఏఆర్ఇ) మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు . మనిషి సాయం లేకుండా మోషన్ టెక్నాలజీతో పని చేసే ఈ ల్యాండ్ ఎస్కలేటర్‌కు సెన్సా ర్లు అమర్చారు. భూకంపాలు సంభవించి నప్పుడు మనం కాలుపెట్టలేని ప్రాంతాలకూ ఇది అవలీలగా వెళ్లి సహాయక చర్యలను సైతం చేపడుతుంది. దీన్ని శనివారం కళాశాల ఆవరణలో ప్రదర్శించగా జెఎన్‌టియుూహెచ్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై పరిశీలించారు. ‘ల్యాండ్ ఎస్కలేటర్’కు పేటెంట్ హక్కుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రొఫెసర్ హరినాధ్ నేతృత్వంలో 15 మంది మెకానిల్ విద్యార్థులు దీన్ని రూపొందించారు. రూ. 3 లక్షలు వ్యయం కాగా కళాశాల యాజమాన్యం సమకూర్చిం ది. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటీ ఉపద్రవాలు?
* కడలి కల్లోలంతో విశాఖవాసుల ఆందోళన * అలల భీభత్సానికి దెబ్బతిన్న సాగరతీరం * కోతకు గురైన బీచ్‌రోడ్డు... సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఉపద్రవాలు వెంటాడుతున్నాయి. ఎనభై రోజుల క్రితం హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సానికి కకావికలమైన విశాఖ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇంతలో కడలి మరో రూపంలో దండెత్తింది. ఈసారి బీచ్‌రోడ్డును లక్ష్యంగా చేసుకుంది. వారం రోజుల కిందట బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పట్నుంచి సముద్రం దూకుడు పెంచుకుంది. తొలుత ఎర్రని బురదతో నురగలు కక్కుతూ ముందుకు వచ్చింది. రానురాను అది బీచ్‌రోడ్డును కబళించడం మొదలెట్టింది. ఇలా నాలుగు రోజుల నుంచి రాకాసి కెరటాలు సుందర బీచ్‌ను తనలోకి లాగేసుకుంటున్నాయి. రోజు రోజుకూ సాగరతీరం రోడ్డుతో సహా కోసేస్తునే ఉన్నాయి. వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చే.. అందరూ ఇష్టపడే ఆర్కే బీచ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వరకూ భారీగా తీరంతో పాటు రోడ్డూ కోతకు గురైంది. నిత్యం వేలాది మంది సందర్శకులు, పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్ ఇప్పుడు రేయింబవళ్లు బారికేడ్లతో, పోలీసు పహరాతో ఉంది. సందర్శకులు అక్కడకు రాకుండా ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు వంద మంది పోలీసులు బీచ్‌కు కాపలా కాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వన్‌వేలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. అలల బీభత్సానికి దెబ్బతిన్న అందాల సాగరతీరాన్ని చూసిన వారు ఇప్పుడు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆగని పగ.. అల్పపీడనం బలహీనపడినా కెరటాల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో సునామీ, తుపాన్లు వచ్చినప్పుడు సముద్రం ముందుకొచ్చినా ఇంతలా బీచ్‌ను నాశనం చేయలేదు. తక్షణ చర్యల్లో భాగంగా అధికారులు నగర శివారులోని ఎండాడ కొండల నుంచి పెద్దపెద్ద నల్ల రాళ్లను తెచ్చి దెబ్బతిన్న తీరంలో వేస్తున్నారు. సుందర బీచ్ తిరిగి యథాస్థితికి రావడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఔటర్ హార్బర్ కారణమా? విశాఖ సాగరతీరం కోతకు గురవడానికి పోర్టు ఔటర్ హార్బర్ కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కోస్టల్ బ్యాటరీ సమీపం నుంచి సముద్రంలోకి పెద్దపెద్ద సిమెంట్ రాళ్లతో ఔటర్ హార్బర్ రోడ్డులా వేశారు. దానివల్ల సముద్ర కెరటాలు అటు వెళ్లకుండా నగరం వైపునకు మళ్లడంతో ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనాలు, తుపాన్లు వచ్చినప్పుడు మరింత ఒత్తిడితో తీరాన్ని తాకడం వల్ల బీచ్ కోతకు గురవుతోందని విశ్లేషిస్తున్నారు. ధ్వంసమైన బీచ్‌ను శుక్రవారం పరిశీలించిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా విపత్తుకు ప్రథమ ముద్దాయి పోర్టేనని ఆరోపించారు. ఔటర్ హార్బర్‌ను తొలగించాలని, లేనిపక్షంలో శాశ్వత చర్యలకయ్యే ఖర్చును పోర్టు ట్రస్టు, కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ వేయాలి.. మరోవైపు పోర్టులో నిర్మాణాలు కూడా బీచ్ కోతకు కారణమవుతున్నాయని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు. విశాఖ ఔటర్ హార్బర్ ప్రభావంపైన కూడా పరిశోధన చేయాలన్నారు. విశాఖ పోర్టు, పక్కనే ఉన్న గంగవరం పోర్టులు సీఆర్‌జెడ్ నిబంధనలను అతిక్రమించడంపై స్టడీ చేయాలని, తీరం ఎక్కడెక్కడ కోతకు గురవుతుందో తెలుసుకోవడానికి మత్స్యకారులతో, పూణేలోని సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బీచ్ కోత నివారణకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టాలన్నారు.