దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జఠిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో గ్రీన్ పార్టీ రాజకీయాలు మొదలయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దిశ మార్చు కుంటున్న సంధి కాలమిది! పునరుత్పాదక ఇంధనాలు, నికర శూన్య ఉద్గారాలు, పచ్చ పెట్టుబడులు, వాతావరణ బడ్జెట్లు, హరిత ఆర్థిక వ్యవస్థలు .... వంటి ఆధునిక పదజాలం తెరపైకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న సంక్లిష్ట సమయం. ప్రకృతిలో మానవ ప్రమేయపు అలజడి, భూగ్రహంపై మనిషి మనుగడ పెంచిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! అది సృష్టిస్తున్న అనేక రూపాల కాలుష్యం ‘వాతావరణ మార్పు’గా ఉపద్రవమై ముంచుకు వచ్చింది. భూతాపోన్నతి పెరుగుతూ ఎండలు, వానలు, వరదలు, కార్చిచ్చులు... అన్నీ పరిమితులు దాటి విలయం సృష్టిస్తు న్నాయి. సరికొత్త వైరస్‌లు మానవాళి ఉనికినే ఊగిసలాటలోకి నెడుతు న్నాయి. ఇందుకు కోవిడ్–19 తార్కాణం! ధ్రువాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
లోతట్టు దీవులతో పాటు తీర నగరాలూ ప్రమాదంలో పడ్డాయి. అంచనాకు మించిన వేగంతో విధ్వంసం కమ్ముకొస్తోంది. ‘వెనక్కి తిరిగి సరిదిద్దుకునే వీలులేని అన ర్థాలు జరిగిపోతున్నాయ’ని ఐక్యరాజ్యసమితి (యూన్) తాజా నివేదిక హెచ్చరించింది. దక్షిణాసియా దేశాలకు ముప్పు ఎక్కువుంది. పర్యా వరణం ఇప్పుడు శాస్త్రవేత్తలు, కార్యకర్తలు.. అనే దశ దాటి అందరి నోళ్లలోనూ నిత్యం నానుతోంది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగి, కొడు తున్న దెబ్బలు ‘తమ దాకా వస్తే గాని...’ జనాల్లో కదలిక రాలేదు! పాలనాపీఠాలు అధిష్టించిన రాజకీయ వ్యవస్థలే ప్రాధాన్యాంశంగా ఇంకా ఎజెండాపైకి తేవటం లేదు. ఇప్పుడిక అనివార్యం! అభివృద్ది చెందుతున్న ఓ పెద్ద దేశంగా భారత్ నేడు కీలక స్థానంలో ఉంది. ఆరేళ్ల కిందటి పారిస్ ఒప్పందాల నుంచి సాగుతున్న ప్రయాణంలో... ఇచ్చిన హామీల అమలు, ఫలాలు, వైఫల్యాలు, మున్ముందరి సవాళ్లు– అవకాశాలను ప్రపంచమంతా సమీక్షించుకునే ‘భాగస్వాముల సదస్సు’ (కాప్26) వైపు అడుగులు పడుతున్నాయి. గ్లాస్‌గో (నవంబరు1–12)లో జరిగే ఈ సదస్సునాటికి చాలా విషయాల్లో మనం విధాన నిర్ణయాలతో సన్నద్ధం కావాలి.
పరిష్కారంలో భాగమైతేనే...
వాతావరణ సంక్షోభంలో మన పరిస్థితి సంక్లిష్టమే! భారత భూభా గంలో 65 శాతం కరువు ప్రభావిత ప్రాంతం, 12 శాతం భూమి వరదలు, 8 శాతం భూభాగం తుఫాన్ల ప్రభావితం. దీనికి తోడు భూతాపోన్నతికి కరుగుతున్న మంచు పర్వతశ్రేణి, హిమాలయాలు ఉత్తర సరిహద్దులుగా ఉన్న దేశం. మేఘ విచ్ఛిత్తితో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడే విధ్వంసాలు ఇప్పటికే పెచ్చుమీరాయి. ‘వాతావరణ మార్పుల’పై యూఎన్ ఏర్పాటు చేసిన అంతర్ ప్రభుత్వ వేదిక (ఐపీసీసీ) ఆరో నివేదిక ప్రకారం మిగతా సముద్రాల కన్నా హిందూమహాసముద్రం వేగంగా వేడెక్కడం మనకు అరిష్టం. వేడి గాలులే కాకుండా రుతుపవనాలను, వ్యవసాయ పరిస్థితుల్నీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. సుదీర్ఘ తీరం ఉండటంతో సముద్రమట్టాల పెరుగుదల ప్రమాదమౌతోంది.
మన సముద్ర తీరంలోని ఖిదిర్‌పూర్ (కోల్‌కత), పారాదీప్ (ఒడిశా), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ట్యూటీకొరిన్, చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), మంగళూరు (కర్ణాటక), మార్ముగోవా (గోవా), ముంబాయి (మహారాష్ట్ర), కండ్ల, ఓఖా, భావ్‌నగర్ (గుజరాత్) ఈ 12 నగరాలు/ పట్టణాలు జలమయమయ్యే ప్రమాద సంకేతాలున్నాయి. తాజా ఐపీసీసీ నివేదిక ఆధారంగా, ఈ శతాబ్ది అంతానికి ఇవి సుమారు మూడు అడుగుల మేర నీట మునిగే ప్రమాదముందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ విశ్లేషించింది. ‘వాతా వరణ మార్పు’ విశ్వవ్యాపితమైనా సమస్యలు, సంక్షోభాలు స్థానిక మైనవే! పరిష్కరాలను స్థానికంగా యోచించాలి. సమస్య తీవ్రత అధి కంగా ఉన్న దేశాల్లో ఉన్న మనం, బాధిత దేశమే అయినా.. సమస్యలో కన్నా పరిష్కారంలో భాగం కావాలి.
పెద్దన్న పాత్ర పోషించాలి
ప్రపంచంలో మనం రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదిగాం. చైనా తర్వాత మనదే స్థానం! వాతావరణ కాలుష్యానికి, తద్వారా భూతాపో న్నతికి కారణమవుతున్న కర్భన ఉద్గారాల విడుదలలో మనది మూడో స్థానం. విద్యుత్ వినియోగంలో చైనా, అమెరికా, ఐరోపా సంఘం (ఈయూ) తర్వాత భారత్‌ది నాలుగో స్థానం! శిలాజ ఇంధనాల వినియోగమే 80 శాతం కర్బన ఉద్గారాలకు కారణం. ఆయా దేశాల ఇంధన విధానాలు, నూతన వైఖరులే వాతావరణ సంక్లిష్టతను నిర్దేశి స్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానం తరం, మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత జరిగిన వాతావరణ నష్టమే అపారం. అభివృద్ధి చెందిన దేశాలు, ఆ క్రమంలో విడుదల చేసిన–చేస్తున్న ఉద్గారాలు, వెదజల్లిన కాలుష్యాలు, ప్రకృతివనరుల దోపిడీకి లెక్కేలేదు.
ఇది నొక్కి చెబుతూ పారిస్ ఒప్పంద సమయంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించింది. మారిన మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ రాజకీయార్థిక పరిణామాల నేపథ్యంలో, రానున్న కాలం లోనూ భారత్ పోషించాల్సింది కీలక భూమికే! మన వాణికి ఎక్కువ ఆదరణ! కర్బన ఉద్గారాల స్థాయిని బట్టి, అభివృద్ధి సమాజాల పాపమే అధికమైనప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలను ఆర్థికంగా, సాంకేతికంగా ఆదుకునేందుకు ఆయా దేశాలు ఉదారంగా ముందుకు రావడం లేదు. మన పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మనం బాధితు లమైనా పరిష్కర్తలుగా ముందున్నాం. వాతావరణ సంక్షోభంలో... ‘కారణ’మైనదానికి నాలుగు రెట్లు ‘భారం’ మనం మోస్తున్నాం.
విధానాలు మార్చుకోక తప్పదు!
విద్యుదుత్పత్తి ఇంధన వనరుల వినియోగం తర్వాత కర్బన ఉద్గారా లకు, కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో పౌర రవాణా, నిర్మాణ, ఉత్పత్తి, వస్తు రవాణా, సేవా తదితర రంగాలున్నాయి. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు ‘వాతావరణ మార్పు’ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉద్గారాలు, ఇతర కాలుష్యాల్ని నివారించేలా ప్రాధాన్య తలు మార్చాలి. ముఖ్యంగా శిలాజ ఇంధన వినియోగం తగ్గించాలి. పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంతో కార్బన్‌డయాక్సైడ్ (సీవో2) విడుదలే కాక 80 శాతానికి మించి దిగుమతులే కనుక ఇదొక ఆర్థిక భారమే! ధరలు రమారమి తగ్గిన పరిస్థితుల్లో సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు మళ్లాలి. బొగ్గు వినియోగాన్నీ తగ్గించాలి. 2050 నాటికి కర్భన ఉద్గారాల నికర శూన్య స్థితి సాధిం చేందుకు మనం సంకల్పం తీసుకోవాలి. అవసరమైతే గ్లాస్‌గోలో ప్రకటించాలి. ఇప్పటికే 100 దేశాలు ప్రకటించాయి. ఇతర మెజారిటీ దేశాలు ఈ దిశలో నడిచేలా ఒత్తిడి పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం ఏటా 83 కోట్ల టన్నుల సీవో2 విడుదలకు కారణమవుతోంది. ఇది మారాలి! అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్‌ఎఫ్) సూచించినట్టు సింగపూర్‌తో సహా ఇప్పటికే 40 దేశాలు కార్బన్ పన్ను విధిస్తున్నాయి. పన్ను ఏకరీతిలో ఉండాల్సిన పనిలేదు. ప్రపంచ సగటు కింద టన్ను సీఓ2 ఉత్పత్తికి 5 నుంచి 10 డాలర్లు పన్ను ఖరారు చేసి, భారత్‌లో (25), చైనాలో (50), అమెరికాలో (70 డాలర్లు) ఇలా, విభిన్నంగానూ ప్రతిపాదించవచ్చు. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పును తట్టుకునే సామ ర్థ్యాల కోసం వెచ్చిస్తున్న (ఎన్‌ఏఎఫ్‌సీసీ) నిధులు పెంచాలి. తమ వాటా చెల్లించి, రాష్ట్రాలు గరిష్టంగా వినియోగించుకునేలా చూడాలి.
దేశంలోని నగరాలు, పట్టణాలు, నదులు, అడవులు, కొండలు... అన్నీ అసాధారణ ఒత్తిడికి గురవుతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని బహుళ కారణాలు జటిలం చేస్తున్నాయి. అన్ని విధాన నిర్ణయాలలో అంతర్లీనంగా ఈ అంశం ఉండేలా చూడాలి. ఎన్నడూ ఈ సమస్యను పట్టించుకోని మన రాజకీయ వ్యవస్థలో కదలిక రావాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఎదిగి భవిష్యత్తరాలనే కాకుండా ప్రస్తుత ప్రజానీకాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. నార్వేతో సహా పలు ఐరోపా దేశాల్లో హరిత పక్ష (గ్రీన్ పార్టీ) రాజకీయాలు మొద లయ్యాయి. నేడు కాకుంటే రేపు... మన దగ్గరా అవి అనివార్యం!
ఈమెయిల్:dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment