ధాన్యం.. దైన్యం!
ఆశాజనకంగా లేని ధాన్యం దిగుబడి
ప్రకృతి వైపరీత్యాలతో ఏటా క్షీణిస్తున్న వైనం
విజయనగరం ఫోర్ట్ : జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపైనేఆధారపడి జీవిస్తున్నారు. ప్రధాన ఆహార పంట.. వరి. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కరువవ్వడం వెరసి జిల్లాలో రైతులకు ఈ పంట కలసి రావడం లేదు. గత ఎనిమిదేళ్ల కాలంలో ఒకట్రెండు సంవత్సరాలు మినహా.. మిగిలిన కాలమంతా వరి పంటకు అతివృష్టి లేదా అనావృష్టి వల్ల నష్టం వాటిల్లుతోంది. ఫలితంగా ధాన్యం దిగుబడి తగ్గిపోతోంది.
పంటచేతికి వచ్చే సమయంలోనే నష్టం
ఏదో విధంగా నాట్లు వేశాం.. మంచిదిగుబడి వస్తుందని రైతులు ఏటా ఆశిస్తూ వస్తున్నారు. పంట పొట్టదశలో ఉన్నప్పుడు వర్షాలు కురవకపోవడం వల్ల ఒక ఏడాది.. పంట నీట మునగడం వల్ల మరో ఏడాది ఇలా వరి పంటకు నష్టం వాటిల్లుతోంది.
హెక్టారుకు 3 వేల కేజీలకు మించి దిగుబడి రాని పరిస్థితి
వరి పంట అనుకూలంగా పండితే హెక్టారుకు 4 వేల కేజీలు వరకు దిగుబడి వస్తుంది. అయితే వరుస ప్రకృతి వైపరీత్యాల కారణంగా హెక్టారుకు 3 వేలకు మించి దిగుబడి రావడం లేదు. 2014లో కాస్త దిగుబడి పెరగడం ఊరట కలిగించే విషయం.
తగ్గిన ఆదాయం: వరి పంట దిగుబడి తగ్గిపోవడంతో రైతులకు ఆదాయం తగ్గిపోయింది. 4 వేల కేజీలు దిగుబడి వచ్చినట్లయితే హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు రైతులు ఆదాయం చూడగలరు. అయితే దిగుబడి తగ్గడం వల్ల హెక్టారుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకే ఆదాయ పరిమితమవుతోంది.
ఆదుకునే హస్తం కరువు
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని సకాలంలో ఇచ్చి రైతులను ఆదుకోవాలి. జాప్యం చేస్తే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎకరానికి రూ.10 వేల వరకు పరిహారాన్ని అందజేయాలి. విత్తనాలను, ఎరువులను ఉచితంగా సరఫరా చేయాలి. తుఫాన్ కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పంటనష్టం అంచనా వేసినప్పుడు నిబంధనలను పెట్టకుండా నష్టం జరిగిన రైతులందరినీ ఆదుకోవాలి. అయితే, జిల్లాలో ఈ పరిస్థితి అమలు కావడం లేదు. పంట నష్టపరిహారం పంపిణీలోనూ రాజకీయ ప్రమేయం ఎక్కువవుతోంది. నష్టం సంభవించి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందడం లేదు.
2010 నుంచి 2014 వరకు తుపాన్ల కారణంగా వరిపంటకు సంభవించిన నష్టం వివరాలు
సంవత్సరం తుఫాన్ నష్టం(రూపాయలలో)
2010 లైలా రూ.కోటి
2010 జెల్ రూ.13.50 కోట్లు
2010 డిసెంబర్‌లో తుఫాన్ రూ.21 కోట్లు
2012 నీలం రూ.4.33 కోట్లు
2013 అక్టోబర్ వాయుగుండం రూ. 16.17 కోట్లు
2013 హెలెన్ రూ.80 లక్షలు
2014 హుద్‌హుద్ రూ.6.83 కోట్లు
2007 నుంచి జిల్లాలో సాగైన వరి పంట వివరాలు, ధాన్యం దిగుబడి వివరాలు
సంవత్సం సాగు హెక్టార్లలో దాన్యం టన్నులలో
2007 1,24,000 3.71 లక్షలు
2008 1,24000 3.71లక్షలు
2009 1,05,000 2.31 లక్షలు
2010 1,26,000 3.24లక్షలు
2011 1,23,000 2.64లక్షలు
2012 1,19,000 3.06లక్షలు
2013 1,09,271 3.00లక్షలు
2014 1,18,950 4.86 లక్షలు