కోతకు గురైన విశాఖ బీచ్ రోడ్డు
* కడలి కల్లోలంతో విశాఖవాసుల ఆందోళన
* అలల భీభత్సానికి దెబ్బతిన్న సాగరతీరం
* కోతకు గురైన బీచ్‌రోడ్డు...
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఉపద్రవాలు వెంటాడుతున్నాయి. ఎనభై రోజుల క్రితం హుద్‌హుద్ తుపాను సృష్టించిన బీభత్సానికి కకావికలమైన విశాఖ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇంతలో కడలి మరో రూపంలో దండెత్తింది. ఈసారి బీచ్‌రోడ్డును లక్ష్యంగా చేసుకుంది. వారం రోజుల కిందట బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పట్నుంచి సముద్రం దూకుడు పెంచుకుంది. తొలుత ఎర్రని బురదతో నురగలు కక్కుతూ ముందుకు వచ్చింది. రానురాను అది బీచ్‌రోడ్డును కబళించడం మొదలెట్టింది.
ఇలా నాలుగు రోజుల నుంచి రాకాసి కెరటాలు సుందర బీచ్‌ను తనలోకి లాగేసుకుంటున్నాయి. రోజు రోజుకూ సాగరతీరం రోడ్డుతో సహా కోసేస్తునే ఉన్నాయి. వైజాగ్ అంటే అందరికీ గుర్తొచ్చే.. అందరూ ఇష్టపడే ఆర్కే బీచ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వరకూ భారీగా తీరంతో పాటు రోడ్డూ కోతకు గురైంది.
నిత్యం వేలాది మంది సందర్శకులు, పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్ ఇప్పుడు రేయింబవళ్లు బారికేడ్లతో, పోలీసు పహరాతో ఉంది. సందర్శకులు అక్కడకు రాకుండా ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు వంద మంది పోలీసులు బీచ్‌కు కాపలా కాస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వన్‌వేలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. అలల బీభత్సానికి దెబ్బతిన్న అందాల సాగరతీరాన్ని చూసిన వారు ఇప్పుడు ఎంతో ఆవేదన చెందుతున్నారు.
ఆగని పగ..
అల్పపీడనం బలహీనపడినా కెరటాల ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో సునామీ, తుపాన్లు వచ్చినప్పుడు సముద్రం ముందుకొచ్చినా ఇంతలా బీచ్‌ను నాశనం చేయలేదు. తక్షణ చర్యల్లో భాగంగా అధికారులు నగర శివారులోని ఎండాడ కొండల నుంచి పెద్దపెద్ద నల్ల రాళ్లను తెచ్చి దెబ్బతిన్న తీరంలో వేస్తున్నారు. సుందర బీచ్ తిరిగి యథాస్థితికి రావడానికి ఇంకా ఎన్నాళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఔటర్ హార్బర్ కారణమా?
విశాఖ సాగరతీరం కోతకు గురవడానికి పోర్టు ఔటర్ హార్బర్ కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కోస్టల్ బ్యాటరీ సమీపం నుంచి సముద్రంలోకి పెద్దపెద్ద సిమెంట్ రాళ్లతో ఔటర్ హార్బర్ రోడ్డులా వేశారు. దానివల్ల సముద్ర కెరటాలు అటు వెళ్లకుండా నగరం వైపునకు మళ్లడంతో ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అల్పపీడనాలు, తుపాన్లు వచ్చినప్పుడు మరింత ఒత్తిడితో తీరాన్ని తాకడం వల్ల బీచ్ కోతకు గురవుతోందని విశ్లేషిస్తున్నారు.
ధ్వంసమైన బీచ్‌ను శుక్రవారం పరిశీలించిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజా విపత్తుకు ప్రథమ ముద్దాయి పోర్టేనని ఆరోపించారు. ఔటర్ హార్బర్‌ను తొలగించాలని, లేనిపక్షంలో శాశ్వత చర్యలకయ్యే ఖర్చును పోర్టు ట్రస్టు, కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు.
నిపుణుల కమిటీ వేయాలి..
మరోవైపు పోర్టులో నిర్మాణాలు కూడా బీచ్ కోతకు కారణమవుతున్నాయని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ పేర్కొన్నారు. విశాఖ ఔటర్ హార్బర్ ప్రభావంపైన కూడా పరిశోధన చేయాలన్నారు. విశాఖ పోర్టు, పక్కనే ఉన్న గంగవరం పోర్టులు సీఆర్‌జెడ్ నిబంధనలను అతిక్రమించడంపై స్టడీ చేయాలని, తీరం ఎక్కడెక్కడ కోతకు గురవుతుందో తెలుసుకోవడానికి మత్స్యకారులతో, పూణేలోని సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బీచ్ కోత నివారణకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టాలన్నారు.